ఆస్తులు ఎక్కడివక్కడే

20 Apr, 2017 03:01 IST|Sakshi
ఆస్తులు ఎక్కడివక్కడే

- ఉన్నత విద్యామండలి ఆస్తులపై హోం శాఖ ఉత్తర్వులు
- నగదును జనాభా నిష్పత్తిలో పంచుకోవాలి


సాక్షి, న్యూఢిల్లీ: విభజనకు ముందున్న ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి ఆస్తుల్లో స్థిర, చరాస్తులు ఏ ప్రాంతంలో ఉంటే ఆ రాష్ట్రానికే దక్కుతాయని, నగదు మాత్రం జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోం శాఖలోని కేంద్ర, రాష్ట్రాల విభాగం డైరెక్టర్‌ అశుతోష్‌ జైన్‌ బుధవారం ఆ ఉత్తర్వుల కాపీని పంపారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఉనికిలోకి వచ్చాక, ఏపీ ఉన్నత విద్యామండలి ఖాతాలను తెలంగాణ ప్రభుత్వం స్తంభింపజేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై ఏపీ ఉన్నత విద్యామండలి హైకోర్టును ఆశ్రయించింది.

ఉన్నత విద్యా మండలి తెలంగాణలో ఉన్నందున ఏపీ ఉన్నత విద్యామండలికి ఆయా ఖాతాలపై ఎలాంటి హక్కులేదని, ఏపీ ఉన్నత విద్యా మండలి ఉనికిలో లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై ఏపీ ఉన్నత విద్యామండలి సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు 2016 మార్చి 18న తీర్పు వెలువరించింది. రెండు రాష్ట్రాలు ఒక అంగీకారానికి వస్తే ఆంధ్ర ప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీ కరణ చట్టంలోని సెక్షన్‌ 2(హెచ్‌) ప్రకారం విభజన సమయానికి ఉన్న ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి ఆస్తులను జనా భా ప్రాతిపదికన 58.42 నిష్పత్తిలో రెండు రాష్ట్రాలు పంచుకోవాలని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.

ఒకవేళ రెండు రాష్ట్రాలు ఒక ఒప్పందానికి రానిపక్షంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరేందుకు ప్రయత్నం చేయాలని, లేని పక్షంలో కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోం శాఖను ఆదేశించింది.  కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శిని చైర్మన్‌గా, ఇరు రాష్ట్రాల నుంచి ఇద్దరేసి ప్రతినిధులను సభ్యులుగా 2016 ఆగస్టులో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తొలుత గత ఏడాది సెప్టెంబర్‌ 23న ఒకసారి సమావేశమై ఇరు రాష్ట్రాల అభిప్రాయాన్ని సేకరించి, పరస్పర అంగీకారానికి రావడమే మేలైన మార్గమని సూచించింది.

ఈ దిశగా గత ఏడాది అక్టోబర్‌ 18న రెండు రాష్ట్రాలు సమావేశమయ్యాయి. తమకు గత ఏడాది ఏప్రిల్‌ 16న ఆంధ్రప్రదేశ్‌ చేసిన ఒక ప్రతిపాదన అందిందని, దానిపై వారంలోగా సమాధానం ఇస్తామని ఆ సమావేశంలో తెలం గాణ ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత గత ఏడాది నవంబర్‌ 1న తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఒక లేఖ రాస్తూ.. ఏపీ ప్రతిపాదనతో తాము ఏకీభవించడం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 13న కేంద్ర కమిటీ సమావేశమై, రాత పూర్వకంగా అభిప్రాయాలు తెలపాలని ఇరు రాష్ట్రాలను కోరింది. సుప్రీంకోర్టు పరిశీలనను, చట్టంలోని సెక్షన్‌ 48, 49లను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఆస్తుల విభజనపై ఉత్తర్వులు జారీ చేసింది.

పంపిణీ ఇలా..
ఎ) ఆస్తులు: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 48(1), సెక్షన్‌ 48(4) ప్రకారం అన్ని స్థిర, చరాస్తులు.. అంటే భూములు, స్టోర్స్, ఆర్టికల్స్, ఇతర వస్తువులను భౌగోళిక ప్రాతిపదికన పంచాలి.
బి) నగదు నిల్వలు: సెక్షన్‌ 49 ప్రకారం నగదు నిల్వలు జనాభా ప్రాతిపదికన అంటే 58.32ః 41.68 నిష్పత్తిలో పంచాలి. 2014 జూన్‌ 1 నాటికి ఉన్న నగదు నిల్వ, 2014 జూన్‌ 2 నుంచి రెండు రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి సేవలు అందించిన కాలం వరకు ఉన్న నగదు నిల్వలను ఇదీ రీతిలో జనాభా ప్రాతిపదికన పంచాలి.
సి) ఉద్యోగులు: తెలంగాణ ఉన్నత విద్యామండలిలో ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులు అక్కడే కొనసాగుతారు.

>
మరిన్ని వార్తలు