సిక్కు వ్యతిరేక అల్లర్లు : హైకోర్టు కీలక ఉత్తర్వులు

28 Nov, 2018 16:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో ప్రత్యేక న్యాయస్ధానం ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు బుధవారం సమర్ధించింది. 1984లో తూర్పుఢిల్లీలోని త్రిలోక్‌పురి ప్రాంతంలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి 88 మందిని దోషులుగా నిర్ధారిస్తూ ప్రత్యేక న్యాయస్ధానం వెలువరించిన తీర్పును ఢిల్లీ హైకోర్టు సమర్ధించింది. ఈ ఘర్షణల్లో 2800 మంది సిక్కులు మరణించగా, వీరిలో 2100 మంది బాధితులు ఢిల్లీకి చెందినవారే కావడం గమనార్హం.

కాగా 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసుకు సంబంధించి ఓ కేసులో దోషులుగా నిర్ధారించిన యశ్‌పాల్‌ సింగ్‌కు మరణశిక్ష, నరేష్‌ షెరావత్‌కు జీవిత ఖైదు విధిస్తూ ఈనెల 20న ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్ధానం తీర్పు వెలువరించింది. సిక్కు వర్గానికి చెందిన ఇద్దరిని హత్య చేసిన కేసులో వీరిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. వీరిద్దరికీ మరణ శిక్ష విధించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కోరింది. సిక్కు వ్యతిరేక అల్లర్లలో దక్షిణ ఢిల్లీలోని మహిపాల్పూర్‌ ప్రాంతంలో హర్దేవ్‌ సింగ్‌, అవతార్‌ సింగ్‌లను హత్య చేసిన కేసులో వీరు దోషులుగా తేలారు.

మరోవైపు తగిన ఆధారాలు లేవంటూ 1994లో ఢిల్లీ పోలీసులు ఈ కేసును మూసివేయగా, సిట్‌ పునర్విచారణలో న్యాయస్ధానం వీరిని దోషులుగా నిర్ధారించడం గమనార్హం.

మరిన్ని వార్తలు