ఫుట్‌పాత్‌పై ప్రసవం

5 Jan, 2019 08:33 IST|Sakshi
లక్ష్మీ, బబ్లూ దంపతులు

దక్షిణ ఢిల్లీలో కాలిబాటపై ప్రసవించిన నిరాశ్రయురాలు

సమాచారం అందుకుని ఆస్పత్రిలో చేర్చిన ఎన్జీవో సభ్యులు

సాక్షి, న్యూఢిల్లీ: భర్త, ఇద్దరు పిల్లలతో రోడ్లపై నివసించే మహిళ దక్షిణ ఢిల్లీలో రోడ్డు పక్కనున్న ఫుట్‌పాత్‌పై  ఆడపిల్లను ప్రసవించింది. బారాపులా ప్రాంతంలోనున్న  నైట్‌షెల్టర్లలో చోటు లభించకపోవడం వల్ల లక్ష్మి, రోజు కూలీ పనిచేసే ఆమె భర్త బబ్లూ, ఇద్దరు పిల్లలు  బుధవారం రాత్రి  పుట్‌పాత్‌పై నిద్రపోయారు.  ఆ రాత్రి ఆమెకు నొప్పులు వచ్చి బిడ్డను అక్కడే ప్రసవించింది. బిడ్డను  ప్రసవించిన 18 గంటల తరువాత కూడా  తల్లికి, బిడ్డకు మధ్య ఉండే పేగును కత్తిరించలేదని, దాని వల్ల తల్లికి, బిడ్డకు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని సెంటర్‌ ఫర్‌ హోలిస్టిక్‌ డెవలప్‌మెంట్‌ అనే ఎన్జీవోకు చెందిన సునీల్‌కుమార్‌ ఎలీడియా చెప్పారు. నైట్‌ రెçస్క్యూ టీమ్‌ అందించిన సమాచారంతో  తాము అంబులెన్స్‌ను పిలిచి మహిళను సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో చేర్చించామని ఆయన చెప్పారు.

గర్భిణులు, పాలిచ్చే తల్లుల కోసం ఢిల్లీ ప్రభుత్వం రెండు నైట్‌ షెల్టర్లు నడుపుతోందని అయితే అయితే వాటి వద్ద ఆపదలో, అవసరంలో ఉన్న వారిని  ఆదుకునే, రక్షించే యంత్రాంగం లేదని సునీల్‌కుమార్‌ చెప్పారు. లక్ష్మి, ఆమె భర్త  ఏడు సంవత్సరాలుగా  ఢిల్లీ రోడ్లపై నివసిస్తున్నారు. పొట్ట చేత పట్టుకుని జార్ఖండ్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. లక్ష్మి, కొత్తగా పుట్టిన ఆమె కూతురు ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారని, వారికి సరైన ఆరోగ్య సంరక్షణ లభిస్తోందని సునీల్‌ కుమార్‌ చెప్పారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని,  ప్రస్తుతానికి తల్లీ బిడ్డలను షెల్టర్‌ హోమ్‌కు పంపి తరువాత  పాలిచ్చే తల్లుల కోసం  నడిపే కేంద్రానికి తరలిస్తామని ఢిల్లీ అర్బన్‌ షెల్టర్‌ ఇంప్రూవ్‌మెంట్‌ బోర్డు సభ్యుడు బిపిన్‌ రాయ్‌ చెప్పారు.  

మరిన్ని వార్తలు