తెలంగాణ.. పాస్

19 Feb, 2014 01:37 IST|Sakshi
తెలంగాణ.. పాస్
  • లోక్‌సభలో బిల్లుకు ఆమోదం
  • ఒక్కటైన కాంగ్రెస్, బీజేపీ.. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేత
  • వచ్చిన సవరణలు 62.. నెగ్గింది 38.. అన్నీ అధికారిక సవరణలే
  • సవరణలేవీ ప్రతిపాదించని బీజేపీ.. విపక్షాల గందరగోళం మధ్యే ఓటింగ్
  • ఆందోళనలను పట్టించుకోని స్పీకర్.. నిరసనగా పలు పక్షాల వాకౌట్
  •  సాక్షి, న్యూఢిల్లీ: ఆద్యంతం విపక్షాల నిరసనలు, నినాదాలు, గందరగోళం మధ్య అత్యంత నాటకీయ పరిస్థితుల్లో తెలంగాణ బిల్లు మంగళవారం లోక్‌సభ ఆమోదం పొందింది. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఒక్క సవరణ కూడా ప్రతిపాదించకుండా బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో అధికార కాంగ్రెస్‌కు పని మరింత సులువైంది. అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఒక్కటై బిల్లును, అధికారిక సవరణలను ఆమోదింపజేసుకున్నాయి. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ఇతర పార్టీల సభ్యులు కూడా విభజనకు వ్యతిరేకంగా వెల్‌లో ఆందోళనకు దిగారు.
     
    సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్, అన్నాడీఎంకే, శివసేన, బిజూ జనతాదళ్ ఎంపీలూ వారికి తోడయ్యారు. దాదాపు 100 మంది ఎంపీలు వెల్‌లోకి వెళ్లి నినాదాలతో హోరెత్తించారు. అయినా పాలక పక్షం పట్టించుకోలేదు. హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, ఇతర అగ్ర నేతలను కాపాడేందుకు పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ సభ్యులు అరోన్ రషీద్, లాల్‌సింగ్, భక్తచరణ్ దాస్, హందుల్లా సయీద్, మహాబల్ మిశ్రా తదితరులు వారి చుట్టూ రక్షణ కవచంలా నిలిచారు. ముఖ్యంగా సోనియాగాంధీ తదితరులు కూర్చున్న ముందు వరుస సీట్లకు కాపు కాశారు. దాంతో మంగళవారం ఆద్యంతం లోక్‌సభ పూర్తిస్థాయి యుద్ధక్షేత్రాన్ని తలపించింది. పైగా పార్లమెంటు చరిత్రలోనే ఎన్నడూ లేని రీతిలో సభ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపేసి మరీ ఓటింగ్ ప్రక్రియ కొనసాగించారు. సభ్యులవారీగా కాకుండా లోక్‌సభ నియమావళిలోని 367వ నిబంధన సబ్ రూల్ 3 ప్రకారం స్పీకర్ మీరాకుమార్ ఓటింగ్ నిర్వహించారు.
     
    ‘‘సభ్యులు తమ స్థానాల్లోంచి లేచి ‘ఆయ్’ అనో లేదా ‘నో’ అనో చెబితే లెక్కించేందుకు వీలుంటుంది. కాబట్టి అంతా తమ తమ స్థానాల్లోకి వెళ్లండి. సభ్యులు తమ స్థానాల్లో లేనప్పుడు లెక్కించే వీలుండదు’ అని పేర్కొంటూ ఓటింగ్ నిర్వహించారు. విపక్షాల సభ్యులు ఓటింగ్ కోరిన ప్రతిసారీ ఆమె ఈ నిబంధనను చదివి విన్పించారు. కాంగ్రెస్‌తో పాటు ఎంఐఎం, తృణమూల్, డీఎంకే వంటి పలు పార్టీలు 62 సవరణలు ప్రతిపాదించాయి. వీటిలో అధికార పార్టీకి చెందిన 38 సవరణలు మాత్రమే ఆమోదం పొందాయి. మిగతావాటిలో కొన్నింటిపై ఓటింగ్ నిర్వహించి, మరికొన్నింటిని మూజువాణి ఓటుతో తిరస్కరించారు. కాంగ్రెస్, బీజేపీ సభ్యులు తమ స్థానాల్లోంచి లేచి ‘నో’ అనడంతో అవన్నీ వీగిపోయాయి. అలా గంటన్నర పాటు సాగిన ప్రక్రియ అనంతరం తెలంగాణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. దాంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రమంలో అత్యంత కీలక ఘట్టం ముగిసింది. నేడో రేపో బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది. అక్కడ కూడా ఆమోదం పొందడం లాంఛనమే. అనంతరం ఉభయ సభలూ ఆమోదించి తనకు పంపిన తెలంగాణ బిల్లును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదిస్తారు. ఆ మేరకు గెజిట్‌లో పేర్కొన్న తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉనికిలోకి వస్తాయి. స్పీకర్, పాలకపక్షం వైఖరికి నిరసనగా తృణమూల్, అన్నాడీఎంకే, శివసేన, బిజూ జనతాదళ్ లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి. విభజన తీరును నిరసిస్తూ రాష్ట్రపతిని కలుస్తామని తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ ప్రకటించారు. ఈ విషయంలో కాంగ్రెస్ తీరు దుర్మార్గమంటూ ఎస్పీ, డీఎంకే, జేడీ(యూ) నేతలు మండిపడ్డారు.
     
