30 ఏళ్ల క్రితం దేశం షాక్‌ తిన్నది!

5 Jun, 2016 15:50 IST|Sakshi
30 ఏళ్ల క్రితం దేశం షాక్‌ తిన్నది!

సరిగ్గా 36 ఏళ్ల కిందట 1986 జూన్‌ నెలలో ఓ దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. భారత్‌లోకి సైతం అత్యంత ప్రమాదకరమైన హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ వైరస్‌ ప్రవేశించిందని వెల్లడికావడం యావత్‌ దేశాన్ని నివ్వెరపరిచింది. మహిళా డాక్టర్‌ అయిన సునీతి సోలోమన్‌ ఈ విషయాన్ని మొట్టమొదటిసారిగా కనుగొని దేశమంతటా కలకలం రేపారు.

మద్రాస్‌ మెడికల్ కాలేజీలో యువ వైద్యురాలిగా ఉన్న ఆమె ఓ పరిశోధక ప్రాజెక్టులో భాగంగా 100 మంది సెక్స్‌ వర్కర్లను పరీక్షించారు. మద్రాస్‌లోని ఓ చిన్న ప్రాథమిక ల్యాబ్‌లో ఆమె నిర్వహించిన పరీక్షలు మున్ముందు దేశానికి వైద్యపరంగా పెను సవాలు విసురుతాయని అప్పుడు ఎవరూ ఊహించి ఉండరు. డాక్టర్‌ సునీతి 100 మంది సెక్స్‌వర్కర్లను పరీక్షించగా అందులో ఆరుగురికి హెచ్‌ఐవీ పాజిటివ్‌ ఉన్నట్టు తేలింది. హెచ్‌ఐవీ వైరస్‌ భారత్‌లోకి ప్రవేశించిందని తెలియడం అదే తొలిసారి. ఈ పరీక్షలే మున్ముందు దేశానికి ఎదురవుతున్న పెను వైద్య సవాల్‌ను వెల్లడించడమే కాకుండా.. ఇందుకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని చాటాయి.

షాక్‌ గురయ్యారు!
'పరీక్షల్లో ఏదో వెల్లడి అవుతుందని అనుకోవద్దని ఆమె ముందే తన నేతృత్వంలోని పరిశోధక విద్యార్థులకు చెప్పారు. తమ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో పూర్తిగా నెగిటివ్‌ ఫలితాలు వస్తాయని ఆమె ఆశించారు. కానీ పాజిటివ్ ఫలితాలు రావడం ఆమెను షాక్‌కు గురిచేసింది' అని డాక్టర్‌ సునీతి తనయుడు డాక్టర్‌ సునీల్‌ సోలోమన్‌ గుర్తుచేసుకున్నారు. 'ప్రభుత్వం ఈ పరీక్షల ఫలితాలను అంగీకరించడానికి ఒప్పుకోలేదు. పాశ్చాత్య దేశాల కన్న ఉన్నత సంప్రదాయాలు అనుసరించే భారత్‌ వంటి దేశంలో ఇలాంటి వైరస్‌ ప్రవేశించే ఆస్కారం ఉండదని అప్పట్లో ప్రభుత్వం భావించింది. కానీ పరీక్ష నమూనాలను వాషింగ్టన్‌ పంపి.. అక్కడ కూడా పాజిటివ్‌గానే వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈ విషయాన్ని అంగీకరించింది' అని సునీల్‌ తెలిపారు.

ఇప్పటికీ హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ వ్యాధి ముప్పు భారత్‌ను వేధిస్తూనే ఉంది. సురక్షిత శృంగారం, కండోమ్‌ వాడకం వంటి అవసరాన్ని, లైంగిక విద్య ఆవశ్యకతను ఇది చాటుతోంది.

>
మరిన్ని వార్తలు