దేశంలో ‘రేప్‌’లను ఆపేదెలా?

7 Dec, 2019 17:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘దిశ ఎన్‌కౌంటర్‌’లో నేరస్థులను హతమార్చినట్లే ప్రతి రేప్‌ కేసులో నిందితులను కాల్చి వేయాలని లేదా ఉరి తీయాలని డిమాండ్‌ దేశవ్యాప్తంగా ఊపందుకుంది. 2012లో ఢిల్లీలో జరిగిన ‘నిర్భయ’ రేప్‌ కేసు అనంతరం 2013 నుంచి దేశంలోని క్రిమినల్‌ చట్టాలను కఠినతరం చేస్తూ వచ్చారు. అదే నిర్భయ కేసులో నిందితులకు ఉరి శిక్షలు పడినా మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. అంతెందుకు ‘దిశ’ఎన్‌కౌంటర్‌’ జరిగిన రెండు రోజుల్లోనే దేశంలో మూడు రేప్‌ కేసులు నమోదయ్యాయి. 2012లో నమోదైన రేప్‌ కేసులకన్నా 2018లో రెట్టింపు రేప్‌ కేసులు నమోదయ్యాయి.

మరి మహిళలపై జరుగుతున్న ఈ అత్యాచారాలను ఆపడం ఎలా? అన్నది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. ‘జస్టిస్‌ వర్మ కమిటీ’ ఇచ్చిన నివేదికలోని అన్ని అంశాలను అక్షరాల అమలు చేయడమే అందుకు పరిష్కారం. క్రిమినల్‌ చట్టాలను మార్చడంతోపాటు పోలీసు సంస్కరణలను తీసుకరావాలని, లైంగిక దాడులు, గృహ హింస పట్ల పోలీసులతోపాటు మహిళలకు అవగాహన కల్పించాలని, పనిచేసే స్థలాల్లో మహిళలపై లైంగిక దాడుల నిరోధక చట్టం పరిధిలోకి పని మనుషులను తీసుకరావాలని, చివరకు ఎన్నికల సంస్కరణలను కూడా తీసుకరావాలని వర్మ కమిటీ సూచించింది.

ఉరి శిక్ష లాంటి కఠిన చట్టాలను మాత్రం తీసుకరావద్దని, వాటి వల్ల ప్రయోజనం కన్నా ప్రమాదమే ఎక్కువని వర్మ కమిటీ హెచ్చరించింది. ఆ కమిటీ చెప్పినట్లుగానే ‘దిశ’ నేరస్థులు దిశను చంపేశారు. ‘రేప్‌ సంక్షోభ సెల్‌’ను ఏర్పాటు చేయాలని, బాధితులకు ఈ సెల్‌ ద్వారా న్యాయ సహాయం కూడా ఉచితంగా అందించాలని కమిటీ సిఫార్సు చేసింది. రేప్‌ కేసుల్లో ఫిర్యాదుదారుకు ఆన్‌లైన్‌లోనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే అవకాశం ఉండాలని, ఈ సెల్‌లో రేప్‌ కేసుల దర్యాప్తునకు  సుశిక్షితులైన పోలీసులు ఉండాలని పేర్కొంది. రేప్‌ కేసులనే కాకుండా మహిళల పట్ల అసభ్య దూషణలను కూడా తీవ్రంగానే పరిగణించాలని చెప్పింది.

ప్రజాప్రాతినిధ్య చట్టంలో కూడా సంస్కరణలు తీసుకురావాలని, రేప్‌ కేసులో నిందితుడిపై చార్జిషీటు దాఖలయితే చాలు ఎన్నికల్లో నిందితుడి పోటీ చేయకుండా ఈ సంస్కరణలు ఉండాలని కూడా వర్మ కమిటీ సూచించింది. పిల్లల అనుభవాలను లింగ ప్రాతిపదికన చూడకూడదని, పిల్లలకు కూడా సెక్స్‌ ఎడ్యుకేషన్‌ ఇవ్వాలని, పెద్దలకు కూడా అక్షర జ్ఞానాన్ని అందించి అక్షరాస్యతను పెంచాలని, రేప్‌ సంఘటనలపై అన్ని వర్గాల ప్రజల్లో అవగాహన పించాలని... ఇలా పలు సూచనలు చేసింది వర్మ కమిటీ. కమిటీ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం రేప్‌ కేసుల నిర్వచనం మార్చి, కఠిన చట్టాలు తీసుకొచ్చింది తప్పా ఇతర సంస్కరణలను ఒక్కటి కూడా అమలు చేయలేదు.

‘నిర్భయ’ రేప్‌ సంఘటన నేపథ్యంలో సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వర్మ నాయకత్వాన అప్పటి కేంద్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని 2012, డిసెంబర్‌ 23వ తేదీన నియమించింది. ఆ కమిటీ ప్రస్తుత క్రిమినల్‌ చట్టాలను సమీక్షించడంతోపాటు  వివిధ ప్రజా సంఘాలు, బాధితులు, సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయలను కూడా పరిగణలోకి తీసుకొని సరిగ్గా నెల రోజుల్లో అంటే, జనవరి 23, 2013 నాడు నివేదిక సమర్పించింది.

చదవండి..

ఎన్‌కౌంటర్‌; సీజే కీలక వ్యాఖ్యలు

‘దిశ’ తిరిగిన న్యాయం

‘శ్రీనివాస్‌రెడ్డిని కూడా ఎన్‌కౌంటర్‌ చేయాలి’

మహిళలపై దాడులు: కేంద్రం కీలక ఆదేశాలు

మహబూబ్‌నగర్‌ ఆస‍్పతిలో ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం

ఉన్నావ్‌ బాధితురాలి మృతి: వెల్లువెత్తిన నిరసనలు
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు