స్పైడర్‌మేన్, బ్యాట్‌మేన్, ఐరన్‌మేన్‌లు కలిస్తే..

24 Aug, 2018 16:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘హాలీవుడ్‌కు స్పైడర్‌ మేన్, బ్యాట్‌మేన్, ఐరన్‌మేన్‌లు ఉంటే కేరళ వాసులకు వీరందరు కలిసిన ఫిషర్‌మెన్‌’ ఉన్నారన్న కొటేషన్‌తో కేరళ వరద ప్రాంతాల్లో మత్స్యకారులు లేదా జాలర్లు అందించిన సేవలను సోషల్‌ మీడియా, ముఖ్యంగా వాట్సాప్‌ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. వారి సహాయక చర్యలు అమోఘమని చెప్పడానికి పడవ పక్కన ఎర్రటి వర్షపు కోటును ధరించి కుడి చేతిలో భారీ తెడ్డును పట్టుకొని ఠీవీగా నిలబడిన మత్స్యకారుడి ఫొటోను కొటేషన్‌ కింద పొందుపర్చారు. ఇక పక్క పడవలో కేరళ రాష్ట్ర నమూనాను చూపించారు.

సమాజంలోని విద్యార్థులు, వృత్తినిపుణులు, నావికులు, సాయుధ దళాల సిబ్బంది కుల, మత భేదాలు లేకుండా నిస్వార్ధంగా వరద సహాయక చర్యల్లో నిమగ్నమైనప్పుడు ఒక్క మత్స్యకారుల సేవలనే కొనియాడడం సమంజసం కాదని కొందరికైనా అనిపించవచ్చు. కానీ కేరళ వాసుల్లో సామాజికంగా బాగా వెనకబడిన అట్టడుగు వర్గాల వారు మత్స్యకారులు. మనష్యులకు దూరంగా బతికే సముద్రపు అల్లకల్లోల ప్రపంచం వారిది. ఏ పూటకాపూట వెతుక్కునే జీవితాలు వారివి. ఇతర మానవ సమాజంతో వారు కలిసేదే బహు తక్కువ. చేపల వేట నుంచి రాగానే వారు తెగిన వలల పోగులను అల్లుకొనో దెబ్బతిన్న పడవల మరమ్మతు చేసుకొనో మళ్లీ రేపటి వేటకు సిద్ధమవుతారు. రాత్రికి ఇంత తిని పడుకుంటారు. వారికి పక్కా ఇళ్లుగానీ, ఇళ్ల పట్టాలుగానీ ఏ ప్రభుత్వం ఏనాడు కల్పించలేదు. వారు ఏనాడు డిమాండ్‌ చేయనూ లేదు. అలాంటి వారు నిస్వార్థంగా సేవలందించడం ఎప్పటికీ ఎనలేనిదే.

ముఖ్యంగా పట్టణం తిట్ట, అలప్పూజ, ఎర్నాకులం, త్రిశూర్‌ ప్రాంతాల్లో వారు అందించిన సేవలు అమోఘం. దాదాపు వెయ్యి మంది జాలర్లు, ఐదు వందల బోట్లతో, సొంత డబ్బుతో ఇంధనం కొని సేవలు అందించడం మామూలు విషయం కాదు. కాకపోతే సముద్రపు అలల్లో, ప్రమాదకర పరిస్థితుల్లో బోట్లను నడిపిన అనుభవం వారికి సహాయక చర్యల్లో ఎంతో ఉపయోగపడింది. ఒక్క అలప్పూజా ప్రాంతంలోనే వారు 16000 మంది ప్రజల ప్రాణాలను రక్షించారని ఆ జిల్లా కలెక్టర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ‘అరే సరిగ్గా చదువుకోకపోతే మత్స్యకారుడివి తప్పా మరేమి కావంటూ మా ట్యూషన్‌ మాస్టర్‌ తిట్టినప్పుడు నిజంగా బాధ పడేవాడిని. నిజంగా నేడు వారిని చూస్తే గర్వంగా ఉంది. నీట మునిగిన ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ నుంచి నా సోదరిని రక్షించి తీసుకొచ్చారు. అందుకు ప్రతిఫలంగా తీసుకోవాల్సిందిగా ఓ నోట్ల కట్టను అందజేసినా, తమరు తమకు సోదరి లాంటి వారేనంటూ డబ్బును తిరస్కరించినట్లు నా సోదరి ఏడుస్తూ చెప్పడం నాకు ఏడుపు తెప్పించింది’ ఒకరు వాట్సాప్‌లో సందేశం పెట్టారు. ఇలాంటి సందేశాలు మరెన్నో! వైరల్‌ అవుతున్నాయి.

