‘జియో’కు ఏం ఎక్కువ, మాకేం తక్కువా?

12 Jul, 2018 15:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని అనేక ప్రముఖ ఉన్నత విద్యా సంస్థలను కాదని ఇంకా ఆవిర్భవించని ‘జియో ఇనిస్టిట్యూట్‌’ విద్యా సంస్థకు ‘ఎమినెన్స్‌ (అత్యున్నత)’ హోదాను కేంద్ర ప్రభుత్వ కల్పించడాన్ని ఈ హోదా కోసం జియోతో పోటీ పడిన సంస్థలేవీ ఇంకా జీర్ణించుకోలేక పోతున్నాయి. అలా పోటీ పడిన 27 ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల్లో ‘టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్, ఓపీ జిందాల్‌ యూనివర్శటీ, అజీం ప్రేమ్‌జీ యూనివర్శిటీ, అశోక యూనివర్శిటీ, నర్సీ మోంజీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ లాంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం నడుస్తున్న విద్యా సంస్థల పురోగతి రికార్డును పరిగణలోకి తీసుకోకుండా ఎంత అద్భుతమైన ప్రణాళికలను చూపించినప్పటికీ రాబోయే విద్యా సంస్థ అద్భుతమైన పురోగతిని సాధిస్తుందని ఎలా విశ్వసిస్తారని ఈ హోదా దక్కని విద్యా సంస్థలు ప్రశ్నిస్తున్నాయి.

‘జియో ఇనిస్టిట్యూట్‌’ను ప్రతిపాదించిన రిలయెన్స్‌ గ్రూపునకు దేశంలో చాలా మంచి పేరున్నందున, ఆ గ్రూప్‌ చేపట్టిన అన్ని ప్రాజెక్టులు విజయవంతంగా నడుస్తున్నందున, విద్యా సంస్థ కోసం 9,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినందున, సంస్థను ఏర్పాటు చేసిన 10 ఏళ్లలోనే ప్రపంచంలోని టాప్‌ 500 ఉన్నత విద్యా సంస్థల్లో ఒకటిగా నిలిస్తుందని పూర్తి విశ్వాసం కలిగినందున ఆ సంస్థకు ‘ఎమినెన్స్‌’ హోదా ఇచ్చామని ఇటు ఎంపిక కమిటీ, అటు కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంటోంది. అయితే ఈ హోదా కోసం యూజీసీ ప్రతిపాదించిన ప్రమాణాల మేరకే హోదా ఇచ్చారా ? అన్న విషయాన్ని మాత్రం సూటిగా చెప్పడం లేదు.

‘గ్రీన్‌ఫీల్డ్‌’ కేటగిరీ కింద ఇచ్చామంటూ చెప్పిందే చెబుతూ సమర్థించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయోత్నిస్తోంది. ఎందులో జియోతో తాము సరితూగమో చెప్పండని ఈ గ్రీన్‌ఫీల్డ్‌ కేటగిరీ కిందనే దరఖాస్తు చేసుకున్న తమిళనాడులోని ప్రతిపాదిత క్రియా యూనివర్శిటీ (దీనికి మాజీ ఆర్బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ సలహాదారు), ఒరిస్సా వేదాంత యూనివర్శిటీ, హైదరాబాద్‌లోని ప్రముఖ ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. గ్రీన్‌ఫీల్డ్‌ కింద ఎందుకు దరఖాస్తు చేసుకున్నారని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ యాజమాన్యాన్ని మీడియా ప్రశ్నించగా, యూనివర్శిటీ, డీమ్డ్‌ యూనివర్శిటీ హోదాలేని ఉన్నత విద్యా సంస్థలు గ్రీన్‌ఫీల్డ్‌ క్యాటగిరీ కింద దరఖాస్తు చేసుకోవచ్చని 2017, నవంబర్‌ 17న యూజీసీ వివరణ ఇచ్చిందని, ఆ వివరణ మేరకు దరఖాస్తు చేసుకున్నామని తెలిపింది. తమ సంస్థలో భారతీయ విద్యార్థులతోపాటు విదేశీ విద్యార్థులు కూడా గణనీయంగా చదువుతున్నారని పేర్కొంది.

గ్రీన్‌ఫీల్డ్‌ కేటగిరీ కింద ఒకే ఒక్క సంస్థకు అత్యున్నత హోదా ఇస్తున్నారని తెలియడంతో అది కాస్త జియోకే దక్కుతుందని తాము భావించామని, అందుకు ఆ సంస్థకు, ప్రభుత్వానికున్న రాజకీయ, ఆర్థిక సంబంధాలు, రాజకీయ సమీకరణలు కారణం కావొచ్చని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని విద్యా సంస్థల యాజమాన్యాలు మీడియా ముందు వ్యాఖ్యానించాయి. ‘ఎమినెన్స్‌’ హోదా కింద ప్రత్యక్షంగా ప్రభుత్వ ప్రోత్సహకాలు ఏమీ ఉండకపోయినా విద్యా సంస్థపై పెట్టే పెట్టుబడులకు పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది.

చదవండి: రిలయెన్స్‌ మీద అంత మోజెందుకు?

మరిన్ని వార్తలు