కరడుగట్టిన ఉగ్రవాది రియాజ్‌ నైకూ

7 May, 2020 17:38 IST|Sakshi
రియాజ్‌ నైకూ(ఫైల్‌)

న్యూఢిల్లీ : కరడుగట్టిన ఉగ్రవాది, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ కమాండర్ రియాజ్‌ నైకూ‌ను హతమార్చడం చాలా కాలం తర్వాత భారత భద్రతా బలగాలు సాధించిన ఘన విజయంగా చెప్పుకోవచ్చు. ఎనిమిదేళ్లుగా భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న అతడ్ని కశ్మీర్లోని సొంత గ్రామంలోనే మట్టుబెట్టడం మరో విజయం. అయితే ఓ లెక్కల మాస్టారు జమ్మూ కశ్మీర్‌కు చెందిన టాప్‌ మిలిటెంట్‌ కమాండర్లలో ఒకడిగా మారిన వైనం ఆశ్చర్యకరం.

మార్పు తెచ్చిన జైలు జీవితం ..
రియాజ్‌ నైకూ.. పంజ్‌గామ్‌లోని నైకూ మొహల్లాలో 1985లో జన్మించాడు. నలుగురు సంతానంలో అతడు రెండో వాడు. ఇంటర్‌లో 600లకు గానూ 464 మార్కులు తెచ్చుకున్న నైకూ ఇంజనీర్‌ అవ్వాలని అనుకునేవాడు. కానీ, గ్రాడ్యూయేషన్‌ అయిపోగానే ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో లెక్కల మాస్టారుగా చేరాడు. పేద విద్యార్థులకు ఉచితంగా తరగతలు కూడా చెప్పేవాడు. 2012లో ఓ కేసులో జైలుకు వెళ్లాడు. జైలు నుంచి తిరిగొచ్చిన తర్వాత అతడిలో మార్పు వచ్చింది. ఆ తర్వాత 2012 జూన్‌ 6న హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రసంస్థలో చేరాడు. ఇప్పటివరకు అతనిపై 11 కేసులు ఉన్నాయి. ( హిజ్బుల్‌ కమాండర్‌ హతం )

భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న నైకూ తలపై ఇప్పటికే రూ. 12 లక్షల రివార్డు ఉంది. 2014 నుంచి అతడు యాక్టివ్‌గా ఉన్నాడు. 2016 జూలైలో ఉగ్రవాది బుర్హాన్‌ వని మరణించాక నైకూ డీ ఫాక్టో చీఫ్‌గా మారాడు. పలువురు యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా చేశాడు. టెక్నాలజీపై పట్టున్న నైకూ ఎక్కడా ఆధారాలు వదిలేవాడు కాదు. అయితే నైకూ తన సొంత గ్రామంలో ఉన్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ​ ప్లానింగ్‌తో గత మంగళవారం రాత్రి అతన్ని హతమార్చారు. ( కశ్మీర్‌లో 64 మంది ఉగ్రవాదుల ఏరివేత)

మరిన్ని వార్తలు