దారుణం: దళితుల బావిలో విషం

5 Sep, 2017 10:31 IST|Sakshi
దారుణం: దళితుల బావిలో విషం

సాక్షి,బెంగళూరు: ‘అంటరాని తనం నేరం’ ఈ రాజ్యాంగ  నిబంధనను గత కొన్ని దశాబ్దాలుగా వింటూనే ఉన్నాం. అయినా  సామాజిక  అణచివేత, వివక్ష దళితుల పాలిట ఒక శాపంగా గానే కాదు..మరణశాసనంలా పరిణమిస్తోందనడానికి నిదర‍్శనంగా నిలిచింది ఓ సంఘటన. కర్ణాటకలోని ఓ  గ్రామంలో  ఆధిపత్ యకులాల అమానుషానికి అద్దం పట్టిన ఉదంతమిది.  ఒకవైపు మేకిన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా వైపు దేశం పరుగులు పెడుతోంటే.. మరోవైపు దళితులపై వివక్ష మాత్రం  మరింత వికృత  రూపం దాలుస్తోంది.  కలాబూర్గి జిల్లాలోని చానూర్ గ్రామంలో, ఆధిపత్య  సమాజానికి చెందిన వ్యక్తులు  దళితుల వాడే తాగునీటి బావిలో విషాన్ని కలపడం  కలకలం రేపింది.

రాజధాని బెంగళూరుకు 640 కి.మీ దూరంలో ఉన్న గ్రామంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది.  చానూర్‌ గ్రామంలో మొత్తం ఏడు బావులుండగా, ఊరి చివర ఉన్న బావి మాత్రమే దళితులకు శరణ్యం. అయితే వ్యవసాయ భూమికి అనుసంధానంగా ఉన్న  దళిత సభ్యుడికి చెందిన ఈ బావిని నాలుగు సంవత్సరాల క్రితం ఉన్నత కులానికి చెందిన గొల్లలప్పగౌడ లీజుకు తీసుకున్నారు.  ఇక  అప్పటినుంచి దళితులకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి.  లీజుకు తెచ్చుకున్నప్పటి నుంచి  గోల్లలప్పగౌడ దళితులను అడ్డుకోవడానికి  చేయని ప్రయత్నం లేదు. ఈ నేపథ్యంలో బావినుంచి నీటి సరఫరాకోసం ఒక పంప్‌ను ఏర్పాటు చేసుకున్నారు దళితులు.  అయితే ఆగష్టు 29  పంప్‌నుంచి ఈ నీరు సరఫరా కూడా ఆగిపోవడంతో  దళిత యువకుడు మహంతప్ప నీటికోసం బావి దగ్గరికి వెళ్లాడు. ఈ సందర్భంగా నీళ్లలో ఏదో కలిపినట్టుగా అనుమానించి, వెంటనే   గ్రామస్తులను  అప్రమత్తం చేశాడు.  దళిత సంఘంలోని కొంతమంది సభ్యులు ఈ సంఘటనను పోలీసులకు  ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగు  చూసింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

రూరల్‌ డీఎస్‌పీఎస్‌ ఎస్‌ హుల్లూర్‌ అందించిన సమాచారం ప్రకారం చంపేస్తానంటూ దళితులను గొల్లలప్పగౌడ  అనేకసార్లు బెదిరించాడనీ,  తరచూ తాను చనిపోయే ముందు కనీసం  ఒక దళితుడినైనా హత్య చేస్తానని హెచ్చరించేవాడనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో జ్యూరుగీ పోలీసు స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదు చేశామన్నారు.  అంతేకాదు చాలాసార్లు చనిపోయిన కుక్కల్నీ, పిల్లుల్నీ, పాముల్నీ తీసుకొచ్చి బావిలో పడవేసేవాడనీ, అయినా దళితులు నీటిని శుభ్రం చేసుకుని వినియోగించుకునేవారని డీఎసీపీ చెప్పారు.

మరోవైపు విష ప్రయోగంతో  దళితులు వాడుకునే బావిని  పూర్తిగా ఖాళీ చేయించారు స్థానిక అధికారులు, పోలీసులు. అయితే మిగిలిన ఏడు బావుల్లో నీటిని తోడుకునేందుకు  నిందిత సామాజికవర్గం,  గ్రామంలోని  ఇతరులు అడ్డుకోవడం గమనార్హం.

 

మరిన్ని వార్తలు