‘నెహ్రూ జైలు గది’ కుప్పకూలింది!

18 Jul, 2019 19:32 IST|Sakshi

చండీఘడ్‌ : చారిత్రక నేపథ్యం ఉన్న ఓ జైలు గది కూలిపోయింది. ఈ ఘటన పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని జైతూ టౌన్‌లో ఉన్న ఈ జైలు గదిలో దివంగత కాంగ్రెస్‌ మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, మరో ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు 1923లో  కొన్ని రోజులు జైలు జీవితాన్ని గడిపారు. ఇటీవల పంజాబ్‌లో భారీగా కురుస్తున్న వర్షాలకు ఈ జైలు శిథిలావస్థకు చేరుకుంది. దీంతో 240 చరదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న జైలు కూలిపోయినట్టుగా.. గురువారం పంజాబ్‌ సీనియర్‌ పోలీసు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న సమయంలో బ్రిటీష్‌ వారు ‘నాబా’ రాష్ట్రంలోకి భారతీయులు ప్రవేశించవద్దని నిషేధించారు.

ఈ నేపథ్యంలో బ్రిటీషర్లకు వ్యతిరేకంగా అకాలీలు.. జైతుటౌన్‌లో చేపట్టిన ‘జైతు కా మోర్చా’ పేరిటి నిరసన చేపట్టారు. వీరికి మద్దతుగా జవహర్‌లాల్‌ నెహ్రూ, కె. సంతానం, ఏటీ గిద్వానీలు నిరసనకు దిగడంతో బ్రిటీషర్లు వారిని అరెస్టు చేసి ఈ కారాగారంలో బంధించారు. ఇక 2008లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ  ఈ జైలు గదిని సందర్శించి ‘దేశ మొదటి ప్రధాని’ ఈ జైలులో స్వాతంత్ర్య  పోరాటంలో భాగంగా కొన్ని రోజుల ఉన్నారన్నారు. చారిత్రక నేపథ్యం ఉన్నఈ జైలు గది కోసం కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరితే రూ.65 లక్షలు నిర్వహణ ఖర్చుల కోసం కేటాయిస్తామని ఇటీవల పంజాబ్‌ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరి పవన్‌ గోయాల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా గత పదేళ్ల కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ జైలు గదిని టూరిజం శాఖలోకి తీసుకువచ్చినప్పటికీ ఏమాత్రం నిర్వహణ మెరుగుపడలేదు. చివరికి గురువారం ఇది కూలిపోయింది.

మరిన్ని వార్తలు