గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల్లో మరో ట్విస్ట్‌

8 Aug, 2017 17:40 IST|Sakshi
రాజ్యసభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో హైడ్రామా

గాంధీనగర్‌ : గుజరాత్‌లో రాజ్యసభ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపులో హైడ్రామా చోటుచేసుకుంది. బ్యాలెట్‌ పేపర్‌ చూపించి ఓటు వేసిన ఎమ్మెల్యేల ఓట్లు లెక్కించవద్దంటూ కాంగ్రెస్‌ పార్టీ ...ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో కౌంటింగ్‌ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలతో ఎన్నికల అధికారులు చర్చిస్తున్నారు. అలాగే పోలింగ్‌ ఫుటేజీని రిటర్నింగ్‌ అధికారి పరిశీలిస్తున్నారు. 

మరోవైపు ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్‌ నేతలు రణదీప్‌ సుర్జేవాలా, ఆర్పీఎన్‌ సింగ్‌ ...ఢిల్లీలో సీఈసీని కలిశారు. రెబల్‌ ఎమ్మెల్యేల ఓట్లను పరిగణనలోకి తీసుకోవద్దని కోరారు. గుజరాత్‌ నుంచి మూడు స్థానాలకు నలుగురు అభ్యర్థులు పోటీ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ నుంచి అమిత్‌ షా, స్మృతి ఇరానీ, బల్వంత్‌ సిన్హా బరిలో నిలవగా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి అహ్మద్‌ పటేల్‌ పోటీ చేశారు.

గుజరాత్‌ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 176 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 121, కాంగ్రెస్‌కు 57 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.. ఇటీవలే ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్‌ బలం 51కి పడిపోయింది. వాఘేలా వర్గానికి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలూ కాంగ్రెస్‌కు దూరంగా ఉన్నారు. అయితే ఓటింగ్ సమయంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి.  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాఘవ్‌జీ పటేల్‌, ధర్మేంద్ర జడేజా బీజేపీకి ఓటేసినట్టు ప్రకటించారు. వీళ్లు కాకుండా మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా బల్వంత్‌సిన్హ్‌ రాజ్‌పుత్‌కే ఓటేసినట్టు సమాచారం. అలాగే అహ్మద్ పటేల్‌కు ఓటేయాలని ఎన్సీపీ అధిష్టానం విప్‌ జారీ చేసినప్పటికీ ఒక ఎమ్మెల్యే ఎదురు తిరిగినట్లు తెలుస్తోంది. ఎన్సీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే  బీజేపీకే మద్దతు పలికారు. జేడీయూ ఎమ్మెల్యే చోటూ వాసవ కూడా బీజేపీ నేతల ఎస్కార్ట్‌ మధ్యే పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. దీంతో  అహ్మద్‌ పటేల్‌ విజయం డైలమాలో పడింది. అయితే ఆయన మాత్రం తనకు 45 ఓట్లు వస్తాయని ధీమాగా చెబుతున్నారు. మరోవైపు బీజేపీ కూడా తమ మూడో అభ్యర్థి రాజ్‌పుత్‌కు 48 ఓట్లు పడ్డాయని చెబుతోంది.

బీజేపీ రాజ్యసభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అహ్మద్‌ పటేల్‌ను ఓడించేందుకు అమిత్‌ షా రంగంలోకి దిగటంతో  కాంగ్రెస్‌ పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారిని బెంగళూరుకు తరలించింది.  అయితే భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అహ్మద్‌ పటేల్‌ విజయానికి 45 మంది ఎమ్మెల్యేలు అవసరం. కానీ బెంగళూరు రిసార్ట్స్‌ నుంచి అహ్మదాబాద్‌కు ఓటేయడానికి వచ్చిన వారి సంఖ్య 44 మాత్రమే! ఇద్దరు ఎన్సీపీ సభ్యుల మద్దతు కూడా కలుపుకొంటే 46 ఓట్లతో పటేల్‌ గెలుపు ఖాయం కావాలి. కానీ 44 మందిలో అందరికి అందరూ సొంత పార్టీ అభ్యర్థికే ఓటేశారో, లేక క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారో మరికొద్దిసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి.
 

మరిన్ని వార్తలు