అయ్యో! తాతకోసం చిన్నోడి కష్టం

21 Jul, 2020 19:25 IST|Sakshi

సాక్షి, ల‌క్నో: ప్రభుత్వ ఆసుపత్రులలో లంచాల కోసం పీక్కుతినే సిబ్బందికి సంబంధించి చాలా కథనాలు గతంలో విన్నాం.  తాజాగా మరో హృద‌య‌ విదార‌కమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్ట్రెచర్‌ కోసం లంచం అడిగిన రాబందులను సంతృప్తి పర‍్చలేక ఒక నిరుపేద కుటుంబంలోని ఆరేళ్ల బాలుడే స్వయంగా స్ట్రెచర్‌ను తోసుకుంటూ వెళ్లిన వైనం ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్, డియోరియా  జిల్లా ఆస్ప‌త్రిలో రెండు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాలను పరిశీలిస్తే డియోరియా జిల్లాలోని గౌర గ్రామానికి చెందిన చెడి యాద‌వ్  రెండు రోజుల క్రితం జిల్లా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో చేరారు. ఆయన కాలు ఫ్యాక్చ‌ర్ కావ‌డంతో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్ర‌మంలో సర్జికల్‌ వార్డులో ఉన్న యాద‌వ్‌ను డ్రెస్సింగ్‌ కోసం వేరే వార్డుకు తరలించాల్సి వచ్చింది. అయితే  స్ట్రెచర్‌పై తీసుకెళ్లేందుకు అక్క‌డున్న వార్డ్ బాయ్  30 రూపాయలు లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో యాదవ్‌కు సాయంగా వచ్చిన ఆయన కుమార్తె బిందు వ‌ద్ద డ‌బ్బులు లేక‌పోవ‌డంతో వాళ్లే స్ట్రెచర్‌పై తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. అయితే తల్లి కష్టం చూసి ఆ పసివాడి మనసు చలించిందో ఏమోకానీ,  అక్కడే ఉన్న బిందు ఆరేళ్ల కుమారుడు శివం కూడా తన వంతుగా ముందుకొచ్చాడు. బిందు ముందుండి స్ట్రెచ‌ర్ ను లాగితే.. శివం వెనుక తోస్తూ సాయం చేశాడు. ఈ దృశ్యాల‌ను ఎవరో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 

తన తండ్రి డ్రెస్సింగ్ కోసం స్ట్రెచర్‌ను వార్డుకు తీసుకెళ్లేందుకు హాస్పిటల్ సిబ్బంది ప్రతిసారీ 30 రూపాయలు డిమాండ్‌ చేశారనీ, డబ్బు ఇవ్వకపోతే, స్ట్రెచర్‌ను నెట్టడానికి నిరాకరించారని బిందు వాపోయారు.  మరోవైపు ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్‌ అమిత్ కిషోర్ ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. యాదవ్‌ కుటుంబాన్నిపరామర్శించారు. ఆసుపత్రి అసిస్టెంట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సంయుక్త దర్యాప్తు ప్యానల్‌ను ఏర్పాటు చేసి, వెంటనే నివేదికను సమర్పించాలని ఆదేశించారు. డ‌బ్బులు డిమాండ్ చేసిన వార్డు బాయ్‌ను విధుల నుంచి తొల‌గించామనీ, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు