మతసామరస్యానికి ‘పెద్దల’ చొరవ

3 Nov, 2014 23:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మొహర్రం ఊరేగింపు విషయమై వాయవ్య ఢిల్లీలోని బవానాలో రెండు మతాల మధ్య తలెత్తిన ఉద్రికత్తను తగ్గించడానికి ఇరుమతాల పెద్దలు శ్రీకారం చుట్టారు. కొన్నాళ్లుగా గ్రామంలో హిందూ- ముస్లింల మధ్య సామరస్యం లోపించింది. ఈక్రమంలోనే ముస్లింలు మొహర్రం రోజు నిర్వహించే తాజియా ఊరేగింపు మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. తమ ప్రాంతాల గుండా వెల్లకూడదని పలువురు హిందువులు ఆదివారం జరిగిన మహాపంచాయత్‌లో డిమాండ్ చేయడంతో ఈ దుస్థితి దాపురించింది. దీంతో రెండు మతాల పెద్దలు చొరవతీసుకుని ఇరుమతాల వారికి నచ్చజెప్పడంతో పరిస్థితి కొంత చక్కబడింది. హిందువులు నివసించే ప్రాంతాల  గుండా తాజియా ఊరేగింపు నిర్వహించమని ముస్లింలు లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది.
 
 మహా పంచాయతీకి మొర
 బవానా గ్రామంలో ఓ చిన్న కాలవకు ఒక పక్క హిందువుల కాలనీ, మరో పక్క ముస్లింల కాలనీ ఉంది. ప్రతి ఏటా మొహర్రం రోజు ముస్లింలు నిర్వహించే ‘తాజియాల ఊరేగింపు’ హిందువుల కాలనీ గుండా, మార్కెట్ గుండా సాగుతోంది. గతేడాది కూడా చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకొంది. ఈ విషయంపై ఈ సారి కూడా రెచ్చగొట్టే పోస్టర్లు గ్రామంలో గోడలపైనా కరనిపించడం, తాజియా ఊరేగింపు నిషేధించాలన్న డిమాండ్‌తో వాట్సప్ ద్వారా ప్రచారం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఊరేగింపుు రెచ్చగొట్టేదిగా, హింసాత్మకంగా మారే ప్రమాదం ఉందని హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తూ, తమ కాలనీ గుండా అనుమతించరాదనే డిమాండ్‌కు తెరలేపారు. ఈ క్రమంలోనే ఆదివారం బవానా గ్రామంలో మహాపంచాయత్ జరిగింది. ఇందులో 1000 మంది పాల్గొన్నారు. వారంతా ఊరేగింపు తమ కాలనీ గుండా ఊరేగింపు వెళ్లడాన్ని వ్యతిరేకించారు.
 
 పీస్ కమిటీ ఏర్పాటు
 మొహర్రం ను పురస్కరించుకుని త్రిలోక్‌పురిలో జరిగే నాలుగు ఊరేగింపులలో 30 మంది హిందూ వాలంటీర్లు పాల్గొంటారని అమన్ కమిటీ  ( శాంతి కమిటీ) సభ్యుడు  రియాజుద్దీన్ సైఫీ చెప్పారు. ఒక్కొక్క ఊరేగింపులో 400 మంది పాల్గొంటారన్నారు. ఈ ఊరేగింపులో పాల్గొనే పీస్ కమిటీకి చెందిన హిందూ- ముస్లిం వాలంటీర్లు అనుమానాస్పద వ్యక్తులపై కన్నేసి ఉంచుతారని ఆయన చెప్పారు. వారి కార్యకలాపాలను తక్షణమే పోలీసులకు తెలియచేస్తారని ఆయన చెప్పారు.
 
 త్రిలోక్‌పురి, బవానాలో పోలీసులు అప్రమత్తం
 ఇటీవల త్రిలోక్‌పురి మతఘర్షణలతో అట్టుడికి పోయిన నేపథ్యంలో బవానాలో కూడా అదే పరిస్థితి తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. బవానాలో అదనంగా 800 మంది పోలీసు సిబ్బందిని మోహ రించారు. త్రిలోక్‌పురిలో మొహర్రం ఊరేగింపు ప్రశాంతంగా సాగడానికి పోలీసులు గట్టి ఏర్పాట్లు చేశారు. అదనంగా 200 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. బ్లాక్ 27 నుంచి త్రిలోక్‌పురిలోని కోట్లా వద్ద గల కర్బలా వరకు కిలోమీటరు పొడువునా మొహర్రం ఊరిగింపు వెంట పోలీసులు నడుస్తారు. ఊరేగింపులో బ్లేడ్లు, చైన్లు, కొరడాలను వినియోగించడాన్ని నిషేధించారు. తాజియాల ఊరేగింపులో పాల్గొనే ముస్లింలు  సాధారణంగా ఈ పరికరాలతో ఒంటిని గాయపరచుకుని తమను తాము హింసించుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితి దష్ట్యా ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని పోలీసుల విజ్ఞప్తి చేయడంతో అంగీకరించారు.
 
 అధికారులదే బాధ్యత

 బవానాకు ప్రాతినిధ్యం వహిస్తోన్న బీజేపీ ఎమ్మెల్యే గూగన్ సింగ్ మాట్లాడుతూ.. తాజియా ఊరేగింపు కొనసాగితే, జరిగే హింసాకాండకు అధికార యంత్రాంగమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ చెందిన కౌన్సిలర్ దేవేంద్ర కుమార్ కూడా ఊరేగింపు నిర్వహిస్తే ఉద్రిక్తతలు చోటుచేసుకొంటాయన్నారు.
 
 రెచ్చగొడుతున్న బీజేపీ : ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్
 ఇదిలా ఉండగా బీజేపీ మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. త్రిలోక్‌పురి, నంద్‌నగరి, బవానా, ముండ్కా  ప్రాంతాలలో బీజేపీ విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుడు షకీల్ అహ్మద్ కూడా ఇటువంటి ఆరోపణలే చేశారు.
 
 
 మొహర్రం సందర్భంగా  భద్రత పటిష్టం
 న్యూఢిల్లీ: మొహర్రం సందర్భంగా రాజధాని నగరమంతటా పటిష్టమైన భద్రతాఏర్పాట్లు చేశామని నగర పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ సోమవారం చెప్పారు. పుకార్లు సృష్టించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. సీనియర్ పోలీస్ అధికారులు స్థానికంగా శాంతి కమిటీలతో సంప్రదింపులు జరిపారని, మొహర్రం ఊరేగింపుల సందర్భంగా శాంతిని కాపాడుతామని రెండు మతాలకు చెందిన వారు హామీ ఇచ్చారని బస్సీ తెలిపారు. ఇదిలా ఉండగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సీనియర్ అధికారులతో సమావేశమై నగరంలో పరిస్థితిని సమీక్షించారు.
 

మరిన్ని వార్తలు