హిమాచల్‌ ప్రదేశ్‌ మంత్రి కన్నుమూత

12 May, 2017 14:15 IST|Sakshi
హిమాచల్‌ ప్రదేశ్‌ మంత్రి కన్నుమూత

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌ మంత్రి కరణ్‌సింగ్‌ (59) అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందారు. ఈయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమారుడు 2012లో జరిగిన ప్రమాదంలో మృతిచెందారు. తమ స్వస్థలమైన కులుకు ఆయన భౌతిక కాయాన్ని తరలించి మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా సేవలందించారు.

కులు రాయల్‌ ఫ్యామిలీకి చెందిన కరణ్‌సింగ్‌ బీజేపీ కీలక నాయకుడు, మహేశ్వర్‌సింగ్‌కు సోదరుడు. ఈయన బంజార్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1990, 1998లలో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ధుమాల్‌ ప్రభుత్వంలో ప్రాథమిక విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరి 2012లో ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. వీరభద్రసింగ్‌ కొలువులో 2015 ఆగస్టులో మంత్రిగా నియమితులయ్యారు. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌, మాజీ ముఖ్యమంత్రి శాంతకుమార్‌, స్పీకర్‌ బీబీఎల్‌ బుటాయిల్‌, మంత్రులు, శాసనసభ్యులు, ప్రముఖ నాయకులు సంతాపం ప్రకటించారు.

>
మరిన్ని వార్తలు