సహాయక చర్యలతో మత్స్యకారుల పాత్ర ముగిసింది. ఇందులో వారు పలువురు గాయపడ్డారు. కొందరి బోట్లు కూడా దెబ్బతిన్నాయి. కేరళ పునర్నిర్మాణంలో వారి పాత్ర ఎలాగు ఉండదు. త్వరలోనే వారిని ప్రజలు మరచిపోవచ్చు. నేడు మత్స్యకారుల సేవలను కొనియాడుతూ కొన్ని రాజకీయ పార్టీల నాయకులు వారికి శాలువాలు కప్పి సన్మానాలు చేస్తున్నారు. భారీ ఉపన్యాసాలతో ఊదరగొడుతున్నారు. రాజకీయావసారాల కోసం మాట్లాడడం ఆ తర్వాత మరచిపోవడం రాజకీయ నాయకులకు అలవాటే. కానీ ప్రజలు అలా వారి సేవలను మరచిపోరాదు. తమ ప్రాణాలను కాపాడిన మత్స్యకారులను తర్వాతనైనా గుర్తించి అన్ని విధాల ఆదుకునే ప్రయత్నం చేయాలి. వాస్తవానికి గతేడాది వచ్చిన ‘ఓఖీ’ తుపానులో ఈ నాటి వరదల కన్నా ఎక్కువ మంది మత్స్యకారులు మరణించారు. వారి పాకలు కొట్టుకుపోయాయి. వారికి అందిన సహాయం అంతంత మాత్రమే. వారిది రోజూ చస్తూ బతికే జీవితమే. అధికారిక లెక్కల ప్రకారమే చేపల వేటకు వెళ్లన మత్స్యకారుల్లో నాలుగు రోజులకు ఒకరు చొప్పున మరణిస్తున్నారట.

ప్రజలే ముందుగా తమకు సాయం చేసిన మత్స్యకారులను గుర్తించాలి, ముఖ్యంగా పడవలు దెబ్బతిన్న వారిని గుర్తించి, వారి పడవలకు మరమ్మతులు చేయించాలి. అవసరమైన వారికి వలలు కొనివ్వాలి. ఆ తర్వాత వారి ఇళ్ల స్థలాల కోసం వారి తరఫున ప్రభుత్వంతో పోరాడి ఇప్పించాలి. అందులో సహాయక చర్యల్లో పాల్గొన్న వారికే ప్రాధాన్యత ఉండేలా చూడాలి. ఆ తర్వాత వారి ఇళ్ల నిర్మాణానికి సహకరించాలి. వారికి జాతీయ, రాష్ట్ర రిస్క్యూ టీముల్లో ఉద్యోగాలు వచ్చేలా చూడాలి. అంతిమంగా వారి సేవలు చిరస్మరణీయంగా ఉండేలా ఓ మెమోరియల్‌ లాంటిది ఏర్పాటు చేయాలి. వారి సహకార సంఘం కార్యకలాపాలు అక్కడి నుంచే ప్రారంభించేలా ఉంటే ఇంకా బాగుండవచ్చు. వీటి సాధన కోసం నవంబర్‌ 21న రానున్న మత్స్యకారుల దినోత్సవాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం మంచిదేమో!

మరిన్ని వార్తలు