లొంగిపోవడం కంటే కూడా చావడానికి సిద్ధం..

20 Feb, 2019 13:03 IST|Sakshi

శ్రీనగర్‌ : పుల్వామా ఉగ్రదాడిని మరువక ముందే ఆత్మాహుతి దాడులు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ కశ్మీరీ వేర్పాటువాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ హెచ్చరించింది. చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే కశ్మీరీ యువకులు ఆత్మబలిదానాలకు వెనుకడుగు వేయరని పేర్కొంది. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ కమాండర్‌ ఆదిల్‌... సీఆర్‌పీఎఫ్‌ బలగాల వాహన శ్రేణిని ఢీకొట్టి ఆత్మాహుతికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. ఈ క్రమంలో పుల్వామా దాడిలో కీలక సూత్రధారిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అనంతరం.. కశ్మీర్‌లో తిరిగే ప్రతీ ఉగ్రవాదిని అంతం చేస్తామని ఆర్మీ అధికారులు మీడియా ముఖంగా హెచ్చరించారు. ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్న కశ్మీరీ యువత లొంగిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.(‘లొంగిపోండి.. లేదంటే అంతం చేస్తాం’)

వాళ్లను బతకనివ్వం
ఈ విషయంపై స్పందించిన హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఆపరేషనల్‌ కమాండర్‌ రియాజ్‌ నైకూ సుమారు 17 నిమిషాల నిడివి గల ఆడియో మెసేజ్‌ను సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేశాడు. ‘లొంగిపోవడం కంటే కూడా చావడానికే ప్రాధాన్యం ఇస్తాం. మీ సైనికులు ఇక్కడ(కశ్మీర్‌) ఉన్నంత కాలం మీరు ఏడవాల్సిందే. మీ జవాన్ల శవపేటికలు వస్తూనే ఉంటాయి. చావడానికైనా మేము సిద్ధమే. కానీ వాళ్లను మాత్రం బతకనివ్వం. ఆత్మబలిదానాలకు సిద్ధంగా ఉన్నాం. మా దళంలోని 15 ఏళ్ల పిల్లలు.. వారి శరీరాలకు బాంబులు కట్టుకుని.. భారత ఆర్మీ వాహనాలపై దాడి చేసే రోజు ఎంతో దూరంలో లేదు. బానిసత్వం కంటే చచ్చిపోవడమే మాకు ఇష్టం. మొన్న దాడి చేసింది కూడా ఓ కశ్మీరీ యువకుడే. సైన్యం కారణంగానే అతడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఇప్పుడు మరికొంత మంది సిద్ధంగా ఉన్నారు. ప్రపంచంలోని ఏ శక్తీ మమ్మల్ని ఆపలేదు’ అంటూ రియాజ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కాగా 2016లో హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌కు చెందిన బుర్హన్‌ వనీ ఎన్‌కౌంటర్‌ అనంతరం ఆ సంస్థలో చేరుతున్న కశ్మీరీ యువత సంఖ్య క్రమంగా పెరుగుతోందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

చదవండి : పుల్వామా ఉగ్రదాడి‌; మాస్టర్‌ మైండ్‌ హతం!

ఉగ్ర మారణహోమం

మరిన్ని వార్తలు