వారెవ్వా.. ఆ గృహిణికి సోల్జర్స్ సెల్యూట్

1 Sep, 2016 11:51 IST|Sakshi

షిమ్లా: తోటి జవాను అనుకోని ప్రమాదంలో పడి ప్రాణాల కోసం పోరాడుతుంటే చూసి తోటి జవాన్లు నిస్సహాయులుగా మారగా ఓ సామాన్య గృహిణీ మాత్రం అతడి ప్రాణాలు నిలబెట్టింది. ఏమాత్రం సంకోచించకుండా అతడికి నోటి ద్వారా శ్వాసను అందించి తిరిగి ఊపిరిపోసింది. ఈ ఘటన గత నెల(ఆగస్టు) 20న చోటుచేసుకుంది. షిమ్లాకు పన్నెండు కిలోమీటర్ల దూరంలోని బానుతి ప్రాంతంలో అస్సోం రైఫిల్స్కు చెందిన కొందరు సైనికులకు శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు.

అక్కడ శిక్షణ పొందుతున్న సైనికుల్లో కొందరు వీధిలో వెళుతుండగా పెద్దమొత్తంలో వీధి కుక్కలు ముకేశ్ కుమార్ అనే సైనికుడిపైకి ఎగబడ్డాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో పరుగెడుతూ ప్రమాదవశాత్తూ రోడ్డుపక్కనే ఉన్న 50 అడుగుల గుంతలో పడ్డాడు. అందులోని రాయికి అతడి తల బలంగా తగిలింది. దీంతో అతడు స్పృహలేకుండా పడిపోయాడు.

ఆ సమయంలో తోటి సైనికులు సహాయంకోసం అరవడం మొదలుపెట్టారు. ఆ అరుపులు విని వచ్చిన వీణా శర్మ (42) అనే గృహిణి అక్కడ ఏం చేయాలో పాలుపోక నిస్సహాయంగా నిల్చున్న సైనికులను చూసి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెళ్లి స్పృహకోల్పోయిన సైనికుడికి తన నోటి ద్వారా ఊపిరి అందించింది. అనంతరం తన తండ్రి రమేశ్ శర్మను పిలిచి కారులో ఎక్కించి జుతోఘ్ లోని మిలటరీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి తిరిగి షిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీకి తరలించి ప్రత్యేక వైద్య సేవలు అందించడంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. వీణా శర్మ సమయస్ఫూర్తితో చేసిన ఆపనికి అందరు శబాష్ అంటున్నారు.

మరిన్ని వార్తలు