విలేకరులకు సన్మానం

7 May, 2018 14:01 IST|Sakshi
సన్మానం అందుకున్నపాత్రికేయులు

కొరాపుట్‌/జయపురం :  ప్రపంచ మీడియా దినోత్సవం సందర్భంగా కొరాపుట్‌ జిల్లాలో పలువురు పాత్రికేయులు, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులను శనివారం సన్మానించారు. కౌన్సిల్‌ ఫర్‌ మీడియా అండ్‌ శాటిలైట్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ న్యూస్‌ ఆధ్వర్యంలో కొరాపుట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని పాత్రికేయులు, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీనియర్‌ జర్నలిస్ట్‌ కె.సుధాకర్‌ పట్నాయక్, ఓటీవీ జయపురం బ్యూరో ఛీప్‌ టి.గౌరీ శంకర్,  ప్రముఖ ఒడియా దినపత్రిక సమాజ్‌ జిల్లా ప్రతినిధులు దిలీప్‌ మహంతి, పతిత పావన సాహు, సూర్యనారాయణ పండాలను సన్మానించారు. ఈ సందర్భంగా పాత్రికేయులకు సీఎంసీబీ జిల్లా అధ్యక్షుడు నిసాపతి నాయక్‌ ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కొరాపుట్‌ విశ్వ విద్యాలయం జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సౌరవ్‌ గుప్తా మాట్లాడుతూ..పాత్రికేయులు కచ్చితమైన ప్రమాణాలతో వార్తలు రాయడం సమాజానికి మేలు చేకూరుస్తుందని  అభిప్రాయం వ్యక్తం చేశారు. పత్రికలు, పాత్రికేయుల రక్షణ కోసం యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీ 1948లో ప్రపంచ పత్రిక స్వేచ్ఛా దినంగా మే 3వ తేదీని ప్రకటించినట్లు ఆయన తెలిపారు.

పాత్రికేయుల రక్షణ కోసం చట్టాలున్నప్పటికీ వారిపై ఎక్కడికక్కడ దాడులు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ముగ్గురు పాత్రికేయులను హత్య చేశారన్నారు. సుమారు 13 దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాత్రికేయులపై దాడులు చేసిన దోషులు ముగ్గురిని మాత్రమే అరెస్టు చేసి శిక్షించారన్నారు.

స్వేచ్ఛ ఉన్న నాడు సక్రమంగా కర్తవ్యం 

 ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. సమాజంలో పత్రికల, ఎలక్ట్రానిక్‌ మీడియా బాధ్యతలను వివరించారు. జర్నలిస్టులకు స్వేచ్ఛ ఉన్న నాడే వారి కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించగలరని, అయితే నేడు అనేక సందర్భాల్లో జర్నలిస్టులపై దాడులు జరుగాయన్నారు. వారికి భద్రత లేకుండా పోయిందని ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు తగిన రక్షణ కల్పించాలని వక్తలు కోరారు.

కొరాపుట్‌ జిల్లా సమాచార ప్రజా సంబంధాల అధికారి జగన్నాథ్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్‌సీఎంఏ ప్రాంతీయ డైరెక్టర్‌ వేణు ధర్‌ సాహు, సీఎంఎస్‌బీ అధ్యక్షుడు వీ.కె. బంగారి, ప్రముఖ భూదాన ఉద్యమ నేత కృష్ణ సింగ్, కేంద్రీయ విశ్వ విద్యాలయ ప్రొఫెసర్‌ సౌరవ్‌ గుప్త , సమాజ్‌ దినపత్రిక బ్యూరో చీఫ్‌ సమరేందు దాస్, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు