లాక్‌డౌన్‌ ఏయే రంగాలకు సడలింపు..

15 Apr, 2020 16:19 IST|Sakshi

ఏప్రిల్ 20 తర్వాత లాక్ డౌన్ సడలింపు

కరోనా కేసు లేని ప్రాంతాల్లో కార్యకలాపాలకు అనుమతి

ఏ యే రంగాలు పని చేయాలన్న దానిపై మార్గదర్శకాలు వెలువరించిన కేంద్ర హోంశాఖ

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కఠిన చర్యలు

సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 విస్తరణను అరికట్టడానికి దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా గుర్తించిన ప్రాంతాల్లో  ఏప్రిల్ 20వ తేదీ నుంచి కొన్ని కార్యకలాపాలు పునః ప్రారంభించడానికి అనుమతించనున్నట్టు కూడా ప్రధాని ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం పలు మార్గదర్శకాలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఎంపిక చేసిన కార్యకలాపాలను కరోనా వ్యాప్తి గల ప్రాంతాల్లో అమలులో ఉన్న నిషిద్ధ కార్యకలాపాలపై ఆంక్షలను తొలగించడంతో పాటు ప్రత్యేకంగా ఎంపిక చేసిన కార్యకలాపాల అమలుకు కూడా అనుమతిస్తున్నట్టు ఆ ఉత్తర్వులో పేర్కొంది. లాక్‌డౌన్‌ తొలి దశలో సాధించిన లాభాలను ఏకీకృతం చేయడం, ఆయా ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని మరింతగా అదుపు చేయడం, అదే సమయంలో ఆయా ప్రాంతాల్లోని  వ్యవసాయదారులు, కార్మికులు, రోజువారీ వేతనాలపై ఆధారపడిన కార్మికులకు ఊరట కల్పించడం ఈ సవరించిన మార్గదర్శకాల లక్ష్యమని తెలిపింది. (ఏప్రిల్ 20 తర్వాత లాక్‌డౌన్‌ సడలింపు)

ఏయే రంగాలకు అనుమతులు..
వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో జరిగేందుకు సహాయపడడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తి సామర్థ్యంతో పని చేసేందుకు దోహదపడడం, రోజువారీ కూలీలు, ఇతర కార్మిక శక్తి ఉపాధి అవకాశాలు కొనసాగేలా చూడడం, తగు రక్షణలు  చట్టబద్ధంగా ఆయా పనుల్లో తీసుకోవలసిన జాగ్రత్తలతో ఎంపిక చేసిన పారిశ్రామిక కార్యకలాపాలు పునరుద్ధరించడం. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం లక్ష్యంగా 2020 ఏప్రిల్20వ తేదీ నుంచి పైన సూచించిన కార్యకలాపాలను అనుమతించడం జరుగుతుంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా  కోవిడ్-19 అదుపు చర్యలు పాటించడం కోసం కోవిడ్-19 నివారణ జాతీయ నిర్దేశకాలు కూడా జారీ చేశారు.  వైపరీత్యాల నిర్వహణ చట్టం, 2005 పరిధిలో జిల్లా మెజిస్ర్టేట్లు వాటిని కట్టుదిట్టంగా అమలుపరుస్తూ ఉల్లంఘించిన వారికి జరిమానాలు, శిక్షలు విధించడం తప్పనిసరి.

అత్యవసర వస్తువులు, అత్యవసరం కానివి అనే వివక్ష ఏదీ లేకుండా అన్ని రకాల వస్తువుల రవాణాను అనుమతించాలి. నోటిఫైడ్ మండీలు, ప్రత్యక్ష, వికేంద్రీకృత మార్కెటింగ్ విధానాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల సమీకరణ, మార్కెటింగ్, ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల తయారీ, పంపిణీ, రిటైల్,  పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, పశుసంవర్థక కార్యకలాపాలు, తేయాకు, కాఫీ, రబ్బర్ తోటల పెంపకం సహా అన్ని రకాల వ్యవసాయ కార్యకలాపాలకు అనుమతులు ఉంటాయి. (లాక్‌డౌన్‌పై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: సజ్జనార్‌)

