‘మల్టీపర్పస్‌ కార్డు సాధ్యమే’

23 Sep, 2019 16:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అన్ని రకాల కార్డుల స్ధానంలో బహుళ అవసరాల కోసం ఒకే ఒక మల్టీపర్పస్‌ కార్డును తీసుకురావాల్సి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. మన వద్ద గుర్తింపు కార్డు సహా ఓటర్‌ కార్డు, పాస్‌ పోర్ట్‌, పాన్‌ వంటి మల్టీ పర్పస్‌ గుర్తింపు కార్డు పధకం లేకున్నా దీన్ని తీసుకురావడం సాధ్యమేనని చెప్పారు. 2021లో జనగణను మొబైల్‌ యాప్‌ ద్వారా చేపడతామని ఆయన స్పష్టం చేశారు. 2021 జనగణన, జాతీయ జనాభా జాబితా (ఎన్‌పీఆర్‌) కోసం ప్రభుత్వం రూ 12,000 కోట్లు వెచ్చిస్తుందని చెప్పారు. ఇది పేపర్‌ జనగణన నుంచి డిజిటల్‌ జనగణన దశకు మారుతుందని తెలిపారు. విశిష్ట గుర్తింపు కార్డు, జాతీయ జనాభా రిజిస్టర్‌ల గురించి అమిత్‌ షా మరిన్ని వివరాలు వెల్లడించకున్నా ఈ రెండు కార్యక్రమాల ద్వారా భారీ ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ఎన్‌పీఆర్‌ ద్వారా శాంతి భద్రతల పర్యవేక్షణ మెరుగవుతుందని, నేరాల నియంత్రణ, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ సులువవుతుందని చెప్పారు. ఓటర్ల జాబితాకు జనన, మరణ రిజిస్టర్లను ఆటోమేటిగ్గా లింక్‌ చేయాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. జనగణన ఆధారంగా 21 సంక్షేమ కార్యక్రమాలు, పధకాలు కొనసాగుతాయన్నారు.

మరిన్ని వార్తలు