      షిండే ప్రసంగంతో ప్రారంభం
      మంగళవారం ఉదయం 11 గంటలకు ఒకసారి వాయిదాపడిన తరవాత మధ్యాహ్నం 12కు లోక్‌సభ తిరిగి సమావేశమైంది. తొలుత మంత్రులు, సభ్యులు పలు నివేదికలు ప్రవేశపెట్టారు. తర్వాత సీమాంధ్ర ఎంపీ హర్షకుమార్ అవిశ్వాస తీర్మానంపై నోటీసిచ్చారని 12.12 గంటలకు స్పీకర్ తెలిపారు. ‘గందరగోళం మధ్య 50 మంది సభ్యులను లెక్కించలేను. మీ స్థానాల్లోకి వెళ్లి కూర్చోండి’ అన్నా లాభం లేకపోయింది. సభ అదుపులో లేనందున అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టలేకపోతున్నట్టు చెప్పారు.
     
      ముహూర్తం... 12.14!
      సరిగ్గా మధ్యాహ్నం 12.14 గంటలకు స్పీకర్ ‘ఐటం నంబర్ 41. సుశీల్‌కుమార్ షిండే’ అని చదివారు. వెంటనే ఆయన లేచి ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును పరిశీలించాలని కోరుతున్నాను’ అన్నారు. వెంటనే బిల్లును వ్యతిరేకిస్తున్న సభ్యులు నినాదాలను తీవ్రతరం చేశారు. స్పీకర్ మరోసారి పిలవడంతో, ‘నేను బిల్లు ఆమోదం కోరుతున్నా’ అని షిండే అన్నారు. గందరగోళం పెరగడంతో ‘సభను సజావుగా సాగనివ్వాలని స్పీకర్ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఆమె మరోసారి పిలవడంతో షిండే మళ్లీ లేచి, ‘బిల్లును పరిశీలన కోసం పెట్టాను. దాన్ని పరిశీలించి,  ఆమోదించాలని కోరుతున్నా’ అన్నారు. రభస పెరగడంతో సభను 12.45 దాకా స్పీకర్ వాయిదా వేశారు.
     సాగని చర్చ..
     
     12.45కు సభ ప్రారంభమైంది. అప్పటికే కనుమూరి బాపిరాజుతో పాటు ఎ.సంపత్, జి.కె.రితీశ్ తదితర ఇతర రాష్ట్రాల సభ్యులు కూడా స్పీకర్ పోడియం వద్ద గుమికూడారు. ఈలోపు స్పీకర్ పిలుపు మేరకు షిండే లేచి ప్రసంగం ప్రారంభించారు. ‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమం చాలా సుదీర్ఘమైన చరిత్ర కలిగినది. ఆ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భాగమైనప్పటికీ రాజకీయంగా, సాంస్కృతికంగా ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంది. తెలంగాణలోనూ, ఆంధ్రాలోనూ ప్రత్యేక రాష్ట్రాల కోసం 1960, 1970ల్లో ఉద్యమాలు తారస్థాయికి చేరాయి. చర్చలు, ఒప్పందాల ద్వారా అవి పరిష్కారమైనా కొన్నేళ్లుగా తెలంగాణలో సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆకాంక్షలు పునరుత్థానం చెందాయి’ అన్నారు. మరోసారి సభ అదుపు తప్పడంతో మధ్యాహ్నం 3 గంటల దాకా వాయిదా వేశారు.
     
