'ఇంద్రాణికి మెంటల్‌.. మీరెలా నమ్మారు?'

1 Mar, 2018 15:03 IST|Sakshi

సాక్షి, చెన్నై : కన్న కూతురును చంపిన కేసులో రెండేళ్లుగా జైలులో ఉంటున్న ఇంద్రాణి ముఖర్జియా మాటలు ఎలా పరిగణనలోకి తీసుకుంటారని తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీ నేతలు పోలీసులను ప్రశ్నించారు. మాజీ ఆర్థికమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్ని అరెస్టు చేసిన సందర్భంగా వారు ఈ ప్రశ్నను సందించారు. ఇంద్రాణి గత రెండేళ్లుగా జైలులో ఉంటోందని, ఆమె మానసిక స్థితి సరిగా లేదని, ఆమె ఏవీ చెబితే వాటిని నమ్మి అరెస్టు చేస్తారా అని దాదాపు 200మంది కాంగ్రెస్‌ పార్టీ నేతలు వల్లవార్‌ కొట్టాంలో పెద్ద మొత్తంలో ఆందోళన చేస్తూ నిరసన నినాదాలు చేశారు.

ఇది బీజేపీ చేస్తున్న కక్ష సాధింపు చర్యలు తప్ప మరొకటి కాదని అన్నారు. ఇంద్రాణి మాటలను కోర్టు స్థాయిలో పరిశీలించాల్సి ఉంటుందని, ఆమె సరైన మానసిక స్థితిలో ఉండి చెప్పారో లేదో నిర్ధారించిన తర్వాతే పోలీసులు చర్యలు తీసుకోవాలి తప్ప ఇలా ఇష్టం వచ్చినట్లు చేయడం ఏమిటని నిలదీశారు. 'మీరు ఇంద్రాణి వాంగ్మూలాన్ని ఎలా విశ్వాసంలోకి తీసుకుంటారు? ఆమె మానసిక పరిస్థితి ప్రశ్నార్థకంగా ఉంది. రెండేళ్లుగా ఆమె జైలులో ఉంటోంది. ఆమె వాంగ్మూలాన్ని కోర్ట్‌ ఆఫ్‌ లా ప్రకారం మరోసారి ప్రశ్నించాల్సి ఉంటుంది.

ఈ కేసు బీజేపీ రాజకీయ కక్ష సాధింపు మాత్రమే' అని తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పీటర్‌ అల్ఫాన్స్‌ అన్నారు. క్విడ్‌ ప్రో కో కింద చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు కార్తీ పెద్ద మొత్తంలో లంఛాలు తీసుకొని ఇంద్రాణి, ఆమె భర్త ముఖర్జియాకు మేలు కలిగేలా చేశారని, కొన్ని కేసుల నుంచి తప్పించారని దీంతో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నష్టం జరిగిందనే కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు