కరోనాపై ఈ మందుల ప్రభావం ఎంత ?

1 Jul, 2020 15:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ దేశంలో రోజు రోజుకు విస్తరిస్తుండడంతో మళ్లీ లాక్‌డౌన్‌ తప్పకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. కేసులు ఎక్కువగా ఉన్న చెన్నైలో మరోసారి లాక్‌డౌన్‌ విధించారు. కరోనా విరుగుడికి వ్యాక్సిన్‌ అందుబాటులోకిరాని ప్రస్తుత పరిస్థితుల్లో అత్యయిక పరిస్థితుల్లో ‘యాంటీ వైరస్‌’ మందుల ఉత్పత్తికి, వాడకానికి కేంద్రం అనుమతి ఇవ్వడం కొంతలో కొంత మంచిదే. సిప్లా లిమిటెడ్, హెటరోడ్రగ్స్‌కు యాంటీ వైరస్‌ డ్రగ్‌ ‘రెమ్‌డిసివర్‌, ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్క్‌ కంపెనీకి ‘ఫెవిపిరావిర్‌’ ఉత్పత్తి, మార్కెటింగ్‌లకు అనుమతి లభించింది. మరికొన్ని రోజుల్లో కరోనా వైరస్‌ చికిత్స కోసం ఈ మందులు వైద్యులకు అందుబాటులోకి రానున్నాయి. ఇంతకుముందు ఈ మందులను ఎందుకోసం వాడేవారు ? వాటి ఫలితాలేమిటీ ? కరోనా వైరస్‌ చికిత్సకు వాడితే ఫలితాలేమిటీ? అన్న అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. (‘కరోనా వైరస్‌ బలహీనపడుతోంది’)

ఢిల్లీలోని మాక్స్‌ హెల్త్‌కేర్‌లో ఇంటర్నెల్‌ మెడిసిన్‌లో అసోసియేట్‌ డైరెక్టర్‌గా పని చేస్తోన్న రొమ్మెల్‌ టికూ కథనం ప్రకారం జపాన్‌లో అనేక సంవత్సరాలపాటు ‘ఇన్‌ఫ్లూయెంజా’ చికిత్సకు ఫెవిపిరావర్‌ను వాడారు. ఆ తర్వాత ఎబోలా వైరస్‌ చికిత్సకు పలు దేశాల్లో వాడారు. భారత్, చైనా, జపాన్‌ దేశాల్లో ఈ మందు వినియోగంపై కనీసం 30 ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి. ఈ డ్రగ్‌ను చైనా, జపాన్, రష్యా, యుఏఈ దేశాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వాటి ఫలితాలకు సంబంధించిన డేటా మాత్రం అందుబాటులో లేదు. ఫెవిపిరావర్‌ డ్రగ్‌పై మూడవ దశ పరీక్షలకు గ్లెన్‌మార్క్‌ను అనుమతి లభించినందున దాని ప్రయోగాలు ఆశాజనకంగానే ఉండవచ్చు. కోవిడ్‌ కేసుల్లో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఈ డ్రగ్‌ను వాడాలని డ్రగ్‌ కంట్రోలర్‌ విధించిన షరతు ఇక్కడ గమనార్హం. (దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ)

ఇక రెమ్‌డెసివర్‌ డ్రగ్‌ను కోవిడ్‌ రోగులపై ప్రయోగించిందీ ఎక్కువగా అమెరికాలో.  ఆ మందు వాడడం వల్ల 15 రోజుల్లో కోలుకోవాల్సిన వారు 11 రోజుల్లో కోలుకున్నారని, ఈ మందు వాడక ముందు కరోనా రోగుల్లో 11 శాతం మరణించగా, ఈ మందును వాడడం మొదలు పెట్టాక మరణాల సంఖ్య 8 శాతానికి తగ్గింది. మరణాలను కనీసం సగానికి సగం తగ్గించడంలో విఫలమైన ఈ డ్రగ్‌ వల్ల ఆశించిన ఫలితాలు ఉండే అవకాశం లేదని డాక్టర్‌ రొమ్మెల్‌ టికూ అభిప్రాయపడ్డారు. (కరోనా ఔషధం : పతంజలి కొత్త ట్విస్టు)

మరిన్ని వార్తలు