హర్యానా రాజకీయాల్లో యోయో హానీసింగ్!

6 Oct, 2014 16:41 IST|Sakshi
హర్యానా రాజకీయాల్లో యోయో హానీసింగ్!
చండీఘడ్: ర్యాప్ మ్యూజిక్ తో, ముఖ్యంగా 'లుంగీ డ్యాన్స్' పాటతో సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించిన రాప్ సింగర్ యో యో హానీసింగ్ మరో కొత్త పాత్రలో కనిపించనున్నారు. హర్యానాలో జరుగనున్న ఎన్నికల ప్రచారంలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో తమ పార్టీకి మద్దతుగా యోయో హానీసింగ్ పాల్గొంటారని ఆ పార్టీ అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా మనవడు కరణ్ చౌతాలా మీడియాకు వెల్లడించారు. 
 
అవినీతి ఆరోపణల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఓం ప్రకాశ్ చౌతాలా బెయిల్ బయటకు వచ్చారు. ఆయన కూడా పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంటారని పార్టీ నేతలు వెల్లడించారు. హర్యానా రాష్ట్రానికి చౌతాలా నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2005 తర్వాత అధికారాన్ని కోల్పోయిన చౌతాలా అవినీతి ఆరోపణల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నారు. హర్యానా రాష్ట్రంలో అక్టోబర్ 15 తేదిన ఎన్నికలు జరుగనున్నాయి.  
మరిన్ని వార్తలు