     మధ్యాహ్నం 3.. అసలు కథ ఆరంభం...
     మధ్యాహ్నం 3 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే కావూరి సాంబశివరావు, చిరంజీవి, కె.బాపిరాజు, ఇతర రాష్ట్రాల ఎంపీలు వెల్‌లో ఆందోళన కొనసాగించారు. అయినా స్పీకర్ సూచన మేరకు షిండే ప్రసంగం కొనసాగించారు. ‘ఈ బిల్లును ఆమోదించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను పునర్వ్యవస్థీకరించడంతో రెండు ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటవుతాయి. తద్వారా తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష నెరవేరుతుంది. విభజన వల్ల ఏర్పడే సమస్యలన్నింటినీ అందరితో చర్చించి, మాకు చేతనైనంతగా పరిష్కరించడానికి ప్రయత్నించాం. ఆంధ్రప్రదేశ్ అంతటి నుంచీ అనేకసార్లు సవరణలు స్వీకరిచామని, బిల్లు రూపకల్పనలో వాటన్నింటికీ సరైన రీతిలో చోటు కల్పించగలిగామని గర్వంగా చెప్పగలుగుతున్నా. అసెంబ్లీ అభిప్రాయంతో పాటు అనేక సవరణలు వచ్చాయి. వాటన్నిటంటినీ ప్రభుత్వం పరిశీలించింది. ఆ సవరణలన్నింటినీ సభ ముందు పరిశీలనకు పెట్టడమైంది. ఏర్పడబోయే రెండు రాష్ట్రాలకు సంబంధించి చట్ట సభలు, ఆదాయ పంపిణీ, ఆస్తులు, నీటి వనరుల అభివృద్ధి, నిర్వహణ, విద్యుత్తు, సహజ వనరులు, శాంతి భద్రతలు... ఇలా అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్నాం. బిల్లులోని ప్రతిపాదనలన్నింటికీ ప్రణాళికా సంఘం, ఎన్నికల సంఘం సహా పలు ప్రభుత్వ శాఖలు కసరత్తు చేసి తుది రూపమిచ్చాయి. కాబట్టి ఈ బిల్లును పరిశీలనకు తీసుకుని ఆమోదించాలని కోరుతున్నా’’ అన్నారు.
     
     బీజేపీ పూర్తి మద్దతు: సుష్మ
     అనంతరం ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ ప్రసంగిస్తూ బిల్లుకు బీజేపీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తరువాత 3.10కి తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ప్రసంగించారు. ‘తెలంగాణ డిమాండ్ 60 ఏళ్ల నాటిది. ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం ఇంత సుదీర్ఘ చరిత్ర కలిగిన ఉద్యమం ఎన్నడూ జరగలేదు’ అన్నారు. బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు సమాజ్‌వాదీ నేత శైలేంద్రకుమార్, టీఎంసీ సభ్యుడు సౌగతా రాయ్ స్పీకర్‌కు నోట్ ద్వారా తెలిపారు. బిల్లుకు సీపీఐ మద్దతిస్తోందని ఆ పార్టీ సభ్యుడు గురుదాస్ దాస్‌గుప్తా నోట్ ఇచ్చారు. పనబాక లక్ష్మి, బొత్స ఝాన్సీ, పొన్నం ప్రభాకర్, సురేశ్ షెట్కార్, మధుయాష్కీ, వివేక్ తదితరులు కూడా తమ అభిప్రాయాలను నోట్ ద్వారా ఇచ్చారు.
     
