నేరస్తుల అప్పగింత బిల్లు వెనక్కి

24 Oct, 2019 04:00 IST|Sakshi
నేరస్తుల అప్పగింత బిల్లును వ్యతిరేకిస్తూ హాంకాంగ్‌లో భారీ నిరసన ర్యాలీ (ఫైల్‌)

ఎట్టకేలకు ఉపసంహరించిన హాంకాంగ్‌

తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో నిర్ణయం

హాంకాంగ్‌/బీజింగ్‌: కొన్ని నెలలుగా నిరసనలకు కారణమైన వివాదాస్పద ‘నేరస్తుల అప్పగింత’ బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్లు బుధవారం హాంకాంగ్‌ ప్రకటించింది. ఈ బిల్లుపై వ్యతిరేకతే తరువాత కాలంలో మరిన్ని ప్రజాస్వామ్య మార్పులను కోరుతూ తీవ్రమైన నిరసనలకు కారణమైంది. బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్లు హాంకాంగ్‌ సిటీ సెక్రటరీ ఫర్‌ సెక్యూరిటీ జాన్‌ లీ స్థానిక చట్ట సభలో ప్రకటించారు. ఈ విషయమై ప్రశ్నించేందుకు కొందరు ప్రజాస్వామ్య మద్దతుదారులైన సభ్యులు ప్రయత్నించగా ఆయన సమాధానమివ్వలేదు.

హాంకాంగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ను మార్చలేదు
హాంకాంగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కేరీ లామ్‌ను మార్చేందుకు చైనా ప్రయత్నిస్తోందన్న మీడియా కథనాలను చైనా తోసిపుచ్చింది. అది  స్వార్థ ప్రయోజనాల కోసం పుట్టించిన రాజకీయ వదంతి అని పేర్కొంది. కేరీ లామ్‌ స్థానంలో తాత్కాలిక చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ను నియమించే దిశగా చైనా ఆలోచిస్తోందని లండన్‌ కేంద్రంగా వెలువడే ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక ఒక కథనం ప్రచురించింది. ఆ కథనాన్ని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్‌ తోసిపుచ్చారు. లామ్‌కు తమ పూర్తి మద్దతు ఉందని పేర్కొన్నారు. హాంకాంగ్‌లో త్వరలోనే హింస నిలిచిపోయి, సాధారణ స్థితి ఏర్పడుతుందన్నారు. నేరస్తుల అప్పగింత బిల్లును వెనక్కు తీసుకోవడంతో పాటు లామ్‌ రాజీనామా చేయాలన్నది హాంకాంగ్‌లోని ప్రజాస్వామ్య వాదుల ప్రధాన డిమాండ్‌.  

బిల్లులో ఏముంది?
ఈ బిల్లు ఆమోదం పొందితే చైనాతో పాటు ప్రపంచంలోని ఏ దేశానికైనా నేరానికి పాల్పడినట్లుగా భావిస్తున్న తమ పౌరులను హాంకాంగ్‌ అప్పగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం హాంకాంగ్‌కు అమెరికా, యూకే సహా 20 దేశాలతో నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంది. చైనాతో మాత్రం లేదు. 1997లో హాంకాంగ్‌ చైనా చేతికి వచ్చాక ఒక దేశం రెండు వ్యవస్థల విధానం కింద హాంకాంగ్‌కు 50 ఏళ్ల పాటు అత్యున్నత స్వయంప్రతిపత్తి, న్యాయ స్వతంత్రత లభించాయి. చాన్‌ అనే హాంకాంగ్‌ పౌరుడు తైవాన్‌లో తన గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేసి తిరిగి హాంకాంగ్‌కు వచ్చిన నేపథ్యంలో ఈ బిల్లును ప్రభుత్వం తెచ్చింది. చాన్‌ హాంకాంగ్‌ జైళ్లో ఉన్నాడు. నేరస్తుల అప్పగింతకు ముందు ఆ అభ్యర్థనను కోర్టులో సవాలు చేసే అవకాశం బిల్లులో ప్రతిపాదించారు. ఏడేళ్లు, లేదా ఆపై శిక్ష పడే నేరాలకే అప్పగింత వర్తించేలా ప్రతిపాదనను బిల్లులో చేర్చారు.

>
మరిన్ని వార్తలు