పరుగులు పెట్టించిన ఫోన్‌ కాల్‌

28 Apr, 2019 07:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

దక్షిణాదిలో ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడబోతున్నారు.. 

బెంగళూరు పోలీసులకు మాజీ జవాన్‌ ఫోన్‌

అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్న పోలీసులు 

దాడుల వార్త ఉత్తిదే అని నిర్ధారణ

సాక్షి, బెంగళూరు/కుప్పం(చిత్తూరు జిల్లా): కర్ణాటకతో పాటు దక్షిణ భారతదేశంలో ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడబోతున్నట్లు బెంగళూరు పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు వచ్చిన ఫోన్‌ కాల్‌ సంచలనం రేపింది. ఫోన్‌ చేసిన వ్యక్తిని మాజీ సైనిక ఉద్యోగి స్వామి సుందరమూర్తిగా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. విచారణ అనంతరం పేలుళ్ల సమాచారం ఉత్తిదే అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం సాయంత్రం స్వామి సుందరమూర్తి బెంగళూరు పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి తానొక లారీ డ్రైవర్‌నంటూ పరిచయం చేసుకున్నాడు. అతడు తమిళం, కొంచెం హిందీ భాషల్లో మాట్లాడుతూ తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, పుదుచ్చేరి, గోవా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉగ్రవాదులు దాడులు జరుపుతారనే సమాచారం తన వద్ద ఉందన్నాడు. ముఖ్యంగా రైళ్లలో దాడులు జరిగే అవకాశం ఉందని చెబుతూ తమిళనాడు రామనంథపురంలో 19 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిపాడు. ఆ ఫోన్‌ కాల్‌ వచ్చిన లొకేషన్‌ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. బెంగళూరు శివార్లలోని ఆవలహళ్లి సమీపంలోని ఇంటి నుంచి ఆ కాల్‌ వచ్చిందని గుర్తించారు. శుక్రవారం రాత్రి అక్కడికి వెళ్లి సుందరమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల శ్రీలంకలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఇక్కడ కూడా ఇదేవిధంగా జరిగే అవకాశం ఉండొచ్చని ఊహించి తాను ఫోన్‌ కాల్‌ చేసినట్లు సుందరమూర్తి అంగీకరించాడు. మరింత లోతైన విచారణ కోసం అతనిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్మీలో 20 ఏళ్ల పాటు సుందరమూర్తి విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ప్రస్తుతం లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సుందరమూర్తి ఇద్దరు పిల్లలు కూడా జవాన్లుగా పనిచేశారు. వీరిలో ఒకరు కార్గిల్‌ యుద్ధంలో వీర మరణం పొందారు.  

దక్షిణాది రాష్ట్రాలకు ముందస్తు హెచ్చరికలు 
పేలుళ్ల వార్త నేపథ్యంలో కర్ణాటక డీజీపీ నీలమణి ఎన్‌.రాజు ముందస్తు హెచ్చరికలతో కూడిన అత్యవసర ఫ్యాక్స్‌ను దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులకు పంపించారు. అలాగే కర్ణాటకలోనూ హైఅలర్ట్‌ ప్రకటించారు. అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు దాడులపై కర్ణాటక పోలీసులు హెచ్చరిస్తూ విడుదల చేసిన నోటీసులు మూడు రాష్ట్రాల కూడలి ప్రదేశంలో ఉన్న కుప్పంలో హల్‌చల్‌ చేస్తున్నాయి. వాట్సప్, ఫేస్‌బుక్‌ గ్రూపుల్లో విస్తృతంగా షేర్‌ అవుతున్నాయి. వాటిని చూసి స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.  

>
మరిన్ని వార్తలు