     క్లాజులవారీగా ఓటింగ్
     అనంతరం, ‘బిల్లును పరిశీలించాలంటూ వచ్చిన తీర్మానాన్ని సభ పరిగణనలోకి తీసుకుంది’ అని స్పీకర్ ప్రకటించారు. బిల్లులోని అంశాలను క్లాజులవారీగా సభ పరిగణనలోకి తీసుకుంటుందని పేర్కొన్నారు. అలా క్లాజ్ 2, క్లాజ్ 3, క్లాజ్ 4 దాకా పరిగణనలోకి తీసుకున్నాక, ఈ విధానం సరికాదంటూ డీఎంకే సభ్యుడు టి.ఆర్.బాలు అభ్యంతరం తెలిపి వాకౌట్ చేశారు. క్లాజ్ 5ను పరిశీలనలోకి తీసుకుంటుండగా సౌగతా రాయ్ సవరణలు ప్రతిపాదించారు. ‘పదేళ్లకు మించకుండా ఉమ్మడి రాజధాని’ అన్న అంశానికి బదులు.. ‘కొత్త రాజధాని ఏర్పడే దాకా’ అని మార్చాలని కోరారు. బిల్లులో 2వ పేజీ 38వ లైన్‌లో ‘కొత్త రాజధాని ఏర్పడ్డాక’ అని చేర్చాలని కోరారు. దాంతో ఆయన కోరిన  సవరణలపై ఓటింగ్ ఉంటుందని స్పీకర్ పేర్కొన్నారు. అందుకు రాయ్ డివిజన్ కోరగా, ఈ సందర్భంలో అది అనవసరం అన్పిస్తోందని బదులిచ్చారు. ‘‘రూల్ 367 సబ్ రూల్ 3 ప్రకారం సభ్యులు వారి స్థానాల్లో లేచి ‘ఆయ్’, ‘నో’ అని చెబితే లెక్కించే వీలుంటుంది. కాబట్టి అంతా తమ స్థానాల్లోకి వెళ్లండి. ‘ఆయ్’ అనే వారు లేవండి’’ అన్నారు. రాయ్ మళ్లీ డివిజన్ కోరారు. డివిజన్‌కు ఏ రూల్‌లోనూ మినహాయింపు లేదని వాదించారు. సభ్యులు తమ స్థానాల్లో లేనప్పుడు లెక్కించడం కుదరదని స్పీకర్ బదులిచ్చారు. వెంటనే, ‘నో’ అనేవారు లేచి నుంచోవాలని పేర్కొన్నారు. వారి సంఖ్యే ఎక్కువగా ఉన్నందున రాయ్ తీర్మానం వీగిందని ప్రకటించారు. రాయ్ ఇలాగే మరిన్ని సవరణలు ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు తాము వ్యతిరేకమని పదేపదే నినదించారు. ఏ ప్రాతిపదికన విభజిస్తున్నారంటూ ప్రశ్నించారు. దీనిపై చర్చ సాగాలని పట్టుబట్టారు. విభజనను వ్యతిరేకిస్తూ తృణమూల్ సభ్యులంతా ‘నేడు కళంక దినం’, ‘రాహుల్-మోడీ కుమ్మక్కు’, ‘సోనియా-సుష్మా కుమ్మక్కు’ అంటూ నినదించారు.
     
     ఎంఐఎం తీర్మానాలే అధికం
     విపక్షాల సవరణ ప్రతిపాదనల్లో ఎంఐఎంవే ఎక్కువగా ఉన్నాయి. వీటిని అసదుద్దీన్ ఒవైసీ ప్రతిపాదించారు. ‘ఖైరతాబాద్ రెవెన్యూ మండలం రెండేళ్లకు మించకుండా తాత్కాలిక ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. రెండేళ్లు ముగిశాక హైదరాబాద్ తెలంగాణకు రాజధానిగా కొనసాగుతుంది’ అంటూ బిల్లులో పేజీ నంబరు 2లో 35వ లైను నుంచి 43వ లైను దాకా చేర్చాలన్నారు. ‘‘జీహెచ్‌ఎంసీని ఉమ్మడి రాజధాని చేయడం తగదు. పైగా దాన్ని గవర్నర్ ఎలా పాలిస్తారు? రాజ్యాంగపరంగానూ ఇది సమ్మతం కాదు. తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆత్మాభిమానం ఏమైందో అర్థం కావడం లేదు. ఈ ప్రతిపాదన కారణంగా హైదరాబాద్ మొత్తం నాశనమవుతుంది. తెలంగాణకు తక్షణం ప్రత్యేక హైకోర్టు ఉండాలి’’ అన్నారు. ఇలా ఎంఐఎం ప్రతిపాదించిన సవరణలన్నీ వీగిపోయాయి. డివిజన్ విధానాన్ని రాయ్, ఒవైసీ మరోసారి తప్పుబట్టగా అది సరైనదేనంటూ స్పీకర్ మళ్లీ వివరణ ఇచ్చారు. తరువాత క్లాజు 9 నుంచి 14 వరకు పరిగణనలోకి తీసుకున్నారు. అధికారిక సవరణ తీర్మానాలన్నింటినీ షిండే ప్రతిపాదిస్తూ, వాటిని అవసరమైన క్లాజులకు చేర్చుకుంటూ వచ్చారు. అవన్నీ ఆమోదం పొందాయి. ఇదంతా సుమారు గంటన్నరపాటు జరిగింది. చివరగా సరిగ్గా సాయంత్రం 4.23 గంటలకు... సవరణలతో కూడిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై స్పీకర్ ఓటింగ్ కోరారు. కాంగ్రెస్, బీజేపీ సభ్యులు తమ స్థానాల్లోంచి లేచి మద్దతు పలికారు. దాంతో బిల్లు సభ ఆమోదం పొందిందని స్పీకర్ ప్రకటించారు. వెంటనే సభను బుధవారానికి వాయిదా వేశారు.
     
