మన రెవాలో ‘చైనా’

12 Jul, 2020 09:33 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇండియాలో ఏర్పాటు చేసిన పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టుల్లో ఒకటైన రెవాను భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఇది 750 మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేయగలదు. దీన్ని మధ్యప్రదేశ్​ ఊర్జా వికాస్​ నిగమ్ లిమిటెడ్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పడిన రెవా ఆల్ట్రా మెగా సోలార్​ లిమిటెడ్​ ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం తన వంతుగా 138 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. (ఢిల్లీలో కట్టడిపై మోదీ ప్రశంస)

చైనా తయారీ పరికరాలు
మొత్తం 1500 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సోలార్ పార్కులో ప్రతి 500 హెక్టార్లకు ఒక సోలార్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్​ ఉంది. ఈ మూడు యూనిట్లను చైనా నుంచి వచ్చిన పరికరాలతో మహీంద్రా రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆరిన్సన్ క్లీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ఏసీఎమ్ఈ జైపూర్ సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేశాయి. ఒక్కో యూనిట్ 250 మెగావాట్ల చొప్పున 750 మెగావాట్లను ఉత్పత్తి చేస్తాయి.

ప్రపంచబ్యాంకు గ్రూపునకు చెందిన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ ప్రాజెక్టులో 2,800 కోట్ల పెట్టుబడి పెట్టింది. గ్రీన్ కారిడార్ కింద పవర్ గ్రిడ్ కార్పొరేషన్​ ఆఫ్ ఇండియా 220/400కెవి అంతరాష్ట్ర ట్రాన్స్​మిషన్​ సిస్టమ్​ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా వినియోగదారులకు కరెంటును చేరుస్తారు.

తగ్గనున్న ఉద్గారాలు
ఈ సోలార్ పార్కు ద్వారా ఏటా దేశంలో 15 లక్షల టన్నుల కార్బన్​ డైయాక్సైడ్​ ఉద్గారాలు తగ్గుతాయని అంచనా. అందరూ అంటున్నట్లు రెవా సోలార్ పార్కు ఆసియాలో అతిపెద్దది కాదు. కానీ, దేశంలో ఉన్న పెద్ద ప్లాంటుల్లో ఇది కూడా ఒకటి.

రాజస్థాన్​లోని జోధ్​పూర్​ జిల్లాలో ఏర్పాటు చేసిన భద్లా సోలార్​ ప్రాజెక్టు 2,245 మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేయగలదు. కర్ణాటక పావగడ సోలార్​ పార్కు సామర్ధ్యం 2,050 మెగావాట్లు. బ్లూమ్​బర్గ్​కు చెందిన న్యూ ఎనర్జీ ఫైనాన్స్​ ప్రకారం రెవా కంటే తొమ్మిది పెద్ద సోలార్ పార్కులు ఉన్నాయి.

రెవా కరెంటు ఎవరు కొంటారు?
రకరకాల కస్టమర్లకు కరెంటు సరఫరా చేయనున్న తొలి భారతీయ సోలార్ పవర్ ప్లాంటు ఇదే. మధ్యప్రదేశ్ పవర్ మేనేజ్​మెంట్​ కంపెనీ లిమిటెడ్ ఈ పార్కులో ఉత్పత్తి అయ్యే 76 శాతం కరెంటును తీసుకుంటుంది. ఢిల్లీ మెట్రో కార్పొరేషన్​కి కూడా ఇక్కడి నుంచి కరెంటు అందుతుంది.

మరిన్ని వార్తలు