‘గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం కలిగించడం కోసం ఫుడ్ ప్రాసెసింగ్ సహా గ్రామీణ ప్రాంతాల్లో అన్ని పరిశ్రమలు నడిచేందుకు అనుమతించాలి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, ఇరిగేషన్ ప్రాజెక్టులు, భవనాలు, పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణ కార్యకలాపాలను అనుమతించాలి. అలాగే నీటి పారుదల వసతులు,జల సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇస్తూ ఎంఎన్ఆర్ఇజిఏ కింద పనుల నిర్వహణ, గ్రామీణ కామన్ సర్వీసు కేంద్రాల పనులను అనుమతించాలి. ఈ కార్యకలాపాలన్నీ గ్రామీణ కార్మికులు, వలస కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాయి.

కార్మికులు వచ్చి పోవడంపై నిరంతర పర్యవేక్షణ గల సెజ్లు, ఎగుమతి ఆధారిత యూనిట్లు, పారిశ్రామిక కేంద్రాలు, పారిశ్రామిక టౌన్ షిప్ లలో తగు ఎస్ఓపి అమలుపరచడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలతో తయారీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతించవచ్చు. ఐటి హార్డ్ వేర్, నిత్యావసర వస్తువుల తయారీ, ప్యాకేజింగ్ కార్యకలాపాలను కూడా అనుమతించాలి. బొగ్గు, ఖనిజాలు, చమురు తయారీ అనుమతించిన కార్యకలాపాల్లో ఉన్నాయి. భద్రతాపరమైన తగు జాగ్రత్తలు తీసుకుంటూ, సామాజిక దూరం పాటిస్తూ పారిశ్రామిక, తయారీ కార్యకలాపాల పునరుద్ధరణకు ఈ చర్యలు దోహదపడతాయి. తద్వారా ఉపాధి అవకాశాలుఏర్పడతాయి. అంతే కాదు, పారిశ్రామిక రంగానికి అవసరం అయిన రుణ మద్దతు ఇవ్వడంతో పాటు ఆర్థిక వ్యవస్థలో తగినంత నగదు లభ్యత కోసం ఆర్థిక రంగానికి వెన్నెముకగా నిలిచే ఆర్ బిఐ, బ్యాంకులు, ఎటిఎంలు, సెబీ నోటిఫై చేసిన పెట్టుబడి, రుణ మార్కెట్లు, బీమా కంపెనీలు కూడా పని చేస్తాయి. (అమెరికా నిర్ణయం ఆందోళనకరం: చైనా)

సేవల రంగానికి, జాతీయ వృద్ధికి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అత్యంత కీలకం. అందుకు దీటుగా ఇ-కామర్స్ కార్యకలాపాల నిర్వహణ  ప్రభుత్వ కార్యకలాపాలకు అవసరం అయిన ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసుల కార్యకలాపాలు, డేటా కాల్ సెంటర్ల నిర్వహణ; ఆన్ లైన్ బోధన, దూర విద్య వంటి కార్యకాలాపాలకు కూడా అనుమతి ఉంది.ఆరోగ్య సర్వీసులు, ఎలాంటి గోప్యత అవసరం లేకుండా ప్రభుత్వ యుటిలిటీలు నిత్యావసర వస్తువుల సరఫరా వ్యవస్థ,  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల కీలక కార్యాలయాల్లో అవసరమైనంత మంది ఉద్యోగులతో పని చేసేందుకు సవరించిన మార్గదర్శకాలు అనుమతిస్తున్నాయి. మొత్తం మీద గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయాభివృద్ధి, ఉపాధి కల్పన కోణంలో ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకంగా భావించే అన్ని రంగాల కార్యకలాపాలు ఆయా ప్రాంతాల్లో కోవిడ్-19 అదుపు చేయడానికి అమలులో ఉండే  చర్యలు కట్టుదిట్టంగా పాటిస్తూ పని చేసేలా అనుమతించడం ఈ సవరించిన ఏకీకృత మార్గదర్శకాల లక్ష్యం’ అని కేంద్ర ప్రభత్వుం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది.

మరిన్ని వార్తలు