మరికొన్ని మినహాయింపులు

26 Mar, 2020 02:36 IST|Sakshi

కేంద్ర హోంశాఖ తాజా మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌కు ఆదేశించిన నేపథ్యంలో దీనినుంచి కొన్నిటికి మినహాయింపులు కల్పిస్తూ కేంద్ర హోంశాఖ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఆర్బీఐ, ఆర్బీఐ నియంత్రించే ఫైనాన్షియల్‌ మార్కెట్లు, పే అండ్‌ అకౌంట్స్‌ అధికారులు, కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) క్షేత్రస్థాయి అధికారులు, పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా వ్యవస్థ, పెన్షన్‌ సేవలు, అటవీ సిబ్బందిని లాక్‌డౌన్‌ పరిధి నుంచి మినహాయించారు. ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో కార్గో సేవల నిర్వహణ సిబ్బంది, బొగ్గు తవ్వకాలు, ఢిల్లీ కేంద్రంగా పనిచేసే రెసిడెంట్‌ కమిషనర్లు, సిబ్బంది, విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో పనిచేసే కస్టమ్స్‌ సిబ్బందిని కూడా లాక్‌డౌన్‌ నుంచి మినహాయించారు. జంతు ప్రదర్శన శాలల(జూ) నిర్వహణ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బందితోపాటు అనాధ బాలల సంరక్షణ సిబ్బంది, అనాథలు, వితంతు శరణాలయాలు, పశు వైద్యశాలలు, మందుల షాపులు (జన ఔషధి దుకాణాలతో కలిపి), ఫార్మా రీసెర్చ్‌ ల్యాబ్‌లు, బ్యాంకింగ్‌ ఆధారిత ఐటీ సేవలు, ఏటీఎం నిర్వహణ ఏజెన్సీలను కూడా లాక్‌డౌన్‌ నుంచి మినహాయించారు.  

ఎవరేం వాడాలి?
న్యూఢిల్లీ: మాస్కులు, గ్లౌజ్‌లు, కళ్లజోళ్లు,  డిమాండ్‌ పెరగడంతో ఎవరెవరు ఎలాంటి రక్ష ణ ఉపకరణాలు వాడాలో చెప్తూ్త కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.
దాని ప్రకారం..  
     
► కోవిడ్‌ రోగులకు చికిత్సచేసేవారికి పూర్తిస్థాయిలో రక్షణ ఉపకరణాలు ఉండాలి.
     
► పరిపాలన సిబ్బందిని ‘నో–రిస్క్‌’ జాబితాలో చేర్చారు. వీరికి ఈ వ్యక్తిగత రక్షణ పరికరాల అవసరం ఉండదు. పరిపాలన విభాగానికి చెందిన వారెవరూ రోగులకు చికిత్స అందిస్తున్న ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
     

► ప్రయాణికులకు సమాచారం అందించే హెల్త్‌ డెస్క్‌ సిబ్బందిని ‘లో– రిస్క్‌’ కేటగిరీలో చేర్చారు. వీరు మూడు పొరలున్న మెడికల్‌ మాస్క్, చేతి తొడుగులు వాడాలి. 3పొరల మెడికల్‌ మాస్క్‌ ద్రవాలను అడ్డుకోగలదు. రోగుల దగ్గు, తుమ్ముల ద్వారా వెలువడే ద్రవాలు శరీరంలోకి చేరకుండా కాపాడతాయి.  
     

► పారిశుధ్య కార్మికులను మధ్యమస్థాయి ప్రమాదం ఉన్న ‘మోడరేట్‌ రిస్క్‌’ కేటగిరీలో ఉంచారు. తరచూ నేలను, ఉపరితలాలను శుభ్రం చేసే వీరికి ఎన్‌95 మాస్క్‌ అందించాలి.  వైద్య పరీక్షలు నిర్వహించే వైద్యులు, నర్సులకు కూడా ఇంతే స్థాయిలో ప్రమాదం ఉంటుంది.  
     
► రోగులను రవాణా చేసే వారికి పూర్తిస్థాయిలో ప్రమాదం ఉన్నందున అన్ని రకాల వ్యక్తిగత రక్షణ పరికరాలు అందుబాటులో ఉండాలి. ఇదే విధంగా నమూనాలు సేకరించే అధికారులకు, పరిశోధనశాల నిపుణలకు కూడా పూర్తిస్థాయిలో ఈ పరికరాలు అందించాలి.  
     
► స్వీయ నిర్బంధంలో ఉన్న వారికి ప్రమాదం తక్కువ. కుటుంబంలో ఎవరైనా క్వారంటైన్‌లో ఉంటే వారికి సేవలందించే వ్యక్తి చేతి తొడుగులు తొడుక్కోవడం అవసరం. మిగిలిన కుటుంబ సభ్యులకు ఎలాంటి వ్యక్తిగత రక్షణ పరికరాలు అవసరం లేదు. 

మరిన్ని వార్తలు