ఆంధ్రప్రదేశ్‌పైకి ప్రచండ అలలు

24 Apr, 2018 12:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆఫ్రికా ఖండ తీర ప్రాంతాల్లో వీస్తున్న ప్రచండ గాలుల వల్ల భారత తూర్పు తీరంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు భారత జాతీయ సముద్ర సమాచార కేంద్రం (ఇన్‌కాయిస్‌) సవరించిన ప్రకటనను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

అండమాన్‌ నికోబార్‌ దీవులు, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌, దక్షిణ తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లలోని తీర ప్రాంతాల్లో 3 నుంచి 4 మీటర్ల ఎత్తున్న రాకాసి అలలు విరుచుకుపడతాయని ఆదివారం ఇన్‌కాయిస్‌ హెచ్చరించింది. ఇదే పరిస్థితి ఈ నెల 25వ తేదీ అర్థరాత్రి వరకూ కొనసాగుతుందని చెప్పింది. ముఖ్యంగా అండమాన్‌ నికోబార్‌, తమిళనాడు, ఒడిశా తీరాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాల్లో సముద్ర నీరు బాగా ముందుకు వచ్చింది. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. కాగా, ఆదివారం కేరళ వచ్చిన పెను అలల తాకిడి తీర ప్రాంతాల్లోని 100 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సోమ, మంగళవారాల్లో అలల తీవ్రత అండమాన్‌ నికోబార్‌లో ఎక్కువగా ఉంటుందని ఇన్‌కాయిస్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు