కొండలెక్కగలవా..

13 Mar, 2019 08:43 IST|Sakshi

చుట్టూ ఎత్తయిన పచ్చని కొండలు, వాటి మీదుగా అలుముకున్న నీలి మబ్బులు, అందమైన లోయలు, ఆహ్లాదకరమైన వాతావరణం. అదే హిమాచల్‌ ప్రదేశ్‌. పర్యాటకులకు ఒక స్వర్గం. కానీ ఇక్కడ ఎన్నికల నిర్వహణ నరకం. ఎన్నికల సిబ్బంది నానా పాట్లు పడాలి. దేశంలో అత్యంత ఎతైన పోలింగ్‌ స్టేషన్‌ ఇక్కడే ఉంది. కనీస సౌకర్యాలు లేని పోలింగ్‌ స్టేషన్‌ ఇక్కడే.  అత్యంత తక్కువ మంది ఓటర్లు ఉన్నదీ ఇక్కడే. ఇలా ఎన్నో ప్రత్యేకతలు హిమాచల్‌ ప్రదేశ్‌ సొంతం. ఈ రాష్ట్రంలో మొత్తం నాలుగు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. మే 19న పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల కమిషన్‌ మొత్తం 7,723 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేస్తే వాటిలో 367 పోలింగ్‌ బూత్‌లకు చేరుకోవడం అత్యంత దుర్లభం. హిక్కిమ్‌ ప్రాంతంలో పోలింగ్‌ స్టేషన్‌ అత్యంత ఎతైనది. సముద్ర మట్టానికి 14,567 ఎత్తులో ఇది ఉంది. ఇక చంబా జిల్లాలోని  శక్తి పోలింగ్‌ బూత్‌కి వెళ్లాలంటే ఎన్నికల సిబ్బంది సామాగ్రి మోసుకుంటూ 20 కి.మీ. నడిచి వెళ్లాలి. మరో మార్గమే లేదు. ఉనా జిల్లాలో శాంతోఖగ్రా బూత్‌లో అత్యధికంగా 1,359 మంది ఓటర్లు ఉంటే, లాహాల్‌ స్పితి జిల్లాలోని కింగర్‌లో అతి తక్కువగా 37 మంది ఓటర్లు ఉన్నారు. ఇక మహిళలే 136 పోలింగ్‌ స్టేషన్లలో విధులు నిర్వహించడం అత్యంత విశేషంగా చెప్పుకోవాలి.

మరిన్ని వార్తలు