విద్యార్థులకు కత్తుల పంపిణీ..!

30 May, 2019 15:11 IST|Sakshi

హిందూ మహాసభ అత్యుత్సాహం

వీర్‌ సావర్కర్‌ జయంత్యుత్సవాల్లో ఘటన

ఆగ్రా : స్వాతంత్ర సమరయోధుడు, హిందూ మహాసభ దిగ్గజ నాయకుడు వీర్‌ సావర్కర్‌ (వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌) జయంత్యుత్సవాలు మంగళవారం దేశవ్యాప్తంగా జరిగాయి. దానిలో భాగంగా అఖిల భారత హిందూ మహాసభ నాయకులు ఆగ్రాలో 10, 12 తరగతుల పిల్లలకు కత్తుల్ని పంపిణీ చేశారు. హిందూ సమాజం సాధికారత సాధించేందుకు.. ముఖ్యంగా యువత ఆత్మరక్షణ, దేశ రక్షణకు జాగురూకులై ఉండేందుకు కత్తులను పంపిణీ చేస్తున్నామని హిందూమహాసభ జాతీయ కార్యదర్శి పూజా శకున్‌ చెప్పారు. విద్యార్థులకు కత్తులతో పాటు భగవద్గీత ప్రతులను కూడా అందిస్తున్నామని తెలిపారు.

మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెచ్చుమీరుతున్నాయని, ఆత్మ రక్షణ కోసం యువతులకు ఆయుధ శిక్షణ అవసరమని పేర్కొన్నారు. ఇక సావర్కర్‌ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. ప్రజల్లో దేశభక్తి రగిల్చి ఎందరికో ధీరోదాత్తమైన స్ఫూర్తిని అందించిన సావర్కర్‌ కృషి మరువలేనిదని అన్నారు. జాతీనిర్మాణం కోసం పనిచేసిన ఆయన సదాస్మరణీయుడని ట్వీటర్‌లో పేర్కొన్నారు.

‘రాజకీయాల్లో హిందూకీకరణ.. హిందువుల్లో సైనికీకరణ.. అనేది సావర్కర్‌ నినాదం. నరేంద్రమోదీ దేశ ప్రధానిగా ఎన్నికై సావర్కర్‌ కలను నెరవేర్చారు. ఇక రెండోది. దేశ రక్షణ కోసం ప్రతి హిందువు సైనికుడిగా మారాలి. అందుకోసమే.. యువతకు కత్తులను అందిస్తున్నాం’అని హిందూ మహాసభ అదికార ప్రతినిధి అశోక్‌ పాండే చెప్పారు. దేశంలో ఇప్పటికే మతపరమైన దాడులు జరగుతున్న నేపథ్యంలో అఖిల భారత హిందూ సభ అత్యుత్సాహం ప్రదర్శించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు