ప్రమాదంలో ఆదుకునే అత్యాధునిక డివైస్

16 Jan, 2016 07:57 IST|Sakshi
ప్రమాదంలో ఆదుకునే అత్యాధునిక డివైస్

త్రివేండ్రమ్: జాతీయ రహదారిపై మన కారు జుయ్‌న దూసుకెళుతున్నప్పుడు ఊహించని ప్రమాదం జరగొచ్చు. కారులో వెళుతున్న వారంతా తీవ్రంగా గాయపడొచ్చు. సాయం కోసం అరిచే పరిస్థితి లేకపోవచ్చు. అరిచినా వినిపించుకునే నాథుడు లేకపోవచ్చు. ఉన్నా మనకు ఎలా సాయం చేయాలో తెలియక పోవచ్చు. అంబులెన్స్‌నో, పోలీసులనో పిలిచేందుకు సాయం చేయడం కోసం వచ్చిన వాళ్ల చేతుల్లో సెల్‌ఫోన్లు లేకపోవచ్చు. ఉన్నా సిగ్నల్స్ అందకపోవచ్చు. క్షతగాత్రులను ఎలాగో తరలించాలనుకున్నా దగ్గర్లో వాహనం అందుబాటులో ఉండకపోవచ్చు. మరి, అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి?

మనం నిమిత్త మాత్రులమైనా మన ప్రమేయం లేకుండానే అన్నీ తానై తాను చేసుకుపోయే అద్భుత ‘సేఫ్ డ్రై వ్ డివైస్’ను కేరళలోని త్రివేండ్రమ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రసాద్ పిళ్లై  రూపొందించారు. సెన్సర్ల ద్వారా జరిగిన ప్రమాదాన్ని గుర్తించి ఈ డివైస్ తక్షణమే స్పందిస్తుంది. ఎలక్ట్రానిక్ నెట్‌వర్క్, జీపీఎస్ వ్యవస్థ ద్వారా ప్రమాదం జరిగిన చోటును గుర్తించడమే కాకుండా దానంతట అదే సమీపంలోవున్న ఆస్పత్రికి లేదా అంబులెన్స్ సర్వీసుకు, పోలీసులకు, మనం ఫీడ్ చేసుకున్న కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు ప్రమార సమాచారాన్ని క్షణాల్లో చేరవేస్తోంది.

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వల్ల ఏటా 28 శాతం మంది మరణిస్తున్నా, వారిలో ఎక్కువ మంది సకాలంలో సహాయం అందకనే మరణిస్తున్నారని గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఈ కారణంగా ఈ డివైస్ ఎంతో మేలు. దీన్ని ఆటో, కారు, జీపు, టూ వీలర్లకు అమర్చుకోవచ్చు. అంతేకాకుండా డ్రైవర్ సరిగ్గా వాహనాన్ని నడపకపోయినా గుర్తించి యజమాని లేదా కారులో ప్రయాణికులను ముందస్తుగా హెచ్చరిస్తుంది. కారు వేగం, మలుపులు, కుదుపులను సెన్సర్ల ద్వారా గుర్తించి డ్రై వింగ్ గురించి అవసరమైన హెచ్చరికలు జారీ చేస్తోంది.  అమెరికాలో 15 ఏళ్లుగా పనిచేస్తున్న  ప్రసాద్ పిళ్లై రెండు సంవత్సరాల క్రితం స్వగ్రామం త్రివేండ్రమ్‌కు వచ్చినప్పుడు ఎదురైన ఓ అనుభవం నుంచి ఈ డివైస్ పుట్టుకొచ్చింది.

ఓ రోజు ప్రసాద్ పిళ్లై తన భార్య పిల్లలతో కారులో ప్రయాణిస్తుండగా బ్రేకులు పనిచేయక కారు ప్రమాదానికి గురైంది. ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారు. ముందుకు కదలేని పరిస్థితుల్లో ఉన్న కారును వదిలేసి వెళ్లాలన్నా ఎలా వెళ్లాలన్న సంశయం.  సిగ్నల్స్ అందక సెల్‌ఫోన్ కూడా పనిచేయలేదు. ఎవరి సాయం ఎలా అర్థించాలో అర్థం కాలేదు. చాలా సేపటి వరకు ఆ రోడ్డున ఎవరూ రాలేదు. చివరకు కారును అక్కడే వదిలేసి దారిన పోయే ఓ వాహనాన్ని పట్టుకొని ఎలాగో ఒకలాగా ఇంటికి చేరుకున్నారు. ఇలాంటి డివైస్‌ను ఒకదాన్ని తయారు చేయాలని ఆ రోజే అనుకున్నారు. అమెరికా జాబ్‌కు గుడ్‌బై చెప్పారు.

 జయంత్ జగదీష్ అనే మిత్రుడితోపాటు మరో ఐదుగురిని సమీకరించి ‘ఎల్సీస్ ఇంటెలిజెంట్ డివెసైస్ ప్రై వేట్ లిమిటెడ్ ’ సాఫ్ట్‌వేర్ కంపెనీని ఏర్పాటు చేశారు. రెండేళ్లు కష్టపడి ఈ సరికొత్త డివైస్‌ను రూపొందించారు. ఫిబ్రవరి నెలలో మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఒక్కో డివైస్ వెలను  పదివేల రూపాయలుగా నిర్ణయించారు. ఏడాదికి వెయ్యి రూపాయల సర్వీసు చెల్లించాల్సి ఉంటుంది. ఈ డివైస్‌ను భవిష్యత్తులో మరింత అభివద్ధి చేస్తామని, దీనితో అనుసంధానించడానికి ఓ కాల్ సెంటర్‌నే ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ప్రసాద్ పిళ్లై తెలిపారు.

మరిన్ని వార్తలు