     కమలనాథులతో కమల్‌నాథ్ మంతనాలు
     లోక్‌సభలో విభజన బిల్లును ఆమోదింపజేసుకునే విషయంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ కీలకపాత్ర పోషించారు. సుష్మ, అద్వానీ, రాజ్‌నాథ్ తదితర బీజేపీ అగ్రనేతలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. బిల్లుకు మద్దతిస్తామని అద్వానీ మినహా మిగతా వారంతా హామీ ఇచ్చారు. ఓటింగ్ చేపట్టినా, లేక మూజువాణి ఓటుతో ఆమోదించినా అభ్యంతరపెట్టబోమని స్పష్టం చేశారు. ఆ తర్వాతే కాంగ్రెస్ తన ‘సభా వ్యూహాన్ని’ ధైర్యంగా అమలు చేసింది. సభలో ఇతర పార్టీ ఎంపీల దాడిని ‘కాచుకోవడం’పై దృష్టి సారించారు. మధ్యాహ్నం 3 గంటలకు బిల్లుపై చర్చ ప్రారంభమైనప్పుడు స్పీకర్, షిండేల వద్దకు ఎవరూ రాకుండా వారి వద్ద ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీలను మోహరించారు. ఎందుకైనా మంచిదని మార్షల్స్‌నూ సిద్ధం చేశారు.
     
     కాంగ్రెస్‌కు కలిసొచ్చిన నిరసనలు
     రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించుకునే విషయంలో సభలో జరిగిన ఆందోళన కాంగ్రెస్ కలిసొచ్చింది. సభ సజావుగా సాగితే బిల్లుపై చర్చ జరిగేది. సవరణలవారీగా ఓటింగ్‌కు విపక్షాలు పట్టుబట్టేవి. అలా ఒక్కో సవరణపై ఓటింగ్ అంటే ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారేది. పైగా శాస్త్రీయంగా ఓటింగ్ జరపాల్సి వస్తే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం విపక్షాలకు తేలికయ్యేది. కానీ సీమాంధ్ర కేంద్ర మంత్రులు వెల్‌లోకి గొడవ చేయడంతో వారే అధికార పార్టీ నెత్తిన పాలు పోసినట్టయింది. ఇతర పార్టీల సభ్యులూ వారికి జత కలవడంతో గందగరోళం మధ్యే ఓటింగ్‌ను ప్రభుత్వం మమ అన్పించింది.
     
     అద్వానీ నిష్ర్కమణ... రాజ్యసభలోనే మన్మోహన్
     విభ జన బిల్లుపై లోక్‌సభలో చర్చ జరుగుతున్న సమయంలో ప్రధాని మన్మోహన్‌సింగ్ రాజ్యసభకే పరిమితమయ్యారు. మధ్యాహ్నం దాకా లోక్‌సభలోనే ఉన్న అద్వానీ కూడా మూడింటికి చర్చ ప్రారంభమవగానే వెళ్లిపోయారు. విభజన తీరును బాహాటంగా తప్పుబట్టిన ఆయన, కాంగ్రెస్‌కు మద్దతివ్వడం ఇష్టం లేకే వెళ్లిపోయినట్టు తెలిసింది. సోనియా, రాహుల్‌గాంధీ మాత్రం ఆద్యంతం సభలోనే ఉన్నారు.
     
     సోనియా, సుష్మాలకు కేసీఆర్ కృతజ్ఞతలు
     బిల్లు ఆమోదం పొందగానే కేసీఆర్ లేచి సోనియా, సుష్మాస్వరాజ్‌ల వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ సోనియాకు, నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ ఏకంగా సుష్మాస్వరాజ్‌కు పాదాభివందనం చేసిన దశ్యం కన్పించింది.
     
     సెంట్రల్ హాలులో సస్పెండెడ్ ఎంపీల నిరసన
     విభజన బిల్లుపై లోక్‌సభలో చర్చ జరగుతున్న సమయంలో సస్పెండైన సీమాంధ్ర ఎంపీలు పార్లమెంట్ సెంట్రల్ హాలులో నిరసనకొనసాగించారు. వైఎస్సార్ కాంగ్రెస్, సీమాంధ్ర టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్రం తీరును ఎండగడుతూ నినాదాలు చేశారు. శివప్రసాద్, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, నిమ్మల కిష్టప్ప (టీడీపీ) ఒక దశలో సభ లోపలికి వెళ్లేందుకు తీవ్రంగా యత్నించారు. సభ తలుపులను గట్టిగా కొడుతూ నినాదాలు చేశారు. వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. చర్చ సందర్భంగా లోక్‌సభ ప్రత్యక్ష ప్రసారాలు అకస్మాత్తుగా ఆగిపోవడంతో వారిలో అయోమయం నెలకొంది. సభ వాయిదా పడిందంటూ లోక్‌సభ టీవీలో స్క్రోలింగ్ రావడంతో అది నిజమేనని భావించారు. కానీ గందరగోళం చర్చ జరుపుతున్నారని తెలిసి అవాక్కయ్యారు.
     
     స్పీకర్ ఆదేశానుసారమే ‘అంతరాయం’
     స్పీకర్ మీరాకుమార్ ఆదేశాల మేరకే లోక్‌సభ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసినట్టు లోక్‌సభ సచివాలయ అధికారులు తెలిపారు. 13వ తేదీన విభజన బిల్లును సభలో ప్రవేశపెట్టిన సమయంలో జరిగిన సంఘటనలతో పార్లమెంటు ప్రతిష్ట దెబ్బతిందని భావించి ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార పార్టీ సభ్యులు  వెల్లడించారు.
     
     కుంభకర్ణుడిలా నిద్రపోయారా?
     బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో మధ్యాహ్నం 3.10కి జైపాల్‌రెడ్డి ప్రసంగించారు. ‘2004లోనే యూపీఏ కామన్ మేనిఫెస్టోలో దీన్ని పొందుపరిచారు. 2004లో రాష్ట్రపతి ప్రసంగంలోనూ ఉంది. ఆంధ్ర మిత్రులు అప్పుడు ఏంచేశారు. కుంభకర్ణుడిలా నిద్రపోయారా ఇన్నేళ్లు? ఎన్నికల తరుణంలో కాంగ్రెస్ ఇలా చేస్తోందని సుష్మా స్వరాజ్ అన్నారు.. 2009 డిసెంబరు 9న నిర్ణయం ప్రకటించినప్పుడు ఎన్నికలు ఉన్నాయా? సీమాంధ్ర మంత్రులు యూపీఏ-1 హయాంలో ఏంచేశారు? వాళ్లు నిరసన తెలిపారా? బీజేపీ 45 ఏళ్లుగా ఈ డిమాండ్‌కు మద్దతు పలుకుతోంది.  అయితే అద్వానీ గారీ భిన్నస్వరం నన్ను షాక్ గురిచేసింది. నేను సుష్మాస్వరాజ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా..ఈ విజయం ఒక్క సోనియాగాంధీ చిత్తశుద్ధి వల్లే కలిగింది’ అని పేర్కొన్నారు.
>
మరిన్ని వార్తలు