‘కిక్కు’ లేకుండా ఖజానా మనలేదా?

8 Apr, 2017 07:50 IST|Sakshi
‘కిక్కు’ లేకుండా ఖజానా మనలేదా?

మన దేశంలోని చాలా రాష్ట్రాలకు ప్రధాన ఆదాయవనరుల్లో ఒకటి మద్యం. మద్య నిషేధానికి డిమాండ్లు ఉన్నప్పటికీ... అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆదాయాన్ని వదులుకోవడానికి అంత సుముఖత చూపవు. చాలా రాష్ట్రాలకు మొత్తం ఆదాయంలో ఐదో వంతు మద్యం ద్వారానే వస్తోంది. అయితే మద్యం అమ్మకాల ద్వారా లభించే ఎక్సైజ్, వ్యాట్‌ తదితర పన్ను ఆదాయం లేకపోయినప్పటికీ రాష్ట్ర ఖజానాకు పెద్దగా నష్టమేమీ ఉండదని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ అంటున్నారు.

ప్రజారోగ్యంపై, జీవన ప్రమాణాలపై, ఆలోచనలు, ప్రవర్తనపై గణనీయమైన ప్రభావం ఉంటుందని... అందుకని మిగతా రాష్ట్రాలు కూడా మధ్య నిషేధం దిశగా ఆలోచన చేయాలని ఇటీవలే పిలుపునిచ్చారు. బిహార్‌లో మధ్య నిషేధం అమలులోకి వచ్చి ఈనెల ఐదో తేదీకి ఏడాది పూర్తయింది. మద్యనిషేధం అమలు నిర్ణయం సత్ఫలితాలను ఇస్తోందని చెప్పడానికి బిహార్‌ ప్రభుత్వం అసెంబ్లీ ముందుపెట్టిన, ఇతరత్రా విడుదల చేసిన గణాంకాలను ఒకసారి పరిశీలిద్దాం...

నష్టం రూ. 5 వేల కోట్లే
మద్యం అమ్మకాలపై ఎక్సైజ్‌ సుంకం, వ్యాట్‌ ద్వారా బిహార్‌ ఖజానాకు ఏడాదికి ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం జమ అయ్యేది. ఇది కోల్పోయినా... 2015–16 ఆర్థిక సంవత్సరంతో సమానంగా 2016–17లోనూ ఆదాయం వచ్చిందని నితీశ్‌ ఈనెల ఐదున వెల్లడించారు. అయితే ప్రతి సంవత్సరం రాష్ట్రాల పన్ను ఆదాయంలో ఎంతోకొంత వృద్ధి ఉంటుంది. అది రాలేదు. మద్యనిషేధం ద్వారా వచ్చే నష్టాన్ని పూడ్చుకోవడానికి బిహార్‌ ప్రభుత్వం కిందటి ఆర్థిక సంవత్సరంలో వ్యాట్‌ను నాలుగుసార్లు పెంచింది. ఐదు వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా... మద్యంపై ఖర్చు పెట్టే 10 వేల కోట్ల రూపాయలు ప్రజలకు మిగిలాయని నితీశ్‌ చెప్పారు. ఈ పదివేల కోట్లు ప్రజలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకోవడానికి వాడితే... కొనుగోళ్లు పెరిగి ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని, తద్వారా ప్రభుత్వానికి పన్ను రూపంలో ఆదాయమూ వస్తుందనేది ఆయన వాదన.

నేరాలు తగ్గాయి...
మధ్య నిషేధం అమలులో ఉన్న 2016 ఏప్రిల్‌– డిసెంబర్‌ మాసాల గణాంకాలను 2015 ఏప్రిల్‌– డిసెంబరు కాలంతో పోలిస్తే... బిహార్‌లో నేరాలు 27 శాతం తగ్గాయి.
► హత్యలు 22 శాతం తగ్గాయి
► దొంగతనాలు 23 శాతం తగ్గాయి.
► గలాటాలు 33 శాతం తగ్గాయి.
► రోడ్డు ప్రమాదాలు 17 నుంచి 20 శాతం దాకా తక్కువ నమోదయ్యాయి.

2016–17లో అమ్మకాల పెరుగుదల (వృద్ధి శాతం అంకెల్లో)
తేనె                                                    390
చీజ్‌                                                    200
ఆహారధాన్యాలు                                     88
ప్రాసెస్డ్‌ ఫుడ్‌                                          48
మజ్జిగ– లస్సీ                                        40
టీ– కాఫీ                                               27
పాలు                                                   18
దుస్తులు                                               49
ఎంటర్‌టైన్‌మెంట్‌                                     37
గృహోపకరణాలు                                     31
క్రీడా పరికరాలు                                       29
ఎఫ్‌.ఎం.సి.జి.                                         24
ద్విచక్ర వాహనాలు                                  23
ఆభరణాలు                                            11

సామాజిక ప్రభావం
► ప్రజారోగ్యం మెరుగుపడింది
► కుటుంబాల్లో ప్రశాంతత
► ఇదివరకు మద్యంపై ఖర్చుపెట్టే డబ్బుతో కుటుంబ అవసరాలు తీరుతున్నాయి. జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. కుటుంబాలు సంతృప్తిగా ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు.
► తాగి గొడవలు పడటం, కుటుంబీకులపై దాడులకు దిగడం లాంటివి లేవు.
► పురుషులు కుటుంబంతో సమయం వెచ్చిస్తున్నారు. తాగేసి ఏ పదికో ఇంటికొచ్చేవారు... ఇప్పుడు తొందరగా ఇళ్లకు చేరుతున్నారు.

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
 

మరిన్ని వార్తలు