మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

19 Nov, 2015 18:31 IST|Sakshi
మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

మధురై: రెండు వేర్వేరు మతాలకు చెందినవారు ఒకే మత ఆచారం ప్రకారం పెళ్లి చేసుకుంటే ఆ వివాహం చట్టబద్ధం కాదని మద్రాసు హైకోర్టు  గురువారం సంచలన తీర్పును వెలువరించింది.  రెండు విభిన్న మతాలకు చెందిన స్త్రీ, పురుషుడు ఏదో ఒక మతాచారం ప్రకారం పెళ్లి చేసుకుంటే చెల్లదని చెప్పింది. కేవలం ప్రత్యేక వివాహ చట్టం ప్రకారమే రెండు మతాల మధ్య జరిగిన వివాహాలు చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది.

ఓ హిందూ మతానికి చెందిన అమ్మాయి, క్రైస్తవమతానికి చెందిన అబ్బాయి గుడిలో వివాహం చేసుకున్నారు. అయితే, ఈ వివాహాన్ని అంగీకరించని అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని మద్రాసు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో దీనిని విచారించిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.ఆర్. శివకుమార్, జస్టిస్ వి.ఎస్.రవి తీర్పును వెలువరించారు. దీని ప్రకారం ఇద్దరు వేర్వేరు మతాలకు చెందిన వారు వివాహం చేసుకోవాలనుకుంటే ముందు వారిలో ఒకరు మరొకరి మతాన్ని స్వీకరించాలని ఆ తర్వాత జరిగే వివాహమే చెల్లుబాటవుతుందని పేర్కొంది.  1954   ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం, మత మార్పిడి అవసరం లేకుండానే వీరి వివాహాన్ని నమోదు చేయాల్సి వుందని సూచించింది.
మేజర్ అయిన ఆ యువతికి ఎక్కడికైనా వెళ్లి నివసించే హక్కు ఉందని, ఆమెకు తల్లిదండ్రులు, ఇతరుల రక్షణ అవసరం లేదని కూడా చెప్పింది.

మరిన్ని వార్తలు