ఆర్థిక చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే రోజు..

12 Nov, 2016 20:18 IST|Sakshi
ఆర్థిక చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే రోజు..
ప్రస్తుతం దేశంలో ఏ ఇద్దరు కలుసుకున్నా మాట్లాడేది నోట్ల గురించే. ఐదొందలు,  వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేయడంతో సామాన్యుల్లో ఎక్కువ ఆందోళన కనిపిస్తోంది.  నోట్ల సమస్య ఎలా ఉన్నా అసలు దేశంలో నోట్లు ఎప్పటి నుంచి వాడకంలోకి వచ్చాయి? వెనకటి కాలంలో నోట్లు ఎలా  ఉండేవో ఓసారి చూద్దాం..
 
నవంబర్‌ 8, 2016 దేశ ఆర్థిక  చరిత్రలో  ఎప్పటికీ నిలిచిపోయే రోజు. నవంబర్‌ 8,  మంగళవారం  రాత్రి 8 గంటలకు  కరెన్సీ బాంబు పేల్చారు ప్రధాని మోదీ.  నోట్ల రద్దు ప్రక్రియ మన దేశంలో గతంలో రెండుసార్లు జరిగినా ఆ రోజుల్లో  కరెన్సీ నోట్లు ఇప్పుడున్నంత మొత్తాల్లో జనాల దగ్గరుండే కావనే చెప్పాలి.  అప్పట్లో  పెద్ద కరెన్సీ నోట్లు సమాజంలో అతి కొద్ది మంది దగ్గరే మాత్రమే ఉండేవి.
  • రంగు, రూపుపరంగా అనేక మార్పులను  దేశంలో కరెన్సీ నోట్లు చూశాయి.  కరెన్సీ నోట్ల గురించి చెప్పాలంటే   వాటికి 150 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. 18వ శతాబ్దం వరకు  దేశంలో బంగారు, వెండి నాణెలు చలామణీలో ఉండేవి.  యూరోపియన్‌ వ్యాపార సంస్థల పట్టు ఎప్పుడైతే దేశంలో పెరిగి, డబ్బుల అవసరం ఎక్కువ ఏర్పడటంతో కాగిత నోట్లు ముద్రించాల్సిన అవసరం ఏర్పడింది. యూరోపియన్‌ కంపెనీలు అప్పట్లో సొంతంగా బ్యాంకులు ఏర్పాటు చేసుకున్నాయి.  భారత్‌లో మొట్టమొదటి పేపరు నోట్లను  అప్పటి కలకత్తాలోని బ్యాంక్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌ ముద్రించింది. దానిపై కేవలం అక్షరాలు మాత్రమే ఉండేవి.
     
  • బ్రిటీష్‌ కంపెనీల పట్టు పెరిగిన తర్వాత  బెంగాల్‌, బొంబాయి, మద్రాసులో  ప్రెసిడెన్సీ బ్యాంకులు వెలిశాయి.  ఇందులో మొదటిది బ్యాంక్‌ ఆఫ్ బెంగాల్‌. వీటి రాక వల్ల కాగితపు నోట్ల పాపులారిటీ మరింత పెరిగింది. బ్యాంకు ఆఫ్‌ బెంగాల్‌  విడుదల చేసిన మొట్టమొదటి కరెన్సీ నోట్లపై  వ్యాపారానికి ప్రతిరూపంగా ఓ మహిళ చిన్న బొమ్మ, బ్యాంకు పేరు, నోటు విలువ ఉండేవి. నోటు విలువను ఉర్దూ, బెంగాలీ, దేవనాగరి భాషల్లో ముద్రించారు. 
     
  • నోట్ల వాడకం పెరగడం, అందరికీ అవి అవసరం అవుతుండటంతో 1861లో  బ్రిటీష్‌ ప్రభుత్వం పేపర్‌ కరెన్సీ చట్టాన్ని తీసుకువచ్చింది.  అంతే కాదు నోట్ల ముద్రణను బ్రిటీష్‌ ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకుంది.  ప్రస్తుతం మన ఉపయోగిస్తున్న కరెన్సీ నోట్లకు అదే ఆధారం.  అప్పట్లో డబ్బును  బ్యాంకులు కాకుండా ప్రభుత్వమే జారీ చేసేది.  పేపర్‌ కరెన్సీ చట్టం  ఇండియన్ కౌన్సిల్‌లోని ఫైనాన్స్‌ మెంబర్‌ జేమ్స్‌ విల్సన్‌ ఆలోచనకు ప్రతిరూపం.  అప్పట్లో ఆయన భారత్‌లోని  బ్రిటీష్‌ ప్రభుత్వానికి  ఆర్థిక మంత్రని చెప్పవచ్చు. ఎకానమిస్ట్‌ పత్రిక, స్టాండర్డ్‌ చార్టెడ్ బ్యాంకు వ్యవస్థపకుడు ఆయన. 
     
