-

కరోనా వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలంటే!

31 Mar, 2020 16:14 IST|Sakshi

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్య నిపుణులు గత రెండు నెలలుగా చెబుతున్న విషయాలను వింటూనే ఉన్నాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి వైరస్‌ బారిన పడవచ్చు. అప్పుడు ఆ వైరస్‌ను తట్టుకొని ప్రాణాలను నిలబెట్టుకోవడం అందరి అవసరం. మరి అందుకు ఏం చేయాలి. మనుషుల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్లయితే ఒక్క కరోనానే కాదు, పలు రకాల వైరస్‌లను, బ్యాక్టీరియాలను తట్టుకొని బతికి బట్టకట్టవచ్చు. సహజంగా ఆరోగ్యవంతంగా ఎదుగుతున్న పిల్లల్లో, యువతీ యువకుల్లో రోగ నిరోధక శక్తి సహజంగా ఎక్కువగా ఉంటుంది. వృద్ధులవుతున్నా కొద్దీ రోగ నిరోధక శక్తి తగ్గుతూ వస్తుంది. ఆ శక్తి తగ్గకుండా పలు రకాల విటమిన్లు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు.
 
సీ విటమిన్‌ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని గత రెండు నెలలుగా తెగ ప్రచారం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సీ విటమిన్‌ సప్లిమెంట్లు, సైట్రిస్‌ కలిగిన పండ్లను తెగతింటున్నారు. అయితే ఇది ఒక నమ్మకమే తప్పా సీ విటమిన్‌ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందనడానికి శాస్త్ర విజ్ఞానపరంగా ఎలాంటి ఆధారాలు లేవని బిర్మింగమ్‌ యూనివర్శిటీ ‘ఇమ్యునిటీ అండ్‌ ఏజింగ్‌’ విభాగంలో పని చేస్తోన్న ప్రొఫెసర్‌ జానెట్‌ లార్డ్‌ చెప్పారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వ్యాయామమని, ఏ రకమైన వ్యాయామమైనా ఎంతో కొంత ఉపయోగకరమని ఆయన తెలిపారు. వ్యాయామం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచే ‘టీ–సెల్స్‌’ను శరీరంలో పెంచడంతోపాటు శరీరమంతా సంచరిస్తూ ఇన్‌ఫెక్షన్లను ఎప్పటికప్పుడు గుర్తించి రోగ నిరోధక వ్యవస్థకు సంకేతాలు పంపించే ‘మాక్రోఫేజెస్‌’ ఉత్పత్తి కూడా వ్యాయామం వల్ల పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలిందని ఆయన చెప్పారు. పైగా వ్యాయామం వల్ల వృద్ధాప్యం కూడా తొందరగ రాదని ఆయన తెలిపారు. 60 ఏళ్లు దాటిన వారు రోజుకు పది వేల మెట్లు ఎక్కడానికి సమానమైన దూరం నడిచినట్లయితే రోగ నిరోధక శక్తి బాగా పెరగుతుందని ఆయన చెప్పారు. (కరోనా వైరస్‌తో కొత్త లక్షణాలు)

ఇక డైట్‌లో ఉప్పును బాగా తగ్గించాలని, మోతాదుకు మించి ఉప్పును తీసుకున్నట్లయితే అది రోగ నిరోధక శక్తిని దెబ్బ తీస్తుందని సస్సెక్స్‌ యూనివర్శిటీలో ఇమ్యునాలోజీ విభాగం లెక్చరర్‌ జెన్నా మాక్సియోచి చెప్పారు. ఆల్కహాల్‌ కూడా మోతాదుకు మించి తీసుకోరాదని, అది కూడా రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తుందని ఆయన తెలిపారు. డీ విటమిన్‌ కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుందని ‘బ్రిటిశ్‌ సొసైటీ ఆఫ్‌ ఇమ్యునాలోజీ’ అధ్యక్షుడు, లండన్‌ యూనివర్శిటీ కాలేజ్‌ ఇమ్యునాలోజీ ప్రొఫెసర్‌ అర్నే అక్బర్‌ తెలిపారు. మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులో విటమిన్‌ డీ ఉంటుంది. ఉదయం పూట ఎండలో నిలబడినా డీ విటమిన్‌ వస్తుంది. రోగ నిరోధక శక్తిలో డీ విటమిన్‌ తర్వాత ఈ విటమిన్, జింక్‌ ప్రధాన పాత్రను పోషిస్తాయి. కాజు, పల్లీలు, బాదం గింజలతోపాటు విజిటెబుల్‌ ఆయిల్స్, సోయాబిన్, సన్‌ ఫ్లవర్‌ ఆయిల్స్‌ ద్వారా ఈ విటమిన్‌ లభిస్తుందని పలువురు వైద్యులు తెలిపారు. మాంసం, నత్త గుల్లలు, పాల ఉత్పత్తుల్లో, బలవర్థకమైన తృణ ధాన్యాల్లో జింక్‌ లభిస్తుందని వారు తెలిపారు. 

ఎలాంటి శారీరక శ్రమ లేకుండా వీటిన్నింటిని తింటున్నాం కనుక రోగ నిరోధక శక్తి పెరుగుతుందనుకుంటే పొరపాటని, ఎంతోకొంత శారీరక శ్రమ ఉంటేనే రోగ నిరోధక శక్తిపై విటమిన్ల ప్రభావం ఉంటుందని, కొన్ని లక్షల కోట్ల వైరస్‌లను, బ్యాక్టీరియాలను ఎదుర్కోవాలంటే శారీరక దృఢత్వం అవసరమని వైద్యులంతా సూచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు