దోషులను వదలం!

12 Mar, 2020 04:29 IST|Sakshi
లోక్‌సభలో మాట్లాడుతున్న అమిత్‌ షా

ఢిల్లీ అల్లర్లపై హోంమంత్రి అమిత్‌షా స్పష్టీకరణ

ఢిల్లీ హింసాకాండ ప్రణాళికాబద్ధ కుట్ర అని అభివర్ణన

లోక్‌సభలో ఢిల్లీ హింసాకాండపై చర్చ

న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల దోషులెవరినీ వదలబోమని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. అల్లర్లకు పాల్పడేవారికి ఒక గుణపాఠంలా తమ చర్యలుంటాయన్నారు. కులం, మతం, రాజకీయ పార్టీలతో అనుబంధం.. వీటినేమాత్రం పట్టించుకోమని, అల్లర్లలో పాలు పంచుకున్న ప్రతీ ఒక్కరికి సరైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఢిల్లీ అల్లర్లపై లోక్‌సభలో బుధవారం జరిగిన చర్చకు షా సమాధానమిచ్చారు. ఆ అల్లర్లు ముందుగానే ప్లాన్‌ చేసుకున్న కుట్ర అని ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తోందన్నారు.

ఈ ఢిల్లీ హింసాకాండకు సంబంధించి పోలీసులు 2,647 మందిని అదుపులోకి తీసుకున్నారని, దాదాపు 700 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారని, ఈ హింసకు ఉపయోగించిన 152 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని, ఆయుధాల చట్టం కింద 49 కేసులు నమోదు చేశారని అమిత్‌ షా వివరించారు. ఫేస్‌ ఐడెంటిఫికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి సీసీ టీవీ ఫుటేజ్‌ను నిపుణులు విశ్లేషిస్తున్నారన్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌ మతం ఆధారంగానో, దుస్తుల ఆధారంగానో వివక్ష చూపదని విపక్షంపై విసుర్లు విసిరారు. హోళీ సమయంలో మత కలహాలు జరగకుండా చూసేందుకే.. ఆ పండుగ తరువాత ఢిల్లీ అల్లర్లపై చర్చ చేపట్టాలని ప్రభుత్వం భావించిందన్నారు. ‘ఢిల్లీ హింసాకాండలో మొత్తం 52 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.

విపక్షం తరహాలో నేను వారిలో హిందువులెందరు? ముస్లింలు ఎందరు? అనే వివరాలను ఇవ్వదలచుకోలేదు. 526 మంది గాయపడ్డారు. 371 మంది భారతీయుల దుకాణాలు, 142 మంది ఇండియన్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి’ అని వివరించారు. కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ పేరును ప్రస్తావించకుండా.. ‘ఫిబ్రవరి 24న ఒక విపక్ష నేత ఇది అటో ఇటో తేల్చుకునే యుద్ధం అని రెచ్చగొట్టేలా ప్రసంగించారు. ఇది విద్వేష ప్రసంగం కాదా?’ అని షా ప్రశ్నించారు. సీఏఏ వ్యతిరేక నిరసనల్లో ఎంఐఎం నేత వారిస్‌ పఠాన్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను  ప్రస్తావించారు. సీఏఏను సమర్ధిస్తూ.. మతం ప్రాతిపదికన 25కి పైగా చట్టాలను రూపొందించారని, సీఏఏ ఏ మతంపైనా వివక్ష చూపదని పునరుద్ఘాటించారు.

అమిత్‌ మాట్లాడుతుండగానే.. నిరసనగా కాంగ్రెస్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. అంతకుముందు, చర్చలో పాల్గొన్న పలువురు విపక్ష సభ్యులు.. ఢిల్లీ అల్లర్లకు నైతిక బాధ్యత వహించి, మంత్రి పదవికి అమిత్‌ షా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. చర్చను కాంగ్రెస్‌ సభ్యుడు ఆధిర్‌ రంజన్‌ చౌధురి ప్రారంభించారు.  ఢిల్లీలో హింసాకాండ ప్రజ్వరిల్లుతున్న సమయంలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు విందు ఇవ్వడంలో బిజీగా ఉన్నారని, ఇది రోమ్‌ నగరం తగలబడుతుంటే.. నీరో ఫిడేల్‌ వాయిస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ‘ఈ హింసాకాండలో హిందువులు గెలిచారని కొందరు, ముస్లింలు గెలిచారని కొందరు చెబుతున్నారు. నిజానికి మానవత్వం ఓడిపోయింది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఢిల్లీ పోలీసుల తీరును విమర్శించినందువల్లనే ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ మురళీధర్‌ను బదిలీ చేశారని చౌధురి ఆరోపించారు. హోంమంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని టీఎంసీ ఎంపీ సౌగత రాయ్, ఆరెస్పీ ఎంపీ ఎన్‌కే ప్రేమచంద్రన్‌ కూడా డిమాండ్‌ చేశారు. ఈ హింసాకాండను కూడా కొందరు రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని బీజేపీ నేత మీనాక్షి లేఖి విమర్శించారు. ఐబీ అధికారి అంకిత్‌ శర్మ హత్యను గుర్తు చేస్తూ.. ఆయన మృతదేహంపై 400 గాయాలు ఉన్నాయన్నారు. ఆప్‌ కౌన్సిలర్‌ ఇంట్లో భారీగా రాళ్లు, ఆయుధాలు లభించడాన్ని ఆమె ప్రస్తావిం చారు. చాలా ఇళ్లల్లో వడిసెల వంటి ఆయుధాలు లభించాయన్నారు. లేఖి ప్రసంగంలోని పలు ప్రస్తావనలను రికార్డుల నుంచి తొలగించాలని బీఎస్పీ ఎంపీ డానిశ్‌ డిమాండ్‌ చేశారు. దాంతో, చర్చలో మత ప్రస్తావన తీసుకురావద్దని స్పీకర్‌ ఓం బిర్లా ఆదేశిస్తూ.. మీనాక్షి లేఖి ప్రసంగంలోని పలు ప్రస్తావనలను రికార్డుల నుంచి తొలగించారు.

హిందూత్వ విద్వేష సునామీ: ఓవైసీ
ఢిల్లీ హింసాకాండకు పాల్పడినవారిని చట్టం ముందు నిలిపేందుకు నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ డిమాండ్‌ చేశారు. హిందూత్వ విద్వేషమనే సునామీ వచ్చిందన్నారు. దేశ ఆత్మని కాపాడాలని ఓవైసీ హిందువులను కోరారు. దాదాపు 1,100 మంది ముస్లింలను అక్రమంగా నిర్బంధించారన్నారు. ఓవైసీ చేసిన కొన్ని వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యులు తీవ్రంగా నిరసన తెలిపారు. కేంద్రమంత్రులు రవిశంకర్‌ ప్రసాద్, కిషన్‌ రెడ్డి కూడా తీవ్ర నిరసన తెలిపారు.  ‘ఢిల్లీ అల్లర్లను మత కలహాలనడం హాస్యాస్పదం. ఇవి ముందే ప్లాన్‌ చేసుకున్న ఊచకోత’ అని ఓవైసీ వ్యాఖ్యానించారు. ‘ఫైజాన్‌ ముస్లిం అయినంత మాత్రాన ఆయన ప్రాణం విలువ అంకిత్‌ ప్రాణం విలువ కన్నా తక్కువ కాబోదు. మొత్తం హింసాకాండపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలి’ అని ఆయన కోరారు. అల్లర్ల సమయంలో ముస్లింలకు సాయం చేసిన సిక్కులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్‌లో హిందువుల బస్తీలను ఎవరు ఖాళీ చేయిస్తున్నారు?
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో హిందువుల బస్తీలను ఎంఐఎం పార్టీ వారు ఖాళీ చేయిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ఓవైసీ ప్రసంగానికి కౌంటర్‌గా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..  పాత బస్తీలో అనేక చోట్ల దళితుల బస్తీలను ఎంఐఎం వారు ఖాళీ చేయించారని ఆరోపించారు. అంతేకాకుండా, వారిపై దాడులు కూడా చేయిస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో ఇవన్నీ చేస్తూ ఇక్కడ పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తున్నారని విమర్శించారు. ఇది సరైన పద్దతి కాదని హితవు పలికారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు