ఎన్జీవోలకు హోం శాఖ షోకాజ్‌

11 Jul, 2017 09:25 IST|Sakshi
ఎన్జీవోలకు హోం శాఖ షోకాజ్‌

ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పండి

సాక్షి, న్యూఢిల్లీ: ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ 5,922 ఎన్జీవోలకు కేంద్ర హోం శాఖ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుంచి నిధులు, విరాళాలు పొందాలంటే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద నమోదు చేయించుకోవాలి. అనంతరం రిటర్నులను ప్రతి ఏడాదీ సమర్పించాలి. 18,523 స్వచ్ఛంద సంస్థలు 2010–11 నుంచి 2014–15 మధ్య రిటర్నులు దాఖలు చేయలేదు.

ప్రభుత్వం ఆయా సంస్థలకు జూలై 8న షోకాజ్‌ నోటీసులిస్తూ, రిజిస్ట్రేషన్‌ను ఎందు కు రద్దు చేయకూడదో జూలై 23లోపు చెప్పాలంది. లేకపోతే రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తామని స్పష్టం చేసింది. నోటీసులు అందుకున్న సంస్థల్లో నెహ్రూ స్మారక మ్యూజియం–గ్రంథాలయం, ఇందిరా గాంధీ కళాక్షేత్రం, ఇగ్నో, ఢిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం, శ్రీరామకృష్ణ సేవాశ్రమం వంటివి ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని స్వర్ణ భారత్‌ ట్రస్టు, సుజనా చారిటబుల్‌ ట్రస్టు, శ్రీ సత్యసాయి మెడికల్‌ ట్రస్టు వంటి పేరున్న స్వచ్ఛంద సంస్థలకూ నోటీసులు వెళ్లాయి.

మరిన్ని వార్తలు