ఆమెకు ఎన్ని చేతులున్నాయి?

20 Aug, 2016 17:26 IST|Sakshi
ఆమెకు ఎన్ని చేతులున్నాయి?

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఎన్ని చేతులు ఉన్నాయి.. అసలు రోజులో ఆమెకు ఎన్ని గంటలు ఉంటున్నాయని నెటిజన్లకు ఆశ్చర్యం వేస్తోంది. ఒకవైపు విదేశాలతో సంబంధాలు జాగ్రత్తగా నెరపడంతో పాటు మరోవైపు ఒలింపిక్ పతక విజేతలను అభినందిస్తుంటారు. ఇంకోవైపు పతకాలు రానివారిని ఓదారుస్తుంటారు. ఇంకా గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తుంటారు. ఇవన్నీ కాక.. ప్రజలకున్న పాస్‌పోర్టు సమస్యలను కూడా తీరుస్తానంటున్నారు. దీనంతటికీ ఆమెకు సమయం ఎక్కడి నుంచి దొరుకుతోందంటే.. ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం ఆమె రిటైరైన తర్వాత ఆత్మకథ రాస్తే అందులో వెతుక్కోవాల్సిందేనని ట్విట్టర్ జనాలు అంటున్నారు.

రియో ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో తీవ్రంగా గాయపడిన వినేష్ ఫోగట్‌ను.. 'నువ్వు మా కూతురి లాంటి దానివి' అంటూ ఓదార్చిన ఆమె, తాజాగా సైనా నెహ్వాల్‌ను కూడా త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. మరోవైపు తమకు పాస్‌పోర్టు సమస్య ఉందని చెప్పినవాళ్లకు ఆ సమస్యను పరిష్కరిస్తానంటూ ఊరట కలిగిస్తున్నారు. అవసరమైనప్పుడు ఆయా ట్వీట్లలో కొంత హాస్యం కూడా జోడిస్తూ అవతలి వాళ్లను నవ్విస్తున్నారు.

తాజాగా సింగపూర్‌లో ఉంటున్న ఆరిఫ్ రషీద్ జర్గర్ అనే భారతీయుడికి ఇటీవలే కొడుకు పుట్టాడు. అతడికి పాస్‌పోర్టు తీసుకోవడం బాగా ఇబ్బంది అవుతోంది. దాంతో అతడు తన చిన్నారి కొడుకును చూసుకోలేకపోతున్నాడు. దాంతో జర్గర్ ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ట్వీట్ చేశాడు. తన పిల్లాడికి పాస్‌పోర్టు రాకపోతే, అతడు వాట్సప్ లేదా స్కైప్‌లనే తన తండ్రి అనుకుంటాడంటూ ట్వీట్‌లో తెలిపాడు. దాంతో సుష్మా అతడికి సమాధానం పెడుతూ.. అలాగైతే చాలా కష్టం అయిపోతుందని, తాను కలగజేసుకుని ఇప్పిస్తానని తెలిపారు.

 

మరిన్ని వార్తలు