కరోనా ఎఫెక్ట్‌ : ఇంటి కిరాయి మూడు నెలలు వాయిదా

17 Apr, 2020 18:58 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి కిరాయి వసూలును మూడు నెలల పాటు వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం కోరింది.  ఇంటి రెంట్‌తో పాటు, భూముల కిరాయిలు కూడా వాయిదా వేయాలని ఇంటి యజమానులకు తెలిపింది. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా దేశంలో మే 3 వరకు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. దీంతో పనులు లేక ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. పెద్ద ఎత్తున ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో నగరాల్లో ఇళ్ల కిరాయిలు కట్టడం కొందరికి కష్టతరంగా మారింది. ఈ విషయాన్ని పలువురు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసిన ఠాక్రే.. కిరాయిలను మూడు నెలల పాటు వాయిదా వేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని సూచించారు.

కాగా దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదవుతున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో మొత్తం కోవిడ్‌-19 కేసుల సంఖ్య 3000 దాటింది. మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. రోజురోజుకూ పెద్ద ఎత్తున వైరస్‌ కేసులు పెరగడం అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు ముంబై సమీపంలోని ధారావి మురికివాడకూ వైరస్‌ వ్యాప్తించింది. ఇప్పటి వరకు అక్కడ 90కి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు