ప్రాణాలు కాపాడే మిల్క్ బ్యాంకులు!

19 Apr, 2016 21:07 IST|Sakshi

తల్లిపాల్లో ఉండే పోషకాలు శిశువులను ఆరోగ్యంగా ఉంచుతాయి. పోషకాహార లోపంతో బాధపడే పిల్లలకు తల్లిపాలు అమృతంలా పనిచేస్తాయి. ఫార్ములా పాలు, పిండి పాలల్లో తల్లిపాలల్లో వలె వ్యాధి నిరోధకాలు, ఎంజైములు, హార్మోన్లు ఉండే పరిస్థితి లేదు. అందుకే తల్లి పాలకు మరే పాలు ప్రత్యామ్నాయం కాదు. అందుకే ఇప్పుడు రాజస్థాన్ లో తల్లిపాల బ్యాంకులు ఏర్పాటు చేసి ఎందరో బిడ్డల ప్రాణాలు నిలిపేందుకు కృషి చేస్తున్నారు.

ఇండియాలో పుట్టిన ప్రతి వెయ్యిమంది శిశువుల్లో 40 మందిదాకా ఐదేళ్ళు నిండక ముందే చనిపోతున్నారు. అయితే ముందు జాగ్రత్తలను విస్మరించడమే మరణాలకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. ముఖ్యంగా శివువుల మరణాల్లో రాజస్థాన్ రాష్ట్రం అగ్రభాగంలో ఉంది. ఐదేళ్ళు నిండక ముందే చనిపోయే పిల్లలు ఇక్కడ అత్యధికంగా 47 శాతం ఉంటున్నారు.అయితే పౌష్టికాహారం గల తల్లిపాలతో ఇటువంటి మరణాలను నివారించవచ్చు అన్న విషయాన్ని గుర్తించి, రాష్ట్రంలో ఇటీవల మూడు తల్లిపాల బ్యాంకులను ఏర్పాటు చేశారు. బిడ్డల పౌష్టికాహార లోపానికి కేరాఫ్ అడ్రస్ అయిన ఓ అనాధాశ్రమంలో ముందుగా దివ్యా మదర్ మిల్క్ బ్యాంకును దేవేంద్ర అగర్వాల్ స్థాపించారు. రాజస్థాన్ ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షల రూపాయల నిధులతో 2013 లో ఉదయపూర్ లో పాల బ్యాంకును స్థాపించి అప్పటినుంచీ  సేవలు అందించడం ప్రారంభించాడు.

దివ్యా మదర్ మిల్క్ బ్యాంక్ (డీఎంఎంబి) స్థాపనతో గత మూడేళ్ళలో సుమారు 1500 మంది శిశువుల ప్రాణాలను రక్షించగలిగారు. అనంతరం తల్లిపాలపై అవగాహనతో అనేకమంది  మిల్క్ బ్యాంకులకు పాలను అందించేందుకు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో జైపూర్ మహాత్మా గాంధీ ఆస్పత్రిలో ఫిబ్రవరిలో ప్రారంభించిన మిల్క్ బ్యాంకుకు 74 మంది వరకూ పాలను డొనేట్ చేయడంతో ఇప్పటికే 25 వేల మిల్లీలీటర్ల పాలను బ్యాంకులో  సేకరించారు. అమృత్ పేరిట స్థాపించిన ఈ పాల బ్యాంకు నుంచి స్థాపించిన రెండు నెలల్లో 196 యూనిట్ల పాలను శిశువులకు వినియోగించారు. బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఇండియా లెక్కల  ప్రకారం దక్షిణాసియా దేశాలతో పోలిస్తే  భారత్ బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో ముందే ఉన్నప్పటికీ... కొందరు తల్లుల్లో అవగాహన లోపం పిల్లల ప్రాణాల మీదకు తెస్తుంది. తల్లుల్లో పోషకాహార లోపం కూడ పిల్లలకు పాలు లేకుండా చేస్తుంది.

తల్లిపాలు తాగిన పిల్లలు... తాగనివారికంటే ఆరు రెట్టు ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉందని తల్లిపాల దినోత్సవాల సందర్భంలో యునిసెఫ్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తల్లిపాలు ప్రపంచంలోని 13 శాతం మంది పిల్లల ప్రాణాలను రక్షిస్తున్నట్లు యునిసెఫ్ తెలిపింది. ఇండియాలో మొదటి మిల్క్ బ్యాంక్ 'స్నేహ'ను 1989 లో ముంబైలో అర్మిదా ఫెర్నాండెజ్ స్థాపించారు. తల్లులనుంచి సేకరించిన పాలను ప్రభుత్వాసుపత్రుల్లో నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలకు అందించేందుకు వినియోగించేవారు. డాక్టర్ ఫెర్నాండెజ్ స్థాపించిన ఆ బ్యాంకు... ఎంతోమంది పిల్లలకు ప్రాణాలు పోస్తూ 2014 లో 25 ఏళ్ళ వేడుకను కూడ జరుపుకొంది. ప్రస్తుతం గేదె, ఆవు పాలను పాశ్చురైజ్ చేస్తున్నట్లుగానే తల్లిపాలను కూడ ఇక్కడ పాశ్చురైజ్ చేసి నిల్వ చేస్తున్నారు. ఈ పాలను ఆర్నెల్లలోపు అవసరమైన పిల్లలకు అందించి వారి ప్రాణాలను కాపాడేందుకు వినియోగిస్తున్నారు. ఈ పద్ధతిలో పాలను నిల్వ చేసేందుకు ఇష్టపడే తల్లులు సదరు బ్యాంకుల్లో ముఖ్యంగా ఆస్పత్రుల్లో ఉండే బ్యాంకుల్లో సంతకం చేసి పాలను డొనేట్ చేస్తే... ఎంతోమంది శిశువుల ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. ఇప్పడు ముంబైతోపాటు దేశంలోని చాలా నగరాల్లో ఈ మిల్క్ బ్యాంకులు ఏర్పాటు చేశారు. మిగిలిన దేశాలతో పోలిస్తే ఇండియాలో ఈ బ్యాంకులు తక్కువగా ఉన్నాయి. ఇప్పటికైనా మరిన్ని మిల్క్ బ్యాంకులను స్థాపించి శిశుమరణాల నివారణకు ప్రతి ఒక్కరూ  సహకరించాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు