బాంబు పేలుళ్లు ఇండియాలోనే ఎక్కువ

17 Feb, 2017 20:44 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతదేశంలోనే ఎక్కువగా బాంబులు పేలుతున్నాయి. గడిచిన రెండేళ్ల రికార్డులు పరిశీలిస్తే ఈ విస్మయకర విషయం బయటపడింది. గత రెండేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఇండియాలో బాంబు పేలుడు ఘటనలు నమోదయ్యాయి. ప్రతి నిత్యం బాంబులు, పేలుళ్లతో దద్దరిల్లుతాయని భావించే పాకిస్తాన్, ఇరాక్ కన్నా ఇండియాలో ఈ సంఖ్య ఎక్కువగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్ జీ) పరిధిలో నేషనల్ బాంబు డాటా సెంటర్ (ఎన్బీడీసీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారత్ లోనే అత్యధికంగా బాంబులు పేలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లోని తీవ్రవాద సంస్థలు పాల్పడే పేలుళ్ల ఘటనల వివరాలను ఎన్బీడీసీ ఎప్పటికప్పుడు సేకరించి విశ్లేషిస్తుంది. తీవ్రవాదులు అనుసరిస్తున్న పంథా, ఉపయోగిస్తున్న పేలుడు పదార్థాలను, విద్రోహా ఘటనలను విశ్లేషించి వాటికి కౌంటర్ గా అనుసరించాల్సిన వ్యూహాన్ని ఎన్బీడీసీ ప్రభుత్వానికి సూచిస్తుంది.

భారతదేశంలో గత ఏడాది 337 పేలుడు (ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైసెస్ - ఐఈడీ ఉపయోగించిన) ఘటనలు నమోదయ్యాయి. 2015 లో 268 మొత్తంగా పేలుళ్లు జరిగితే, 2014లో 190, 2013 లో 283, 2012లో 365 పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లలో ఇండియా తర్వాత ఇరాక్ రెండో స్థానంలో ఉంది. ఇరాక్ లో గతేడాది 221 బాంబు పేలుడు సంఘటనలు చోటుచేసుకున్నాయి.  ఆ తర్వాత అఫ్ఘానిస్తాన్ లో 132, టర్కీలో 71, థాయిలాండ్ లో 63, సోమాలియా, సిరియాలో కలిపి 56 ఘటనలు జరిగాయి. 2015 లో ఇరాక్ లో 170 పేలుళ్లు, పాకిస్తాన్ లో 208, అఫ్టానిస్తాన్ లో 121, సిరియా 41 సంఘటనలు జరిగాయి.

ఇక ఇండియాలో రాష్ట్రాల వారిగా పరిశీలిస్తే అత్యధికంగా చత్తీస్‌గఢ్‌లో నమోదయ్యాయి. గతేడాదిలో చత్తీస్గఢ్లో 60, జమ్ము కశ్మీర్లో 31, కేరళలో 33, మణిపూర్ లో 40, ఒడిశాలో 29, తమిళనాడులో 32, పశ్చిమ బెంగాల్ లో 30 సంఘటనలు రికార్డయ్యాయి.

గతేడాది జూలై 18 న బీహార్ లో చేటుచేసుకున్న బాంబు పేలుడు ఘటనలో అత్యధికంగా సీఆర్పీపీఎఫ్ బెటాలియన్ కు చెందిన 10 మంది కమెండోలు మృత్యువాత పడ్డారు. ఔరంగాబాద్-గయ అటవీ ప్రాంతంలో సీఆర్పీపీఎఫ్ స్వ్కాడ్ ను దాదాపు 200 మావోయిస్టులు చుట్టుముట్టి 22 ఐఈడీ పేలుళ్లకు పాల్పడ్డారు.

కొన్ని సంఘటనలు
ఆగస్టు 24 - (జమ్మూ కశ్మీర్) పుల్వామా వద్ద బాంబు దాడి చేసిన ఘటనలో 9 మంది పోలీసులు గాయపడ్డారు.
జనవరి 27 - (జార్ఘండ్) పాలము వద్ద కాన్వాయ్ వెళుతుండగా, ల్యాండ్ మైన్ పేలుడు ఘటనలో ఐదుగురు పోలీసులతో పాటు మొత్తం ఏడుగురు మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు.
మార్చి 30 - (చత్తీస్ గఢ్) దంతెవాడ సమీపంలో మావోయిస్టుల మందుపాతర పేలుడు ఘటనలో ఏడుగురు భద్రత సిబ్బంది మరణించారు.
మే 22 - (మణిపూర్) పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పాల్పడిన పేలుడు ఘటనలో అస్సోం రైఫిల్స్ కు చెందిన 29వ బెటాలియన్ లోని ఆరుగురు మరణించారు.
నవంబర్ 19 - (అస్సోం)  ఆర్మీ క్యాంపుపై ఉల్ఫా మిలిటెంట్లు పేల్చిన ఐఈడీ ఘటనలో ముగ్గురు సైనికులు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.


ఎన్బీడీసీ గణాంకాల ప్రకారం గత పదేళ్ల కాలంలో (2007-2016) మధ్య కాలంలో సగటున 277 పేలుఘటనలు చోటుచేసుకోగా, అందులో 223 మంది మరణించగా, 724 మంది గాయపడ్డారు.- హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన బుర్హన్ వని మరణం తర్వాత జమ్మూ కశ్మీర్ లో ఈ ఘటనలు పెరిగాయి
- గతేడాదితో పోల్చితే ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా మణిపూర్ (40), అసోం (11) సంఘటనల్లో 15 శాతం పెరిగాయి.
- మొత్తం ఘటనల్లో వామపక్ష తీవ్రవాద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో 47శాతం చోటుచేసుకున్నాయి.
- దేశంలోని మిగతా ప్రాంతాలను పరిశీలిస్తే కేరళ (33), తమిళనాడు (32)ల్లో అధికంగా నమోదయ్యాయి.

ప్రపంచంలోనే అతి పెద్ద బాంబు పేలుడు ఘటన
ఇప్పటివరకు జరిగిన ఘటనల్లో 2016 లో సిరియాలో జరిగిందే అతిపెద్దది. సిరియాలోని మెడిటెర్రెనియన్ తీరంలో ఉన్న జబ్లే, టార్టోస్ ల్లో మే 23 న ఐఎస్ తీవ్రవాదులు రెండు కార్లలో బాంబులు అమర్చి తమకు తాముగా ఆత్మాహుతికి పాల్పడటం ద్వారా పేల్చిన ఘటనలో 150 మంది మరణించగా, 200కు పైగా గాయపడ్డారు.  


ప్రపంచంలో తీవ్రమైన ఘటనలు
లిబియా - జనవరి 7, తీవ్రవాదులు బాంబులు పెట్టి ఒక లారీనీ పేల్చిన ఘటనలో 60 మంది పోలీసు అధికారులు బలికాగా, ఇందులో 127 మంది గాయపడ్డారు.
ఇరాక్ - ఫిబ్రవరి 28, సదర్ మార్కెట్ ప్రాంతంలో ఆత్మాహుతి దాడిలో 70 మంది ప్రాణాలు కోల్పోగా వంద మందికిపైగా గాయపడ్డారు.
పాకిస్తాన్ - మార్చి 27, గుల్షన్ ఏ ఇక్బాల్ పార్క్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 300లకుపైగా గాయాలపాలయ్యారు.
ఇరాక్ - మే 11, జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో 64 మందిని పొట్టనపెట్టుకోగా 87 మంది గాయపడ్డారు.
ఇరాక్ - జూలై 3, కరడా జిల్లాలో ఆత్మాహుతి దాడిలో 115 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 200 మందికిపైగా గాయపడ్డారు.
ఇరాక్ - నవంబర్ 24, ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు పాల్పడిన పేలుడు ఘటనలో వంద మంది షియా పర్యాటకులు మరణించారు.

ప్రపంచ వ్యాప్తంగా అదే తీరు
తీవ్రవాదులు ప్రజా సమూహాల్లోనే ఎక్కువగా బాంబులు పెడుతున్నారు. గతేడాది జరిగిన ఇలాంటి ఘటనల్లో 73శాతం ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాలను టార్గెట్ చేసుకోగా ఆ తర్వాత తీవ్రవాదులు సంచరించే ప్రాంతాల్లో రెండో టార్గెట్ భద్రతా బలగాలు. తాజాగా గురువారం పాకిస్తాన్ సింధ్ రాష్ట్రంలోని సెహ్వాన్ పట్టణంలో ఐసిస్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడిలో 70మంది మరణించగా 160 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు అదే రోజు ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో కారు బాంబు పేలుడులో 51 మంది మృత్యువాత పడగా 60మందికి పైగా గాయపడ్డారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు