రక్తపాతమే

6 Oct, 2014 03:05 IST|Sakshi
రక్తపాతమే

- శ్రీరామ సేనను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు
- మహారాష్ర్టలో బీజేపీకి ఓటమి తప్పదు
- ప్రమోద్ ముతాలిక్

సాక్షి, బెంగళూరు :  హిందు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న శ్రీరామ సేన సంస్థను రద్దు చేస్తే రాష్ట్రంలో రక్తపాతం తప్పదని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రమోద్‌ముతాలిక్ హెచ్చరించారు. ఇందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. బాగల్‌కోటేలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీరామ సేన సంస్థకు చట్టబద్దత ఉందని తెలిపారు. అందువల్ల దీనిని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు.   ఆర్‌ఎస్‌ఎస్ పట్ల చలకనగా మాట్లాడటం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దివాళకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. దేశ రక్షణ కోసం కృషి చేస్తున్న సంస్థల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ది అగ్రస్థానమని ప్రశంసించారు.

మహారాష్ట్రలో బీజేపీ నుంచి వేరు పడిన శివసేన పార్టీ ఎన్నికల్లో గెలుపుకోసం శ్రీరామసేన మద్దతు కోరుతోందని తెలిపారు. హిందుత్వపై కాని, ఆ మతానికి సంబంధించిన సంస్థలకు, ప్రజల సంక్షేమం కోసం బీజేపీ నేతలు ఎలాంటి సహకారం అందించారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్ర సీఎం పీఠంపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ కన్నువేశారని, అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం తథ్యమని జోష్యం చెప్పారు.  తాను భాష, సరిహద్దు కోసం కాకుండా హిందు మత పరిరక్షణ కోసం పాటు పడ్డానన్నారు. ఎన్ని ఆటు పోటులు ఎదురైనా ఇకపై ఇదే పంథాలో ప్రయాణిస్తానని ముతాలిక్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు