కశ్మీర్‌కు 9 అదనపు బెటాలియన్లు

9 Jun, 2018 01:32 IST|Sakshi
ఆర్‌ఎస్‌పురాలో షెల్లింగ్‌ బాధిత కుటుంబీకులతో మాట్లాడుతున్న రాజ్‌నాథ్‌

రూ. 450 కోట్లతో 14 వేల బంకర్ల నిర్మాణం

జమ్మూ పర్యటనలో రాజ్‌నాథ్‌ ప్రకటన

ఆర్‌ఎస్‌పురా, కుప్వారాల్లో పర్యటన

జమ్మూ: పాకిస్తాన్‌ చేస్తున్న వరుస షెల్లింగ్‌ దాడులను తిప్పికొట్టేందుకు కశ్మీర్‌లో కొత్తగా 9 బెటాలియన్లను ఏర్పాటుచేస్తామని హోం మంత్రి రాజ్‌నాథ్‌ ప్రకటించారు. అందులో రెండింటిని సున్నిత ప్రాంతాల్లో మోహరిస్తామన్నారు. జమ్మూ, కశ్మీర్‌లలో ఒక్కోటి చొప్పున 2 మహిళా బెటాలియన్లను ఏర్పాటుచేస్తామని, వీటి వల్ల సుమారు 2 వేల మంది మహిళలకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. త్వరలో ఏర్పాటుచేయబోయే ఇండియన్‌ రిజర్వ్‌ బెటాలియన్లలో స్థానికులకే 60 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.

సరిహద్దుల్లో పాక్‌ కాల్పుల ప్రభావిత ప్రాంతాలైన ఆర్‌ఎస్‌పురా, కుప్వారా జిల్లాల్లో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాల్పుల సమయంలో వాడుకోవడానికి అక్కడ బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో స్థానికులకు రక్షణగా రూ.450 కోట్ల వ్యయంతో 14,460 బంకర్లు నిర్మిస్తామన్నారు. పాక్‌ షెల్లింగ్‌లో మృతిచెందిన వారి కుటుంబీకులకు పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచామని తెలిపారు.

ఈ మొత్తాన్ని బాధిత కుటుంబ బ్యాంకు ఖాతాలో వేస్తామని, ఇకపై ఈ సాయం పొందాలంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాల్సిన అవసరంలేదన్నారు. రాష్ట్రంలో స్థిరపడిన పశ్చిమ పాకిస్తాన్‌ శరణార్థుల కుటుంబాలకు రూ.ఐదున్నర లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని వెల్లడించారు. కుప్వారాలో వలసదారులు, స్థానిక ప్రతినిధులతో రాజ్‌నాథ్‌ సమావేశమయ్యారు. జిల్లా పోలీస్‌ లైన్స్‌ సందర్శించి అమర జవాన్లు, పోలీసులకు నివాళులర్పించారు. రాజ్‌నాథ్‌ వెంట కశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీ, కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ ఉన్నారు.

రోహింగ్యాలపై సర్వే..
దేశంలో నివసిస్తున్న రోహింగ్యా ముస్లింలపై సర్వే జరపాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించామని రాజ్‌నాథ్‌ చెప్పారు. అలాగే వారు పౌరసత్వం పొందేలా ఎలాంటి చట్టబద్ధ పత్రాలు జారీచేయొద్దని సూచించామన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి సర్వే సమాచారం వచ్చిన తరువాత రోహింగ్యాలను వెనక్కి పంపే ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు.

దేశవ్యాప్తంగా మావోయిస్టుల ప్రాబల్యం క్రమంగా తగ్గుముఖం పడుతోందని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కేవలం పది జిల్లాల్లోనే మావోయిస్టుల హింస ఆందోళనకరంగా ఉందని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అతివాదుల కార్యకలాపాలు తగ్గాయని తెలిపారు. ప్రధానికి నక్సలైట్ల ముప్పు ఉందన్న వార్తలపై స్పందిస్తూ..మోదీ భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.   
 

మరిన్ని వార్తలు