మరోసారి గడువు పొడిగించిన సుప్రీకోర్టు

12 Sep, 2018 13:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భీమా కోరెగావ్‌ అల్లర్ల కేసులో పౌర హ‌క్కుల నేత‌ల గృహ నిర్బంధాన్ని సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది.  భీమా-కొరేగావ్ అల్లర్లతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న పౌర హక్కుల నేతలకు గృహ నిర్బంధ గడువు పెంచుతూ మరోసారి వారికి భారీ ఊరట కల్పించింది. ఈ గడువు నేటితో (సెప్టెంబరు 12) ముగియనున్న నేపథ్యంలో సెప్టెంబరు 17వ తేదీవరకు పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ  చేసింది.  
   
కాగా, ఆగస్టు 28న విప్లవ కవి వరవరరావు సహా మరో అయిదుగురి నేతల ఇళ్లలో  పుణే పోలీసుల సోదాలు నిర్వహించడంతో పాటు అరెస్ట్‌ చేసి పుణేకు తరలించారు. ఈ అరెస్టును సవాలు చేస్తూ చరిత్రకారులు రొమిల్లా థాపర్‌తో పాటు ఐదుగురు మేధావులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన  సుప్రీం పౌర నేతలను జైల్లో కాకుండా గృహనిర్బంధంలో ఉండాలని ఆగస్టు 30న ఆదేశించింది.  మొదట సెప్టెంబరు 6వరకు, ఆ తరువాత 12వ తేదీవరకు వరుసగా పొడిగిస్తూ వచ్చింది. తాజాగా మరో అయిదురోజులపాటు వారిని కేవలం గృహ నిర్బంధంలోనే ఉంచాలని సుప్రీంకోర్టు  బుధవారం ఆదేశించింది. ప్ర‌ధాని హ‌త్య‌కు కుట్ర ప‌న్నార‌న్న ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి వ‌ర‌వ‌ర‌రావుతో స‌హా మ‌రో న‌లుగురిని మ‌హారాష్ట్ర పోలీసులు అరెస్టు చేయ‌డం త‌ద‌నంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో వారిని  గృహ నిర్బంధంలోనే ఉంచాలని ఆదేశించింది. అంతేకాతు గత విచారణ సందర్భంగా పుణే పోలీసుల వ్యవహారంపై జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా త‌దిత‌రుల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు