హై స్పీడ్‌ ట్రైన్‌...అదిరే ఫీచర్స్‌

26 Mar, 2018 14:46 IST|Sakshi

ముంబై : భారత్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ప్రాజేక్టుల్లో బుల్లెట్‌ ట్రైన్‌ ఒకటి. జపాన్‌ సహకారంతో ముంబాయి-అహ్మదాబాద్‌ల మధ్య రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌లో ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. నేషనల్‌ హై స్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ వారి అధ్వర్యంలో బంద్రా కుర్ల కాంప్లెక్స్‌ (బీకేసీ) నుంచి నవంబర్‌లో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టు కోసం 108 గ్రామాలలోని 10వేల మంది నుంచి భూమిని సేకరించారు. ముంబాయి-అహ్మదాబాద్‌ల మధ్య 508 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,10,000 కోట్లు కాగా ఆ మొత్తంలో 88వేల కోట్లను 0.1శాతం వడ్డీతో జపాన్‌ నుంచి అప్పుగా తీసుకోనున్నారు. ఈ మొత్తాన్ని 50 సంవత్సరాలలోపు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఇంత భారీ వ్యయంతో చేపడుతున్న ఈ బుల్లెట్‌ ట్రైన్‌లో సదుపాయాలు కూడా ఆ విధంగానే ఉండబోతున్నాయని రైల్వేశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న రైళ్లలోకంటే అత్యాధునిక సాంకేతికతను బుల్లేట్‌ రైలులో వినియోగించనున్నారు. తిరిగే కుర్చీలు, కాఫీ మేకర్స్‌తో పాటు ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 508 కి.మీ మార్గంలో 468 కి.మీ ఎత్తైన ట్రాక్‌ మార్గం, 27కి.మీ సొరంగ మార్గం, 13కి.మీ మైదాన ప్రాంతంలో నిర్మించనున్నారు. మరో ఆస​క్తికర అంశం ఏంటంటే ఈ రైలు దేశంలోనే పెద్దదైన సొరంగం గుండా 21కి.మీ దూరం ప్రయాణిస్తుంది. మరో 7కిలోమీటర్లు సముద్రం గుండా ప్రయాణిస్తుంది.

ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్‌లను కలుపుకుని 12 స్టేషన్లను ప్రతిపాదించారు. జపాన్‌ టెక్నాలజీతో నిర్మితం కానున్న ఈ బుల్లెట్‌ ట్రైన్‌ గంటకు 300కిమీ వేగంతో ప్రయాణించిప్పటికి కుదుపులు ఉండవని,  నిలబడి కూడా హాయిగా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ బుల్లెట్‌ ట్రైన్‌లో 10కార్లు (కోచ్‌లు) ఉంటాయని తెలిపారు. 2033 వరకూ మరో 6కార్లను అదనంగా వీటికి జత చేయనున్నారు. ప్రసుతం ఉన్న కార్లలో 750 సీట్లు ఉంటాయని, భవిష్యత్తులో వీటి సంఖ్యను 1250కి పెంచనున్నట్లు తెలిపారు. ప్రయాణ చార్జీలు బీకేసీ నుంచి థానే వరకూ రూ.250గా, బీకేసీ నుంచి విరార్‌ వరకూ రూ.500గా, బీకేసీ నుంచి బోయిసర్‌ వరకూ రూ.750గా నిర్ణయించారు. ప్రస్తుతం ఉండబోయే 10కార్లలో ఒకటి బిజినెస్‌ క్లాస్‌ కాగా మిగితావి జనరల్‌ కంపార్ట్‌మెంట్స్‌.

ముంబాయి - అహ్మదాబాద్‌ మధ్య ప్రతిరోజు 40వేల మంది బుల్లెట్‌ ట్రైన్‌లో ప్రయాణించవచ్చని అంచనా. బుల్లెట్‌ ట్రైన్‌ను చేరుకునేందుకు 14వేల మంది తమ సొంత వాహనాలను, 6500మంది విమానం ద్వారా, మిగితావారు ఇతర రైలు మార్గాల ద్వారా చేరుకోనున్నట్లు భావిస్తున్నారు. ఈ హై  స్పీడ్‌ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు 2023 వరకూ పూర్తి కానున్నట్లు అధికారులు తెలపగా,  రైల్వే శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ మాత్రం 2022, ఆగస్ట్‌ 15నాటికి పూర్తి చేస్తానని ప్రకటించారు.

మరిన్ని వార్తలు