కొందరి చేతికే ఎలా?

16 Dec, 2016 00:50 IST|Sakshi
కొందరి చేతికే ఎలా?

కొత్తనోట్లపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
► రూ.24వేల విత్‌డ్రాయల్‌పై నోటిఫికేషన్ కు కట్టుబడి ఉండాలని సూచన
► డీసీసీబీలపై రెండ్రోజుల్లో నిర్ణయమన్న అటార్నీ జనరల్‌


న్యూఢిల్లీ: పెద్ద నోట్లరద్దు పథకం అమల్లోకి వచ్చిన తర్వాత కొందరు వ్యక్తుల వద్ద పెద్ద మొత్తంలో కొత్తనోట్లు పట్టుబడటంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సామాన్య ప్రజలకు అందుబాటులో నోట్లు లేక ఏటీఎంలు, బ్యాంకుల ముందు క్యూలు కడుతుంటే.. దేశవ్యాప్తంగా సోదాలు, దాడుల్లో వందల కోట్ల విలువైన కొత్తనోట్లు బయటపడటంపై కేంద్రాన్ని ప్రశ్నించింది. ‘కొత్త కరెన్సీ కొందరికి మాత్రమే పెద్ద సంఖ్యలో దొరుకుతోంది. ఎలా కొందరు ఇంత పెద్దమొత్తాన్ని సంపాదిస్తున్నారు?’అని కేంద్ర ప్రభుత్వాన్ని గురువారం సీజేఐ టీఎస్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. అయితే.. ‘కొందరు బ్యాంకు ఉద్యోగులు మోసపూరితంగా డబ్బులను బయటకు తరలించినట్లు తెలియటంతో వారిని అరెస్టు చేశారు. లెక్క తేలని ధనాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు దేశవ్యాప్తంగా సోదాలు కొనసాగుతున్నాయి’అని అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ కోర్టుకు తెలిపారు. కాగా, వారానికి రూ. 24వేల విత్‌డ్రాయల్‌ పరిమితికి కేంద్రం కట్టుబడి ఉండాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

‘పాతనోట్లను డిపాజిట్‌ చేస్తున్న వారికి మీరు డబ్బులివ్వాలి. కానీ అది జరగటం లేదు. మీ దగ్గర డబ్బులేదనే విషయాన్ని మేం అర్థం చేసుకున్నాం. ఎప్పటిలోగా ప్రజలు చేసుకున్న డిపాజిట్లకు సరైన మొత్తాన్ని చెల్లిస్తారో చెప్పండి. మీకూ కొన్ని నిబంధనలుండాలి కదా’అని ధర్మాసనం.. రోహత్గీని ప్రశ్నించింది. నోట్లరద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ పిటిషనర్‌ తరపున వాదిస్తున్న సీనియర్‌ అడ్వకేట్‌ కపిల్‌ సిబల్‌.. ‘జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లు నోట్లరద్దు తర్వాత మూడు రోజుల పాటు రూ.8వేల కోట్లు సేకరించినా.. తర్వాత ఈ బ్యాంకుల ద్వారా డబ్బులు మార్చుకునేందుకు అవకాశం ఇవ్వలేద’ని వాదించారు. దీనికి రోహత్గీ స్పందిస్తూ.. ‘సహకార బ్యాంకుల ద్వారా కొత్త నోట్ల పంపిణీపై రెండ్రోజుల్లో తాజా నోటిఫికేషన్ ఇస్తాం’అని తెలిపారు.

ఆర్బీఐ నిబంధనల పరిధిలోకి రానందునే సహకార బ్యాంకులకు కొత్తనోట్ల పంపిణీ అవకాశం ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. కొత్త కరెన్సీలో రూ.5లక్షల కోట్ల వరకు చెలామణిలోకి వచ్చిందని.. దీంతోపాటు రూ. 2.5లక్షల కోట్ల కరెన్సీ రూ.100, రూ.50 నోట్ల రూపంలో మార్కెట్లో ఉందని కోర్టుకు విన్నవించారు. నోట్ల రద్దుపై వివిధ హైకోర్టుల్లో వేస్తున్న పిటిషన్లను విచారించవద్దని రోహత్గీ కోరగా.. దీనిపై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సరైన ఆదేశాలిస్తామని ధర్మాసనం వెల్లడించింది.

గడ్డం క్రమశిక్షణకు అడ్డమే!
వాయుసేన ఉద్యోగి పిటిషన్ పై సుప్రీం కీలక తీర్పు
న్యూఢిల్లీ: వాయుసేనలో పనిచేసే వ్యక్తులు మత సంబంధ కారణాలతో క్రమశిక్షణను ఉల్లంఘించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. వాయుసేన (ఐఏఎఫ్‌) ఉద్యోగి అన్సారీ పొడవైన గడ్డంతో విధులకు హాజరవుతుండటాన్ని తప్పుపడుతూ ఐఏఎఫ్‌ 2003లో అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. దీనిపై అన్సారీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సిక్కులు తలపాగా ధరిస్తారని, వారిలాగే తనకూ మతపరమైన సమానత్వం కల్పించాలని కోరారు. సాయుధ దళాల నిబంధనలు క్రమశిక్షణను, ఏకరూపతను పాటించేలా చేయడానికి ఉద్దేశించినవంటూ ఐఏఎఫ్‌ చేసిన వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా, ఆ ధర్మాసనం ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సమర్థించింది.

>
మరిన్ని వార్తలు