  • విక్టోరియా బొమ్మతో కూడిన  రూ.10, 20, 50, 100, 1000 నోట్లు తొలిసారిగా ప్రభుత్వం అధికారికంగా ప్రవేశపెట్టింది. ఈ నోట్లపై రెండు భాషల్లో నోట్ల విలువ, నోటు పైభాగంలో బ్రిటన్‌ మహారాణి చిన్న చిత్రం ఉండేది. నోట్ల జారీ కోసం అప్పట్లో కరెన్సీ సర్కిల్స్‌ ఉండేవి.  కలకత్తా, బొంబాయి, మద్రాసు, రంగూన్‌, కాన్పూర్‌, లాహోర్‌, కరాచీ నగరాలను కరెన్సీ సర్కిల్స్‌గా గుర్తించారు. ఈ సర్కిల్స్‌ జారీ చేసే నోట్లు ఆ సర్కిల్‌ పరిధిలో చలామణీ అవుతుండేవి. 
     
  • అప్పట్లో దూరప్రాంతాలకు  భద్రంగా చేరవేందుకు నోటును సగానికి చించి పోస్టులో పంపించే వారు.  ఆ సగం వారికి చేరిన తర్వాత మిగిలిన సగం పంపించేవారు. బ్రిటీష్‌ కంపెనీలే కాదు అప్పట్లో భారత్‌లో ఉన్న ఫ్రాన్స్, పోర్చుగల్‌ ప్రభుత్వాలు కూడా నోట్లు ముద్రించాయి. 1890ల్లో  ఫ్రాన్స్‌ బ్యాంకు జారీ చేసిన రూపాయి నోట్లు 1954 వరకు భారత్‌లో చలామణీలో ఉండేవి. 1883లో పోర్చుగీసు వారు జారీ చేసిన రూపాయా నోట్లు భారత్‌లో 1961 వరకు వాడకంలో ఉన్నాయి.
     
  • దేశంలో బ్రిటీష్‌ వారి పెరుగుతున్న  ప్రాబల్యానికి అనుగుణంగా కరెన్సీ నోట్లు మార్పులు చూశాయి. 1923 కింగ్‌ జార్జ్‌ ఐదు బొమ్మతో కూడిన నోట్లు వాడకంలోకి వచ్చాయి. 1928లో నాసిక్‌లో కరెన్సీ ప్రింటింగ్‌ ప్రెస్‌ నెలకొల్పేవరకు నోట్లన్నీ బ్యాంకు ఆఫ్‌ ఇంగ్లాండ్‌ ముద్రించేవారు. 1935లో కొత్తగా ఏర్పాటు చేసిన రిజర్వ్‌  బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు  భారత ఆర్థిక వ్యవహారాల బాధ్యతను అప్పగించారు. 
     
  • 1938లో ఆర్బీఐ తొలి నోటును ముద్రించింది. దానిపై కింగ్‌ జార్జ్‌-VI చిత్రముండేది. స్వేచ్ఛా భారత్‌కు సంబంధించిన నోట్లు ముద్రించేందుకు ఆర్బీఐకి చాలా సంవత్సరాలు పట్టింది.  స్వతంత్ర భారత్‌కు సరిపోయేలా గుర్తులు, చిత్రాల  ప్రతిబింబించేలా కొత్త రూపుతో నోట్లు ముద్రించడంపై చాలా కసరత్తు జరిగింది.  స్వతంత్ర భారత్‌లో తొలి కరెన్సీ నోటు 1949లో విడుదలైంది. రూపాయి నోటుపై  సారనాథ్‌ అశోక స్థూపం ముద్ర ఉండేది. ఆ తర్వాతి కాలంలో ఆర్బీఐ దేశంలోని అని చారిత్రాక కట్టడాలను నోట్లపై ముద్రించింది. ముంబయి గేట్‌ వే ఆఫ్‌ ఇండియా, తంజావూరు బృహదీశ్వర ఆలయం బొమ్మలు నోట్లపై ఉండేవి. 
     
  • 1960ల్లో తొలిసారి నిరాక్ష్యరాస్యులు గుర్తించేలా వివిధ రంగుల్లో నోట్ల ముద్రణ ప్రారంభమైంది. 1980ల వరకు నోట్లపై అశోక స్థూపం ఉండేది. 1944లోనే సెక్యూరిటీ థ్రెడ్‌, ఆర్బీఐ వాటర్‌ మార్కుతో కూడిన నోట్లు ముద్రించారు.  1996, ఆ తర్వాత 2005లో మహాత్మ గాంధీ సిరీస్‌లో నోట్ల ముద్రణ మొదలైంది. చూపులేని వారు సులువుగా గుర్తించేందుకు వీలుగా కరెన్సీ నోట్లలో మార్పులు చేశారు.  కరెన్సీ నోట్లలో చివరిసారి జరిగిన మార్పు 2010లో రూపొందించిన రూపాయి గుర్తు. 2011లో తొలిసారి రూపాయి గుర్తుతో కూడిన నోట్ల ముద్రణ చేపట్టారు. 
మరిన్ని వార్తలు