గుర్మీత్‌కు పద్మ అవార్డు ఇవ్వాలి!

31 Aug, 2017 19:50 IST|Sakshi
గుర్మీత్‌కు పద్మ అవార్డు ఇవ్వాలి!
  • 2017లో 89 మందికి పద్మ పురస్కారాలు
  • గుర్మీత్ పేరిట అత్యధికంగా 4,208 నామినేషన్లు
  • అత్యాచార కేసుల్లో 20 ఏళ్ల జైలుశిక్ష విధించిన సీబీఐ కోర్టు
  • న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రాం రహీమ్‌ సింగ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం తాజాగా వెలుగుచూసింది. 2017 పద్మ అవార్డులకుగానూ కేంద్ర హోంమంత్రిత్వశాఖకు ఓవరాల్‌గా 18, 768 దరఖాస్తులు రాగా, అత్యధికంగా 4,208 మంది గుర్మీత్ పేరును పద్మ అవార్డులకు ప్రతిపాదించడం గమనార్హం. దీంతోపాటుగా ఇప్పటివరకూ గుర్మీత్ సింగ్ తన పేరును ఐదు పర్యాయాలు పద్మ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తేలింది.

    మూడు పద్మ అవార్డులలో ఏదైనా ఒకటి ఇచ్చి గౌరవించాలని గుర్మీత్ పేరు ప్రతిపాదించిన వారిలో హరియానాలోని హిస్సార్ కు చెందిన సెయింట్ జార్జ్ సోనెట్, ఇండియా సెయింట్ జార్జ్‌ ఉన్నారు. సిర్సాలోని గుర్మీత్ డేరా ఆశ్రమం నుంచే ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. రాక్‌స్టార్ బాబాగా, ఆధ్యాత్మిక గురువుగా, నటుడిగా పేరొందిన గుర్మీత్‌కు సీబీఐ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన విషయం తెలిసిందే.

    సిర్సాకు చెందిన అమిత్ అనే వ్యక్తి 31 సార్లు నామినేట్ చేయగా, సునీల్ అనే వ్యక్తి 27 పర్యాయాలు పద్మ అవార్డు కోసం గుర్మీత్ పేరున దరఖాస్తు చేశారు. ఇంకా అభా, ఆదిత్య, అక్బర్, అల్ఫెజ్, బల్జిందర్, మిల్కీ, గజల్, కోమల్, జానీ, జెస్సీ, ఐశ్వార్ అనే పేర్లతో చాలామంది ఈ అవార్డు కోరినట్లు సమాచారం. మురళీ మనోహర్ జోషీ, శరద్ పవార్, లోకసభ మాజీ స్పీకర్ దివంగత నేత పీఏ సంగ్మా, క్రికెటర్ విరాట్ కోహ్లీ, నేపథ్యగాయకుడు కేజే ఏసుదాసు సహా 89 మందికి కేంద్ర ప్రభుత్వం గత ఏప్రిల్‌లో పద్మ అవార్డులను అందజేసింది.

    మరోవైపు రెండు అత్యాచార కేసుల్లో డేరా చీఫ్‌ గుర్మీత్‌(50)కు సీబీఐ కోర్టు 20 ఏళ్ల (ఒక్కో కేసులో పదేళ్లు) కఠిన కారాగార శిక్ష విధించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగ్‌దీప్‌ సింగ్‌ తీర్పు వెల్లడించారు. దీంతోపాటు ఒక్కో కేసుకు రూ. 15 లక్షల చొప్పున జరిమానాను కూడా విధించగా, బాధితురాళ్లకు రూ.14 లక్షల చొప్పున అందజేయనున్నారు.

మరిన్ని వార్తలు