అల‍్లర్ల కోసం రూ.కోటి 25 లక్షలు ఖర్చు

7 Oct, 2017 14:21 IST|Sakshi

గుర్మీత్‌ అరెస్ట్‌ తరువాత చెలరేగిన అల్లర్లు

డేరా కోర్‌ కమిటీలో హనీప్రీత్‌ కీలకం

సాక్షి, పంచకుల : డేరా సచ్చాసౌధా మాజీ అధిపతి, రేప్‌ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్‌బాబా తీర్పు తరువాత జరిగిన అల్లర్లకు ఆయన దత్త పుత్రిక హనీప్రీత్‌ ఇన్సాన్‌నే మాస్టర్‌ మైండ్‌ అని తెలుస్తోంది. పంచకుల సీబీఐ కోర్టు తీర్పు తీరువాత.. అల్లర్లు, హింసాత్మక ఘటనల కోసం హనీప్రీత్‌ ఇన్సాన్‌ కోటి 25 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు సిట్‌ అధికారులు చెబుతున్నారు. గుర్మీత్‌ వ్యవహారంపై ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్న సిట్‌ అధికారులు.. తాజాగా గుర్మీత్‌ వ్యక్తిగత సహాయకుడు రాకేష్‌ కుమార్‌ని విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలోనే పలు విషయాలు వెలుగు చూశాయని సీట్‌ అధికారి ఏసీపీ ముఖేష్‌ తెలిపారు.

గుర్మీత్‌పై తీర్పు సమయంలో ఆయనతో పాటు దత్తపుత్రిక హనీప్రీత్‌, వ్యక్తిగత సహాయకుడు రాకేష్‌ కుమార్‌ వెంట ఉన్నారు. తీర్పు వెలువడిన వెంటనే అల్లర్లకు వారు పథకం రచించారని అందుకోసం కోటి 25 లక్షల రూపాయలను వినియోగించారని సిట్‌ అధికారులు ప్రకటించారు. ఇదే విషయాన్ని పంచకుల కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఏఎస్‌ చావ్లా సైతం ధృవీకరించారు.

గుర్మీత్‌ అరెస్ట్ తరువాత జరిగిన అల్లర్లకు సంబంధించి ఇప్పటికే సిట్‌ అధికారులు రాకేష్‌ కుమార్‌, హనీప్రీత్‌లను విచారణ చేస్తున్నారు. ఈ అల్లర్లకు సంబంధించిన కీలక వ్యక్తులు ఆదిత్య ఇన్సాన్‌, పవన్‌ ఇన్సాన్‌ల కోసం గాలిస్తున్నట్లు అధికారలు తెలిపారు. ఇదిలా ఉండగా హనీప్రీత్‌, ఆమె భర్త ఇక్బాల్‌ సింగ్‌, సుఖ్‌దీప్‌లు డేరా కోర్‌ కమిటీ సభ్యులుగా సిట్‌ అధికారులు చెబుతున్నారు. ఇందులో సుఖ్‌దీప్‌ డేరా అనుచరులకు ఆయుధాలను ఉపయోగించడంలో ట్రైనింగ్‌ ఇచ్చేవాడని పోలీసులు తెలిపారు. డేరా ప్రధానకార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లను ఐటీ విభాగం విశ్లేషణ చేస్తున్నారని చెప్పారు. హార్డ్‌ డిస్క్‌ల్లోని విషయం బయటకు వస్తే.. మరింత సమాచారం తెలుస్తుందని సిట్‌ అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు