ఈ ఐఏఎస్‌, ఐపీఎస్‌ దంపతులకు సెల్యూట్‌

5 May, 2017 14:02 IST|Sakshi
ఈ ఐఏఎస్‌, ఐపీఎస్‌ దంపతులకు సెల్యూట్‌

షిమ్లా: ఓ ఐఏఎస్‌, ఐపీఎస్‌ దంపతులు ఏకకాలంలో పెద్ద మనసును, దేశభక్తిని చాటుకున్నారు. పాక్‌ సైనికులు దొంగ దెబ్బకొట్టగా ప్రాణాలు కోల్పోయిన వీర జవాను కూతురును దత్తత తీసుకున్నారు. ఇక నుంచి ఆ పాప చదువు దగ్గర నుంచి పెళ్లయ్యే వరకు మొత్తం ఖర్చు తామే భరించనున్నట్లు ప్రకటించారు. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో పాక్‌ దుండగులు భారత్‌ జవాను పరమ్‌జిత్‌ సింగ్‌ తలను నరికిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మొత్తం దేశాన్ని కంటతడిపెట్టించింది.

అదే సమయంలో పరమ్‌ కుటుంబం, ఆయన కుమార్తెకు ఒక ఆసరా లేకుండా పోయిందనే ఆందోళన నెలకొంటుండగానే ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న యూనస్‌ ఖాన్‌, ఆయన భార్య ఐపీఎస్‌ అధికారిని అంజుమ్‌ ఆరా పరమ్‌ పన్నెండేళ్ల కుమార్తె ఖుష్‌దీప్‌ కౌర్‌ను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

‘ఖుష్‌దీప్‌ మేంను ఇప్పటి నుంచి దత్తత తీసుకుంటున్నాం. తను వాళ్ల కుటుంబంతోనే ఉండొచ్చు. తన పూర్తి బాగోగులు ఇక నుంచి మేం చూసుకుంటాం. ఎప్పటికప్పుడు తనను చూస్తాం. వాళ్ల ఇంటి సమస్యలు కూడా తీరుస్తాం. ఐఏఎస్‌ అయినా, ఐపీఎస్‌ కావాలనుకున్నా అది తన ఇష్టం. మేం వెన్నంటి ఉండి తనకు కావాల్సింది చూసుకుంటాం’ అని అంజుమ్‌ ఆరా చెప్పారు. అయితే, వీర జవాను కుటుంబానికి కలిగిన నష్టం మాత్రం పూడ్చలేనిదని, ఆ బాధ ఎప్పటికీ మర్చిపోలేనిదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా తమ నివాళి చెల్లించుకునే ప్రయత్నం చేస్తామంటూ చెప్పారు. ఇది బాధ్యతగల పౌరులుగా తమ విధిలాగానే భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు