ధనత్రయోదశికి ధరల షాక్‌..

5 Nov, 2018 17:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ధనత్రయోదశి రోజు బంగారం కొనడాన్ని శుభప్రదంగా భావించే ఆనవాయితీ ఉన్నా ఈసారి అధిక​ధరలతో బంగారం కొనుగోళ్లకు మగువలు పెద్దగా ఆసక్తి కనబరచలేదని వర్తకులు పేర్కొన్నారు. ప్రధానంగా ఉత్తరాదిలో ధనత్రయోదశికి బంగారం కొనుగోలుకు మహిళలు మొగ్గుచూపుతారు. దుకాణాలకు ప్రజలు భారీగానే తరలివస్తున్నా ధరల కారణంగా బంగారం విక్రయాలు ఆశాజనకంగా లేవని, ప్రీ బుకింగ్‌లతో కలుపుకుని అమ్మకాల్లో కేవలం 5 నుంచి 7 శాతం మాత్రమే పెరుగుదల నమోదైందని అఖిల భారత జెమ్‌ అండ్‌ జ్యూవెలరీ కౌన్సిల్‌ చైర్మన్‌ నితిన్‌ ఖండేల్‌వాల్‌ చెప్పారు.

పది‍గ్రాముల బంగారం రూ 32,000 దాటడంతో పలువురు కొనుగోలుదారులు ఆభరణాల కొనుగోలుకు వెనుకాడుతున్నారు. గత ఏడాది ధనత్రయోదశి రోజున దేశ రాజధాని ఢిల్లీలో పదిగ్రాముల పసిడి రూ 30,710 కాగా, ఇప్పుడు రూ 32,690కి ఎగబాకింది. అధిక ధరలతో బంగారానికి డిమాండ్‌ తగ్గిందని, వినియోగదారులు ఆభరణాల కంటే బంగారం, వెండి నాణేల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారని ఢిల్లీ బులియన్‌ అసోసియేషన్‌కు చెందిన సురేందర్‌ జైన్‌ పేర్కొన్నారు.

బంగారం ధరల పెరుగుదలతో మార్కెట్‌లో స్ధబ్ధత నెలకొందని, ఈసారి బంగారు నాణేలకు కార్పొరేట్‌ వర్గాల నుంచే డిమాండ్‌ నెలకొందని ఎంఎంటీసీ-పీఏఎంపీ ఇండియా ఎండీ రాజేష్‌ ఖోస్లా వెల్లడించారు.

మరిన్ని వార్తలు